ఏపీలో సీఎం చంద్రబాబు విజన్ కుప్పం ప్రణాళిక
ఏపీలో సీఎం మారడంతో మరో వీఐపీ అసెంబ్లీ నియోజకవర్గం కుప్పంలో అభివృద్ధి పరుగులు తీస్తుంది. .సీఎం చంద్రబాబు చొరవతో కుప్పం సెగ్మెంట్ల రూపురేఖలు మారుతున్నాయి.
By : Shaik Saleem
Update: 2024-10-12 08:52 GMT
ఉమ్మడి రాష్ట్రంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సీఎంల సొంత నియోజకవర్గాలు, స్వగ్రామాలు అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచాయి. సీఎంలు వారి స్వగ్రామాలకు అధిక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. సీఎంల స్వగ్రామాలు వీఐపీ గ్రామాలుగా నిలిచి అభివృద్ధిలో ముందుంటున్నాయి.
- సీఎంల సొంత నియోజకవర్గాలే కాకుండా వారి సొంత గ్రామాల్లోనూ అభివృద్ధి పనులు పరుగులు తీయించారు. సీఎంలుగా తమకున్న అధికారంతో వారి సొంత నియోజకవర్గాల్లో నిధుల వరద పారించారు.
- గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు చింతమడక, సీఎం ఫాం హౌస్ ఉన్న ఎర్రవెల్లి గ్రామాల చింతలు తీరి ఆయా గ్రామాల రూపురేఖలే మారాయి.ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కావడంతో అభివృద్ధి వెలుగులు సీఎం స్వగ్రామం అయిన కొండారెడ్డిపల్లి వైపు ప్రసరిస్తున్నాయి.
సీఎం రేవంత్ స్వగ్రామంలో అభివృద్ధి వెలుగులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామంలో అభివృద్ధి వెలుగులతో ప్రకాశించింది.దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్ కొండారెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లి అభివృద్ధికి సీఎం రూ.50కోట్లు కేటాయించారు.సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి సీఎం శంకుస్ధాపన చేశారు.కొండారెడ్డిపల్లి గ్రామంలో సౌర వెలుగులు ప్రసరించేలా పైలెట్ ప్రాజెక్టును చేపట్టారు.
కేసీఆర్ హయాంలో...
గత సీఎం కేసీఆర్ తన స్వగ్రామమైన చింతమడకలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించారు. తాను నివాసముంటున్న ఫాంహౌస్ వద్ద ఉన్న ఎర్రవెల్లి గ్రామంలో బీటీరోడ్లు నిర్మించారు. గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారు. ఇంటికి ఓ గేదె ఇచ్చారు.
- గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన తన్నీరు హరీష్ రావు సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని విశేషంగా అభివృద్ధి చేశారు. సిద్ధిపేటలో ఐటీ హబ్, మోడల్ బస్టాండు, కోమటిచెరువు ట్యాంక్ బండ్, రోడ్లు, పాఠశాల భవనాలు నిర్మించారు.ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన హరీష్ రావు సీఎంతో పోటీ పడేలా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు.
చంద్రబాబు సీఎం కాగానే విజన్ కుప్పం ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎంగా నారా చంద్రబాబునాయుడు కాగానే అభివృద్ధి వెలుగులు పులివెందుల నుంచి కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం వైపు మళ్లాయి. విజన్ కుప్పం పేరిట ప్రణాళికతో సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తున్నారు.పేదలందరికీ ఇళ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, తాగునీరు, వంటగ్యాస్, విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించారు.భూగర్భ నీటిపారుదల వ్యవస్థ, పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన లక్ష్యంగా పనలు చేపట్టారు.కుప్పంలో జలాశయం నిర్మాణం, ఉద్యానవనాల అభివృద్ధి ననియాల ఎకో టూరిజం, కుప్పం పున్నమి రెస్టారెంట్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. గతంలో సీఎం కుప్పంలో ఇజ్రాయెల్ సాంకేతికతతో బిందు సేద్యం, తుంపర్ల సేద్యం చేపట్టారు.
జగన్ హయాంలో పులివెందులపై ప్రత్యేక దృష్టి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు పులివెందుల అభివృద్ధిపై దృష్టి సారించి పులివెందుల ఏరియా డెవలప్ మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. రూ.2కోట్లతో విద్యుత్ టవర్లు ఏర్పాటు చేశారు. రూ.861 కోట్లతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. పులివెందులలో డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిర్మించారు. రూ.500కోట్ల నాబార్డు నిధులు మంజూరు చేశారు. నర్సింగ్ కళాశాల, బాయ్స్, గర్ల్స్ హాస్టల్ భవనాలు, బనానా ప్రాసెసింగ్ యూనిట్, బానానా ప్యాక్ హౌస్ నిర్మించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా పనిచేసినపుడు అభివృద్ధి పనులు పులివెందులలో పరుగులు తీసింది.
కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పీలేరు ప్రగతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు ఆయన సొంత నియోజకవర్గమైన పీలేరులో ప్రగతి పరుగులు తీసింది. క్రీడా స్టేడియం, ఆసుపత్రి భవనాలను అప్పటి సీఎం నిర్మించారు. రెండున్నరేళ్ల పాటు సీఎంగా ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి వెయ్యి కోట్ల రూపాయలతో ప్రగతి పనులు చేపట్టారు. పీలేరు ఏరియా డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు చేశారు. పీలేరులోని కలికిరిలో రూ.10కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్, రూ.70 కోట్లతో సైనిక్ స్కూలు, బాలికల జూనియర్ కళాశాల, ఐటీఐ, వాయల్పాడు రెసిడెన్షియల్ స్కూలు నిర్మించారు.