ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలన పరిణామం
మాజీ మంత్రి నారాయణ స్వామి మొబైల్‌ను FSLకి పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతి;
By : V V S Krishna Kumar
Update: 2025-09-12 10:38 GMT
ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ కీలక నేత నారాయణ స్వామి మొబైల్‌ను FSLకి పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో నారాయణ స్వామి కాల్ డేటాతో పాటు, బ్యాంక్ లావాదేవీలపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు.ఇప్పటికే లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి నారాయణస్వామిని సిట్ అధికారులు విచారించారు.అయితే నారాయణ స్వామి మొబైల్ లోని సమాచారం లభిస్తేనే మరిన్ని వివరాలు ,కీలక విషయాలు వెలుగు చూస్తాయని దర్యాప్తు అధికారులు భావించారు. అందుకోసం మొబైల్ ను FSL(Forensic Science Laboratory)కి పంపాలని నిర్ణయించారు. అందుకు కోర్టు అనుమతి కూడా రావడంతో కీలక సమాచారం లభిస్తుందని అంటున్నారు.గత జగన్ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా నారాయణ స్వామి పనిచేశారు.
నిందితుల రిమాండ్ పొడిగింపు
ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్ ముగియడంతో వారిని సిట్ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు. మరోమారు విచారణ చేపట్టిన న్యాయస్థానం వారి రిమాండ్ ను ఈనెల 18 వరకూ పొడిగించింది.అయితే, ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చిన వారిలో విజయవాడ జైలు నుంచి రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చాణక్య, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, గుంటూరు జైలు నుంచి నిందితులు నవీన్, బాలాజీ కుమార్‌తో పాటు, రాజమండ్రి జైలు నుంచి మిథున్‌రెడ్డిని కూడా వున్నారు.నిందితుల రిమాండ్ ను కొర్టు పొడిగించడంతో మిధున్ రెడ్డితో పాటు మిగిలిన వారినీ ఆయా జైళ్లకే మళ్లీ తరలించారు.అయితే, బెయిల్‌పై పైలా దిలీప్, డిఫాల్ట్ బెయిల్‌పై ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప బయట ఉన్నారు. వీరు కూడా న్యాయస్థానంలో జరిగిన విచారణకు హాజరయ్యారు.పైలా దిలీప్ బెయిల్ రద్దు చేయాలని , ఆయన నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఏసీబీ అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు.దాంతో దిలీప్ ను కోర్టు మందలించింది.