ఆంధ్రప్రదేశ్‌: ఆ ఐదు చోట్ల అదే టాక్‌

ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంట్‌ నియోజక వర్గాల్లో కంటే ఆ ఐదు ఎంపీ స్థానాల్లో డిఫ్‌రెంట్‌ టాక్‌ వినిపిస్తోంది.

Update: 2024-05-30 09:13 GMT

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఫలితాలు వెలుడటానికి మధ్య 21 రోజులు గ్యాప్‌ ఉండటంతో జూన్‌ 4 ఎప్పుడు వస్తుందా.. ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారనే ఉత్కంఠ రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల ఫలితాల గురించి ఒక టాక్‌ వినిపిస్తుండగా, పార్లమెంట్‌ నియోజక వర్గాల రిజల్ట్‌ గురించి మరొక టాక్‌ నడుస్తోంది. కేంద్రంలో ఏర్పడ బోయే ప్రభుత్వానికి ఎంపీ స్థానాల ఫలితాలు లింక్‌ అప్‌ అయి ఉండటంతో ఓటింగ్‌ సరళి కూడా మారి ఉండొచ్చనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ నేపథయలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు పార్లమెంట్‌ స్థానాల గెలుపు ఓటములు చాలా కీలకంగా మారాయి.

మచిలీపట్నంలో క్రాస్‌ ఓటింగ్‌
మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీగా విజయం సాధించిన వల్లభనేని బాలశౌరి ఈసారి ఎన్నికల్లో జనసేన తరపున బరిలో నిలిచిన విషయం తెల్సిందే. ఐదేళ్లపాటు అధికార పార్టీ ఎంపీగా హవా కొనసాగించిన బాలశౌరి ఎన్నికలు సమీపించేసరికి వైఎస్సార్‌సీపీకి దూరమయ్యారు. పవన్‌కు దగ్గరకావడంతో రాష్ట్రంలో కూటమి పొత్తులో రెండు ఎంపీ సీట్లు జనసేనకు కేటాయిస్తే అందులో బాలశౌరికి ఒక ఎంపీ సీటు దక్కడం విశేషం. దీంతో గత ఐదేళ్లలో బందరు పోర్టు, మెడికల్‌ కాలేజీ వంటి ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి కార్యక్రమాలకు బాలశౌరి తన ఖాతాలో జమ చేసుకున్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ ఎంపీగా సాధించిన అభివృద్ధి పనులను చూపించి ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా ప్రజలను ఓట్లు అడగడం గమనార్హం. ఇది ఇలా ఉంటే ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ప్రముఖ క్యాన్సర్‌ వైద్యుడు సింహాద్రి చంద్రశేఖర్‌ను ఎంపీగా పోటీకి దింపడం గమనార్హం. చంద్రశేఖర్‌కు వైద్యుడిగా మంచి పేరు ఉండటంతో అది వైఎస్సార్‌సీపీకి అనుకూలిస్తుందని భావించారు. ఈ నియోజకవర్గంలో క్రాస్‌ ఓటింగ్‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు, జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరికి అనుకూలిస్తుందని భావిస్తున్నారు.
విజయవాడలో అన్నదమ్ముల సవాల్‌..
గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన కేశినేని శ్రీనివాస్‌(నాని) ఐదేళ్లు ఆ పదవిలో ఎంజాయ్‌ చేసి చివరి నిముషంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. టాటా గ్రూప్‌ సహకారంతో గ్రామాల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, అనేక కార్యక్రమాలతో కేశినేని నాని పార్టీలకు అతీతంగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదే క్రమంలో నాని దూకుడును సహించలేని లోకేశ్‌ పథకం ప్రకారం నాని తమ్ముడు కేశినేని శివనాథ్‌(చిన్ని)ని ప్రోత్సహించారనే టాక్‌ అతని అనుచరుల్లో ఉంది. దీంతో సొంత అన్నదమ్ములైన నాని, చిన్నిల మధ్య గత కొంతకాలంగా ఉన్న కుటుంబ వివాదాలు రాజకీయ సవాల్‌కు దారితీసింది.
కేశినేని చిన్ని గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముతో కలిసి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ సంస్థను నిర్వహిస్తూ ఇక్కడ ప్రత్యక్ష రాజకీయ బరిలో దిగారు. ఇప్పటికే పదేళ్లుగా టీడీపీ నుంచి ఎంపీగా పట్టుసాధించిన నానితో ఆయన తమ్ముడు చిన్ని హోరాహోరీగా తలపడ్డారు. అన్నదమ్ముల సవాల్‌లో గెలుపు తలుపు తట్టేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. విజయవాడ పార్లమెంట్‌ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒక్క తిరువూరు తప్ప తక్కిన వాటిల్లో టీడీపీకి అనుకూలంగా ఉందని, ఇదే వాతావరణం విజయవాడ పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థికి కలిస్తొందనే టాక్‌ ఎన్జీఆర్‌ జిల్లా టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది.
గుంటూరులోను అదే టాక్‌
ఎన్‌ఆర్‌ఐ పెమ్మసాని చంద్రశేఖర్‌ టీడీపీ అభ్యర్థిగాను, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగాను గుంటూరు పార్లమెంట్‌ నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడ గత రెండు సార్లు టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌ గెలిచారు. నాటి నుంచి ఇది టీడీపీ అడ్డాగా మారింది. గుంటూరు పార్లమెంట్‌ పరిధిలో ఉన్న తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్‌ ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్‌ తప్ప తక్కిన చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలిచింది. అయినా ఎంపీ సీటు మాత్రం టీడీపీ సొంతం చేసుకుంది. అయితే ఈ సారి ఏడు అసెంబ్లీ స్థానాల్లో అధిక స్థానాల్లో టీడీపీ ఆధిక్యం కనబరిచే అవకాశం ఉందని, ఇదే తీరు పార్లమెంట్‌లో కూడా రిఫ్లెక్ట్‌ అయ్యే చాన్స్‌ ఉందని, దీనిని బట్టి చూస్తే ఈ సారి కూడా గుంటూరు పార్లమెంట్‌ను టీడీపీనే సొంత చేసుకునే టాక్‌ స్థానికుల్లో వినిపిస్తోంది.
పెద్దగా ప్రభావం చూపని పార్టీ మార్పు
నరసరావుపేట పార్లమెంట్‌లో అనిల్‌కుమార్‌ యాదవ్, లావు శ్రీకృష్ణదేవరాయలు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నెల్లూరు టౌన్‌ ఎమ్మెల్యే అనిల్‌ను ఎంపీ అభ్యర్థిగా రావడంతో స్థానిక సమస్య పెద్ద ఎత్తున ప్రభావం చూపిందనే చర్చ స్థానికుల్లో ఉంది. ఇది సిట్టింగ్‌ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు ప్లస్‌గా మారే చాన్స్‌ ఉందని స్థానికులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఎంపీగా గెలిచి ఈ సారి టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నా లావు శ్రీకృష్టదేవరాయలకు పార్టీ మార్పు అంశం పెద్దగా ప్రభావం ఏమీ లేదనే టాక్‌ కూడా ఉంది. మరో వైపు గత ఎన్నికల్లో అన్ని స్థానాలు వైఎస్‌ఆర్‌సీపీ సొంతం చేసుకోవడంతో ఎంపీ గెలుపు సులువు అయింది. అయితే ఈ సారి అసెంబ్లీ స్థానాల్లో అధిక స్థానాల్లో టీడీపీ జండా ఎగరడం ఖామని, దీంతో ఎంపీ గెలుపు కూడా సులువు అవుతుందనే టాక్‌ వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న హింస కూడా దీనికి దోహదం చేస్తుందనే చర్చ స్థానికుల్లో ఉంది.
వివాద రహితుడుగా మాగుంటకు పేరు
సిట్టింగ్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి వివాద రహితుడిగా పేరుంది. పార్టీ మారినా ఒంగోలు పార్లమెంట్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైపే గెలుపు ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. పార్టీలు మారినా, ఏ పార్టీకి అనుకూలంగాను, ఏ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించక పోవడం మాగుంట గెలుపునకు సూత్రమనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తం అవుతోంది. అసవరం నిమిత్తం, పనుల కోసం ఆయన వద్దకు వెళ్తే నో అనకుండా పార్టీలకు అతీతంగా పని చేస్తారనే టాక్‌ ఉంది. మరో వైపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని వైఎస్‌ఆర్‌సీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలో పెట్టడం రాంగ్‌ చాయిస్‌ అనే టాక్‌ కూడా స్థానికుల్లో ఉంది. దీంతో స్థానికత అంశం ప్రధాన అజెండాగా మారిందనే వాదన ఉంది. ఈ సారి అసెంబ్లీ నియోజక వర్గాల ఫలితాలు వైఎస్‌ఆర్‌సీపీకి ప్రతి కూలంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు ఆ జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకటి రెండు అసెంబ్లీ స్థానాలు మినహా తక్కిన వాటిల్లో టీడీజీ జెండా ఎగురడం ఖాయమనే టాక్‌ స్థానికల్లో ఉంది. ఇది మాగుంట గెలుపునకు దోహద పడుతుందని, ఒక వేళ అసెంబ్లీ నియోజక వర్గాల్లో టీడీపీకి ప్రతి కూల ఫలితాలు వచ్చినా ఎంపీగా మాగుంటకు మాత్రం క్రాస్‌ ఓటింగ్‌ ద్వారా నెగ్గే చాన్సులే అధికంగా ఉన్నాయనే టాక్‌ ఆ పార్టీలో వ్యక్తం అవుతోంది.
Tags:    

Similar News