రేపు ఏపీ మంత్రివర్గ సమావేశం
రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులు, 67 వేల ఉద్యోగాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు (అక్టోబర్ 10, శుక్రవారం) ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో దేశ చరిత్రలో అతిపెద్ద విదేశీ పెట్టుబడులతో పాటు, అమరావతి అభివృద్ధి, రాజధాని ప్రాంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. మొత్తం 26 ప్రాజెక్టులకు రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని సీఎం చంద్రబాబు అంచనా వేస్తున్నారు.
విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్
సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం విశాఖపట్నంలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటు. గూగుల్ సబ్సిడియరీగా పనిచేస్తున్న ఈ కంపెనీకి రూ.87,520 కోట్ల ($10 బిలియన్లు) పెట్టుబడితో 1GW AI డేటా సెంటర్ నిర్మాణానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇది దేశ చరిత్రలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI)గా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టు 2028-2032 మధ్య ఏడాదికి రూ.10,518 కోట్లు GSDPకు దోహదపడుతుందని, 1.88 లక్షల ఉద్యోగాలు సృష్టించనుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. విశాఖను 'AI సిటీ'గా అభివృద్ధి చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని సీఎం చంద్రబాబు ముందుగానే ప్రకటించారు.
అమరావతి అభివృద్ధి: రాజ్‌భవన్, కన్వెన్షన్ సెంటర్లు, క్వాంటం కంప్యూటింగ్
రాజధాని అమరావతి అభివృద్ధిపై దృష్టి సారించిన మంత్రివర్గం, కృష్ణా నది ఒడ్డున గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో రాజ్‌భవన్ నిర్మాణానికి రూ.212 కోట్లు కేటాయించి ఆమోదం తెలపనుంది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి CRDA 25% నిధులు అందించేలా కూడా ఆమోదించనున్నారు. అమరావతిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలకు అవసరమైన మార్పులు చేర్పులకు మంత్రివర్గం ఓకే ఇవ్వనుంది. అలాగే, అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి CRDAను ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా నియమించేలా ఆమోదం తెలపనుంది.
ఇతర కీలక నిర్ణయాలు
హ్యాపీ నెస్ట్, ఏపీ ఎన్నార్టీ ప్రాజెక్టులకు చెందిన బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కొండవీడు వాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8,400 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. పలు సంస్థలకు భూమి కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.