ఆంధ్రా మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్‌ ప్రయాణం

సీఎం చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌;

Update: 2025-05-17 17:07 GMT
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర‘ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ కీలక ప్రకటన చేశారు.
మహిళల సాధికారతకు, వారి ఆర్థిక స్వావలంబనకు ఇది మద్దతుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ‘మా ప్రభుత్వం మహిళా పక్షపాతి. ఎన్నికల హామీలను అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆగస్టు 15 నుంచి ఆడబిడ్డలందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఇది వారికిచ్చే కానుక,‘ అని ఆయన పేర్కొన్నారు.
ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు త్వరలో ఖరారవుతాయని సీఎం పేర్కొన్నారు. సభికుల నుంచి ఈ ప్రకటనకు భారీ స్థాయిలో హర్షధ్వానాలు వినిపించాయి.
ప్రజా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఇప్పటికే రూ.4.96 లక్షల కోట్ల పెట్టుబడులతో 76 ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకువచ్చామని, వాటి ద్వారా 4.51 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని వివరించారు.
ఇకపోతే, ‘‘దీపం–2’’ పథకం ద్వారా మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, ‘‘తల్లికి వందనం’’ కింద రూ.15,000 నగదు సహాయం, డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకం వంటి పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు.
రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు తక్కువ ధరకు కూరగాయలు అందించేందుకు రైతుబజార్‌ వ్యవస్థను బలోపేతం చేస్తామని, కర్నూలులో రైతుబజార్‌ ఆధునికీకరణకు రూ.6 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. పాణ్యంలో రూ.50 లక్షల ఉద్యానవన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రోడ్ల అభివృద్ధికి రూ.50 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
సంపూర్ణ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, 2029 నాటికి పేదరికం లేని ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో ఇదొకటి. తెలంగాణలో, కర్నాటకలో ఇప్పటికే ఈ పథకం అమలవుతోంది. ఈ పథకం తీరు తెన్నులను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పరిశీలించి వచ్చారు. ఆ అనుభవాలను మదింపు చేసి ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్‌ లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ పథకం అమల్లో ఇప్పటికే ఆలస్యం జరిగిందని విపక్షాలు విమర్శించిన నేపథ్యంలో చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు.
Tags:    

Similar News