అన్న క్యాంటీన్ల మెనూ, ధరలను ప్రకటించిన మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించాలని కూటమి ప్రభుత్వ నిశ్చయించుకుంది. అందుకోసం ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసింది.

Update: 2024-07-19 12:09 GMT

ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించాలని కూటమి ప్రభుత్వ నిశ్చయించుకుంది. అందుకోసం ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసింది. ఆగస్టు 15న తొలి విడత అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు. తాజాగా ఈ పునఃప్రారంభమయ్యే అన్న క్యాంటీన్లలో పేదలను అందించే ఆహారాల మెనూ, వాటి ధరలను మంత్రి ఆదినారాయణ వెల్లడించారు. గతంలో ఇచ్చినట్లే ఈసారి కూడా రూ.5 రుచికరమైన భోజనం అందిస్తామని, అందులో ఎటువంటి తేడా ఉండదని వివరించారు. పేదలందరూ అతి తక్కువ ధరకే రుచి కరమైన, నాణ్యమైన భోజనం చేయాలని, ఆకలి చావులను అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే టీడీపీ గతంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇప్పుడు కూడా అదే లక్ష్యంతో ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా ఒకేలా, ఒకే భోజన మెనూతో అన్న క్యాంటీన్లు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు మంత్రి ఆదినారాయణ. గతంలో అన్న క్యాంటీన్లకు అక్షయపాత్ర సంస్థ నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని సరఫరా చేసిందని, ఈసారి కూడా అదే విధంగా నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని, అదే ధరకు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. భోజనాన్ని అందించడానికి టెండర్లు పిలిచామని, జూలై 22న టెండర్లను ఓపెన్ చేస్తామని మంత్రి ఆదినారాయణ ప్రకటించారు. కాగా ఇప్పుడు రీఓపెన్ చేస్తున్న అన్న క్యాంటీన్ల మెనూ కూడా గతంలో దాని తరహాలోనే ఉంటుందని చెప్పారు. కాకపోతే రాష్ట్రమంతటా ఎక్కడికి వెళ్లినా ఒకే మెనూ ప్రకారం అందించడం జరుగుతుందని చెప్పారాయన.

‘‘అన్న క్యాంటీన్లను 2014-19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పట్లో ఎంతో మంది ఆకలి బాధను ఈ క్యాంటీన్లు రూ.5 తీర్చాయి. వీటికి విశేషమైన ప్రజాదరణ లభించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 క్యాంటీన్లను అందుబాటులో ఉంచింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. అన్న క్యాంటీన్ల కోసం నిర్మించిన భవనాలను గోదాములుగా మర్చేసింది. అన్న క్యాంటీన్లలోని సరుకును కూడా పక్కన పడేసింది. దీంతో ఇప్పుడు వీటిని పునరుద్దరించాలంటే ప్రతి క్యాంటీన్‌కు మరమ్మతులు చేయించాల్సి వస్తుంది. ఇప్పటికే దాదాపు 183 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. మరో 18 క్యాంటీన్ల భవనాలు పూర్తయ్యాయి. మరో రెండిటి నిర్మాణం ప్రాథమిక దశలో ఉంది. ఏది ఏమైనా ఆగస్టు 15 నాటికి మొత్తం 203 క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని ఆదినారాయణ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News