సాయంత్రం 6 తర్వాతే ఎగ్జిట్ పోల్స్.. ఆంధ్రా అంతటా అలర్ట్

మోదీ ధ్యానం వంటి దానికే వందలాది కెమెరామెన్లు వేచి చూస్తున్నారు. ఇక ఎన్నికలు, ముందస్తు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ పై ఎంత హడావిడి ఉంటుందో చెప్పనలవి కాదు.

By :  Admin
Update: 2024-06-01 03:33 GMT

జూన్ 1.. సాయంత్రం 6 గంటలకు సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన ఏడో దశ పోలింగ్ ముగుస్తుంది. జూన్ నాలుగున కౌంటింగ్ మొదలవుతుంది. ఈలోపు మీడియా హడావిడి ఎంత ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్యానం వంటి దానికే వందలాది కెమెరామెన్లు వేచి చూస్తున్నారు. ఇక ఎన్నికలు, ముందస్తు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ పై ఎంత హడావిడి ఉంటుందో చెప్పనలవి కాదు. ఎన్నికల సంఘం నిబంధనావళి ప్రకారం సాయంత్రం 6 గంటల వరకు ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించడానికి వీలు లేదు. సాయంత్రం 6 తర్వాతే అసలు కథ మొదలవుతుంది.

దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒకటి. నాలుగో విడతలో ఎన్నికలు జరిగాయి. జూన్ ఒకటి సాయంత్రం 6 గంటల తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం జనం ఎదురుచూస్తుంటే ఏ గొడవలు జరక్కుండా ఎలా చూడాలో పోలీసులు సతమతం అవుతున్నారు. కట్టుదిట్టాల చర్యల్లో భాగంగా నేరగాళ్లపై పోలీసులు కన్నేసి ఉంచారు. ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించారు. మాక్ డ్రిల్‌లు చేశారు. బజార్లలో ఎక్కడా పది మంది గుమికూడకుండా చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఈరోజు విడుదల కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాలలో ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించనున్నట్టు వివిధ వార్తా సంస్థలు తెలిపాయి.
జూన్ 1వ తేదీ సాయంత్రం (శనివారం) ఏడో దశ పోలింగ్ పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.

వివిధ వార్తా సంస్థలు, ఎన్నికల విశ్లేషకులు, స్వతంత్ర సంస్థలు, మీడియా సంస్థలు సాయంత్రం 6 గంటల తర్వాత తమ ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించనున్నట్టు తెలిపాయి.
“ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో హింస చెలరేగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేశాం. అందుకే వీధుల్లో గస్తీని పెంచాం. పోలీసు పహారాను ఎక్కువ చేశాం” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల పెద్దలు, శాంతి కమిటీల సభ్యులతో పోలీసులు సమన్వయ సమావేశాలు నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
చాలా మంది నేరగాళ్లను, రౌడీషీటర్లను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా నేరస్థులు బయటకు రాకుండా హెచ్చరికలు జారీ చేశారు. కొందరు వాళ్ల వాళ్ల సొంతూరు నుంచి బయటకు పంపారు. సోషల్ మీడియా గ్రూప్‌లలో రెచ్చగొట్టే సందేశాలు పోస్ట్ చేయవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇప్పటికే 16 మందిని అరెస్టు చేశారు. 3,524 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్‌డిపిఎల్), డ్యూటీ పెయిడ్ లిక్కర్ (డిపిఎల్), పులియబెట్టిన బెల్లం వాష్‌లను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నామని చెప్పారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) హరీష్ కుమార్ గుప్తా. శనివారం రాష్ట్రవ్యాప్తంగా తనికీలు జరుగుతున్నాయి. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.
"గ్రామ స్థాయిలో పోలీసులతో డ్రిల్ చేయిస్తున్నారు. ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించారు. పోలీసులు మైకులు, ఇతర ప్రచార, ప్రసార సాధనాల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరైనా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కృష్ణా జిల్లా ఎస్పీ నయీమ్ అస్మీ. విజయవాడలో జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, మైలవరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, సివిల్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ సిబ్బంది ఆధ్వర్యంలో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు.
ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా గొడవలు జరిగే అవకాశం ఉన్నట్టు ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఐదారు జిల్లాలలో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇద్దరు చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. పార్లమెంటు ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా మే 13న ఒకేసారి ఎన్నికలు జరిగాయి.
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అధికార వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగగా ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. అత్యంత ఉత్కంఠ బరితంగా జరిగిన పోలింగ్ లో ఉభయ పక్షాలూ తమదే విజయమంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ జూన్ 1న వచ్చినా అధికారిక ఫలితాల కోసం మాత్రం జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.

Tags:    

Similar News