మళ్లీ తెరపైకి ఏపీలో భిక్షాటన నిషేధ చట్టం

బిక్షాటనను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ఏమిటి? పాత చట్టం ఎందుకు అమలు కాలేదు? బిక్షాటన మాఫియాను ఇప్పటి వరకు ఎందుకు గుర్తించలేదు?

Update: 2025-11-01 10:52 GMT

ఆంధ్రప్రదేశ్‌లో భిక్షాటన ఒక్కసారిగా పూర్తిగా నిషిద్ధమవుతుందా? లేక ఇది మరో 'కాగితం చట్టం'గానే మిగిలిపోతుందా? రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓఎంఎస్ నెం. 58 ప్రకారం 'ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నిరోధక (సవరణ) చట్టం-2025' అనే కొత్త చట్టం ద్వారా భిక్షాటనను తీవ్ర నేరంగా ప్రకటించింది. ఈ చట్టానికి గవర్నర్ ఆమోదం అక్టోబర్ 15న లభించి. అక్టోబరు 27న రాష్ట్ర గెజెట్‌లో ప్రచురితమైంది. లా డిపార్ట్‌మెంట్ సెక్రటరీ గొట్టపాటి ప్రతిభా దేవి సంతకంతో విడుదలైన ఈ ఆర్డర్ భిక్షాటన మాఫియాను నిర్మూలించాలని, నిరుపేదలకు పునరావాసం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ రోడ్ల కూడళ్లు, దేవాలయాలు, సిగ్నల్ పాయింట్లు, హోటళ్ల ముందు భిక్షాటన చేస్తున్న వారిని చూస్తుంటే, ఈ చట్టం అమలులో ప్రభుత్వం విజయం సాధిస్తుందా? ఇది ప్రస్తుత సామాజిక సమస్యలకు అనుకూలమా? లేక మరో భారాన్నే పెంచేస్తుందా?

చట్టం వెనుక ఉన్న నేపథ్యం, సవరణలు

ఆంధ్రప్రదేశ్‌లో 1977లో అమలులోకి వచ్చిన పాత 'భిక్షాటన నిరోధక చట్టం' ఇప్పుడు సవరించబడింది. కొత్త చట్టం ప్రకారం 'లెప్రసీ' (కుష్ఠు రోగి), 'లెపర్ ఆసిలం', 'లూనటిక్' (పిచ్చివాడు) అనే వివక్షాత్మక పదాలను తొలగించారు. ఇది వికలాంగులు, కుష్ఠు రోగులపై జరిగే వివక్షకు వ్యతిరేకంగా ఒక అడుగు. చట్టం భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ, దానికి శిక్షలు విధిస్తుంది. మొదటి సారి చేస్తే హెచ్చరిక, పదేపదే చేస్తే జైలు శిక్ష, జరిమానా ఉంటాయి. వ్యవస్థీకృత భిక్షాటన మాఫియాను నిరోధించడం, భిక్షకులకు పునరావాస కేంద్రాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం.


ఖచ్చితమైన డేటా సేకరించని ప్రభుత్వాలు

రాష్ట్రంలో భిక్షాటన సంఖ్య గురించి ఖచ్చితమైన డేటా లేదు. భారత ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా భిక్షకుల సంఖ్య తెలియదని అంగీకరిస్తోంది. ఏపీలో దేవాలయాలు (తిరుపతి, సింహాచలం వంటివి), రోడ్ల కూడళ్లు, సిగ్నల్ పాయింట్లు, టీకొట్లు, హోటళ్ల ముందు భిక్షాటన ఎక్కువగా కనిపిస్తోంది. ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని, రోజూ అక్కడే ఉండి యాచన చేస్తున్నారు. ఇది సాధారణ ప్రజలకు విసుగు, ఇబ్బంది కలిగిస్తోంది. కొందరు భిక్షకులు డబ్బు ఇవ్వని వారిని తిట్టుకుంటూ వెళుతుటారు. ఈ సమస్య ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, వలసలు, మానసిక ఆరోగ్య సమస్యల వల్ల పెరుగుతోంది. చట్టం అమలు చేయడం సాధ్యమే. భోపాల్, ఇండోర్‌లలో ఇటీవల భిక్షాటన నిషేధాలు విజయవంతమయ్యాయి. కానీ ఏపీలో మాత్రం ప్రస్తుతం (అక్టోబర్ 31 నాటికి) అమలు ప్రారంభం కాలేదు. పోలీసులు, సామాజిక సంక్షేమ శాఖలు కలిసి పెట్రోలింగ్, పునరావాస క్యాంపులు ఏర్పాటు చేస్తే కొంత వరకు తగ్గే అవకాశం వుంది.


చట్టం విజయవంతంగా అమలవుతుందా?

చట్టం అమలు చేయడంలో ప్రభుత్వం విజయం సాధిస్తుందా? ఇది ప్రశ్నార్థకం. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో భిక్షాటన చట్టాలు ఉన్నప్పటికీ అమలు బలహీనంగా ఉంది. బాంబే ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ 1959 ఏపీలోనూ అమలులో ఉంది. కానీ ఫలితాలు లేవు. ఢిల్లీ హైకోర్ట్ 2018లో ఆ చట్టంలోని కొన్ని నిబంధనలను రద్దు చేసింది. ఎందుకంటే అవి 'బలవంత భిక్షాటన'ను కూడా నేరంగా మార్చాయి. ఏపీలో కూడా ఇలాంటి సవాళ్లు ఉన్నాయి.

పునరావాస కేంద్రాలు తక్కువ. భిక్షకులు (మహిళలు, పిల్లలు, దివ్యాంగులు) సామాజిక సహాయం లేకుండా రోడ్లపైనే మిగిలిపోతారు. మాఫియా గ్యాంగులు పిల్లలను, మహిళలను బలవంతంగా భిక్షాటనకు ఉపయోగిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కేవలం శిక్షలతో ఆపలేం. పునరావాసం, ఉపాధి శిక్షణలు, మానసిక ఆరోగ్య సహాయం అవసరం. ప్రస్తుతం రోడ్లపై భిక్షకులు కనిపించడం వల్ల చట్టం 'కాగితం ఆయుధం'గా మిగిలిపోతుందని పలువురు భావిస్తున్నారు. భారతదేశంలో భిక్షాటన సామాజిక, ఆర్థిక సమస్య. దాన్ని చట్టాలతో మాత్రమే పరిష్కరించలేం. పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్, పెన్షన్లు) బలోపేతం చేయాలి.


రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇఏఎస్ శర్మ ఏమన్నారు...

‘‘చట్టపరంగా బిక్షాటనను నిరోధించడం సాధ్యం కాదు’’ అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇఏఎస్ శర్మ అన్నారు. ఆయన ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడుతూ బిక్షమెత్తుకునేందుకు అనేక కారణాలు ఉంటాయి. అందువల్ల ఆ కారణాలు ఏమిటో తెలుసుకుని పరిష్కరిస్తే సాధ్యమవుతుంది. అంతే కాని చట్టం చేశాము. అమలు చేస్తాం.. అంటే అమలు కాదని అన్నారు. కొందరు తల్లిదండ్రులు ఇంటి వద్ద జరుగుబాటు లేక పిల్లల్ని బెగ్గింగ్ కు పంపిస్తారు. కొందలరు మతి స్థిమితం లేక రోడ్లపైకి వస్తారు. ఆకలి అయినప్పుడు చేయి చాస్తారు అంటూ ఆయన ప్రత్యక్షంగా జరిగిన ఒక సంఘటనను వివరించారు. విశాఖ ఆర్కే బీచ్ లో ఇటీవల ఒక మహిళ మతి స్థిమితం లేక తిరుగుతోంది. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. కొంత మంది సాయంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించాము. ఒక నెల తరువాత సాధారణ స్థితికి వచ్చింది. ఆమె వివరాలు సేకరిస్తే తెలుగు మహిళ. వెంటనే వారి బంధువులను పిలిపించి వారితో పంపించాము. ఇటువంటి వారిని ఆదుకునేందుకు కేంద్రం సిటీల్లో హోం లు ఏర్పాటు చేసింది. ఆ హోం లను నిర్వహించేందుకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పెద్దగా శద్ధ పెట్టలేదు. దానిపై నేను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాను. వారితో మాట్లాడి షెల్టర్లు ఏర్పాటు చేయించే విధంగా చర్యలు తీసుకున్నాం. ఈ షెల్టర్ లు ఎన్జీవోలకు ప్రభుత్వం ఇస్తుంది. కొందరు బాగా నిర్వహిస్తున్నారు. అనాథలు కూడా ఇక్కడ ఉంటున్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన హోంలో చాలా మంది ఉంటున్నారు. మొదట ప్రస్తుతం ఏర్పాటు చేసిన ప్రాంతంలో స్థానికులు అంగీకరించ లేదు. వారికి నచ్చజెప్పి నేను దగ్గరుండి పెట్టించాను. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే దీనిని తీసేసి కళ్యాణ మండపం కట్టిద్దామంటున్నాడు. ఇలా అయితే బెగ్గింగ్ ను ఎలా నిరోధిస్తారని ఆయన ప్రశ్నించారు. ఎన్నో విధాలుగా జీవనోపాధి లేని వాళ్లు, పనులు చేయలేని వాళ్లు, లెప్రసీతో బాధపడే వాళ్లు యాచిస్తున్నారు. లెప్రసీ వారికి పనులు కూడా ఎవ్వరూ ఇవ్వరు. అలాంటప్పుడు వారు ఏమి చేయాలని అంటూ పలు ఆలోచనలు రేకెత్తించే విధంగా వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును నిరోధించే అధికారం ఎవ్వరికీ లేదు. అందువల్ల సామాజిక రుగ్మతలు రూపుమాపితే దానంతటదే యాచకం నశిస్తుందని చెప్పారు.


సీఎం, డిప్యూటీ సీఎం అభిప్రాయాలు

ఈ చట్టంపై ప్రముఖులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ చట్టాన్ని 'సామాజిక సంస్కరణ'గా పేర్కొన్నారు. "పేదలకు పునరావాసం కల్పించి, మాఫియాను బద్దలు కొట్టాలి. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు అవసరం" అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా "భిక్షాటన ద్వారా ప్రోత్సహించే ఆర్థిక దుర్బలత్వాన్ని ముగించాలి" అని అన్నారు. కానీ అమలు ప్రణాళికలు ఇంకా స్పష్టంగా లేవు.


విమర్శకుల అభిప్రాయాలు

విమర్శకులు మాత్రం దీన్ని 'అసమర్థత'గా చూస్తున్నారు. సామాజిక కార్యకర్త, రచయిత ఆర్యా అన్విక్షా ట్విటర్‌లో "పేదలకు ఇళ్లు, రేషన్, ఉద్యోగాలు ఇచ్చినా, మనస్తత్వ పేదరికం ఉంటే మారదు. భిక్షకులు డబ్బులు మత్తుకు ఖర్చు చేస్తారు. ప్రభుత్వం ఇది సరిచేయలేదు." అని పేర్కొన్నారు. ఇలాంటి పోస్టులు X (ట్విటర్)లో వైరల్ అవుతున్నాయి. భిక్షాటనను 'మనస్తత్వ సమస్య'గా చూపిస్తూ చెబుతున్నది కూడా వాస్తవమే.

మరో సామాజికవేత్త రాజ్ పట్టెం "ఫ్రీబీలు (Freebies) అంటే ఉచిత ఇన్సెంటివ్‌లు ఇచ్చి పేదలను ప్రభుత్వంపై ఆధారపడేలా చేశారు. ఇప్పుడు భిక్షాటన నిషేధం. ఇది సమస్యకు మూలాన్ని ఆపలేదు." అని అన్నారు.

ఒంగోలు జిల్లా కోర్టు సీనియర్ న్యాయవాది గల్లా గాంధీ మాట్లాడుతూ ‘ఈ చట్టం అమలు కాదు’ అని అన్నారు. వరకట్న నిషేద చట్టం ఉంది. అది అమలవుతోందా? అని ప్రశ్నించారు. ఇది కూడా అంతేనన్నారు. బిక్షం ఎత్తుకునేందుకు సామాజిక సమస్యలు ప్రధాన కారణమని పేర్కొన్నారు.

సమస్యకు మూల కారణం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కింది వివరాలు చూస్తే కొంతవరకు అర్థమవుతుంది.

సమస్య

మూల కారణం

చట్టం/ఫ్రీబీలు చేసేది

ఎందుకు మూలాన్ని మార్చలేము?

భిక్షాటన

పేదరికం - నిరుద్యోగం - విద్య లేమి - మానసిక ఆరోగ్య సమస్యలు - వలసలు - మాఫియా బలవంతం.

భిక్షాటన చేసేవారిని శిక్షిస్తుంది. ఫ్రీబీలు ఇచ్చి ఆధారపడేలా చేస్తుంది.

చట్టం భిక్షకుడిని జైలుకు పంపితే, వచ్చాక మళ్లీ రోడ్డు మీదే ఉంటున్నాడు. ఫ్రీబీలు ( ఉచితంగా డబ్బు) ఇస్తే కష్టపడి పని చేయాల్సిన అవసరం తగ్గుతుంది. స్వయం ఉపాధి మనస్తత్వం నశిస్తుంది.

భారతదేశంలో భిక్షాటనపై పరిశోధన చేసిన లా ప్రొఫెసర్ సబా అబ్దుల్ ఫాతిమా "చట్టాలు భిక్షకులను శిక్షిస్తాయి. కానీ కారణాలు (పేదరికం, వలసలు)ను పరిష్కరించవు" అని విమర్శించారు. ఇండోర్ మున్సిపల్ కమిషనర్ భోపాల్ మోడల్‌ను సూచిస్తూ "భిక్షకులకు డబ్బు, ఆహారం, బట్టలు మొదలైనవి ఇచ్చేవారిపై కూడా FIRలు నమోదు చేయాలి" అని సూచించారు.

ఏపీ హైకోర్టు అడ్వకేట్ షేక్ మీరావలి మాట్లాడుతూ పేదరికం ఒక కారణమైతే, బిక్షాటనను బలవంతంగా చేయించే వారు మరో కారణం అన్నారు. బిక్షకులను ఎప్పుడైతే నిరోధించి వారికి ఉచిత వసతి, ఉపాధి అవకాశాలు కల్పిస్తారో అప్పుడు కొంతవరకు తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

చట్టం కాకుండా మార్పు అవసరం

జీ.ఓ.ఎం.ఎస్. నం. 58 ప్రకారం భిక్షాటన నిషేధం సాధ్యమే. కానీ అది ప్రభుత్వం ఒక్కటే కాదు, సమాజం కలిసి చేయాలి. దానాలు ఇవ్వడం ఆపి, పునరావాసానికి మద్దతు ఇవ్వాలి. లేకపోతే రోడ్లపై భిక్షకులు కనిపించడం కొనసాగుతూనే ఉంటారు. ఏపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని 'విజయ సూచిక'గా మార్చాలంటే అమలు ప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపులు తప్పనిసరి. లేకపోతే ఇది మరో 'వ్యర్థ చట్టం'గా మిగిలిపోతుంది. పేదరికాన్ని మూలాల వద్ద ఆర్పడం కంటే, దాని ఫలితాలను దెబ్బతీయాలి. అది సులభం కాదు. సమాజం, ప్రభుత్వం కలిసి మార్పు తీసుకురావాలి. అదే నిజమైన విజయం.

Tags:    

Similar News