ఆంధ్రప్రదేశ్ కు 2024.. ఏమిచ్చింది? ఏమి‌ మిగిల్చింది!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 శాశ్వతంగా గుర్తుండి పోతుది. వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసి కూటమికి ఊహించని మెజారిటీ యిచ్చింది.;

Update: 2024-12-31 04:33 GMT

ఓ చారిత్రక తీర్పు ఇచ్చింది. ‌అందరి లెక్కలు సరిచేసింది. పంట చేలను కుదిపేసింది. రాజకీయాలను తలకిందులు చేసింది. ఓడల్ని బళ్ళు చేసింది. ప్రజల్ని హీరోలను చేసింది. అసాధ్యాలను సుసాధ్యం చేసింది. అనుబంధాలను రాజకీయంగా మార్చింది. కాలం చేసిన గాయాలకు మందు పూసింది. కలికాలం లో కక్షలు‌ కార్పణ్యాలు మామూలేనని తేల్చి చెప్పింది..

12 నెలలు అంటే 365 రోజులు గిర్రున‌ తిరిగాయి.

కాలచక్రం ఆగనట్టే మార్పూ ఆగదు కదా!

ఈ 12 నెలల్లో‌ జరిగిన అతిపెద్ద సంఘటన రాష్ట్రం దశదిశా మార్చే ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన ఎన్నిక..

ఈ సంవత్సరం (2024) జూన్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ (ఎన్డీఏ) కూటమి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. అత్యధిక మెజారిటీతో ఉన్న గత ప్రభుత్వం కేవలం 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. పోటాపోటీగా జరిగిన ఎన్నికలు పార్టీల భవిష్యత్ ను నిర్ణయించాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు మధ్య హోరాహోరీ ఎన్నికల పోరు జరిగింది. మధ్యలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని కూటమిలో భాగస్వామిని చేసి చంద్రబాబుతో చేతులు కలిపారు. బీజేపీతో కలిసిన టీడీపీ, జనసేనలు ఓటర్లను తీవ్ర స్థాయిలో ప్రభావితం చేయగలిగాయి. అప్పటి వరకు ప్రభుత్వాన్ని నడిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓటర్లు మట్టి కరిపించారు. ఎప్పుడూ లేనిది బీజేపీకి ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఏపీలో వచ్చాయి. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ భారీ మెజారిటీతో గెలుపొందారు.

పీఎం సమక్షంలో సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం

ఎన్నికల అనంతరం బహిరంగ ప్రదేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి భారీగా జనం తరలి వచ్చారు. మంత్రి వర్గ కూర్పులోనూ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోగలిగారు. మంత్రివర్గంలోకి తెలుగుదేశం పార్టీ సీనియర్లకు అవకాశం లేకపోవడంతో వారు కాస్త కినుక వహించారు. ఎన్నికల సమయంలో జంపింగ్ లు కూడా ఎక్కవగానే జరిగాయి. విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని తన పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎక్కవ మంది కొత్తవారికి సీట్లు ఇచ్చి నూతనత్వంతో అడుగులు వేసింది. మంత్రి పదవులు కూడా కొత్తవారికే ఎక్కువ మందికి ఇచ్చారు.

టీడీపీని ఎన్డీఏలోకి తీసుకోవడంలో చక్రం తిప్పిన పవన్ కల్యాణ్

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఏ పార్టీకి ఆ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. అప్పటికే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే జనసేన పార్టీ బీజేపీతో కూడా పొత్తులో ఉండటంతో జనసేనకు ఇబ్బంది కర పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ వారు టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు చివరి వరకు సుముఖంగా లేరు. రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్ బీజేపీ, టీడీపీ మధ్య సయోధ్య కుదిర్చి సీట్ల సర్థుబాటు చేసుకోగలిగారు. 175 సీట్లు ఉన్న ఏపీలో కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ 144 సీట్లలో పోటీ చేసింది, జనసేన పార్టీ 21 సీట్లలో పోటీ చేసింది. బీజేపీ వారు 10 స్థానాల్లో పోటీ చేశారు. బీజేపీ 8 చోట్ల గెలవగా, జనసేన 21చోట్లా గెలిచి చరిత్ర సృష్టించారు. తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది.

ప్రతిపక్ష హోదా కోల్పోయిన వైఎస్సార్సీపీ

వైఎస్ఆర్ సీపీ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. అసెంబ్లీలో కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ను ప్రభుత్వం గుర్తించలేదు. దీంతో వైఎస్ జగన్ తనను ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు చెప్పింది. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా పోయింది. జనసేనకు ప్రతిపక్ష హోదా దక్కాల్సి ఉంది. అయితే ఎన్డీఏ కూటమిలో ఉండటంతో ఆ పార్టీ అధికార పక్షమైంది. అందువల్ల తనను ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు గుర్తించరంటూ జగన్ చేసిన పోరాటం ఫలించలేదు.

అంతుపట్టని పవన్ రాజకీయాలు

రాష్ట్ర రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యవహారం రాజకీయ పరిశీలకులకు కూడా అంతుబట్టకుండా ఉంది. ఎన్నికల సమయంలో చంద్రబాబును కూటమిలోకి తీసుకున్న తరువాత మొదటి సారిగా చిలకలూరిపేటలో ప్రధాన మంత్రి మోదీతో సభ నిర్వహించి తామంతా ఒక్కటిగా ఉన్నామనే సంకేతాన్ని ప్రజలకు అందించడంలో సక్సెస్ అయ్యారు. ఆయన మాట మీద నిలబడటం లేదు. రోజుకో వ్యవహారం తెస్తున్నారు. కొన్ని సంఘటనల విషయంలో తీవ్రంగా స్పందించారు. సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి సనాతన ధర్మంపై తిరుపతిలో డిక్లరేషన్ ప్రకటించారు. వారాహి అమ్మవారికి పూజలు చేశారు. ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టగానే వారణాసి వెళ్లి అక్కడ వారాహి అమ్మవారిని దర్శించుకున్నారు. గుంటూరు జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో జగన్ కు సంబంధించిన పవర్ ప్రాజెక్టు భూములను పరిశీలించి ఆ భూములను సర్వే చేయించి అందులో ప్రభుత్వ భూములు ఉన్నాయని, పేద ఎస్సీలకు ఇచ్చిన భూములు ఉన్నాయని రెవెన్యూ అధికారుల ద్వారా ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చేశారు.

హోం శాఖపై పవన్ కల్యాన్ సంచలన కామెంట్స్

రాష్ట్ర శాంతి భద్రతల మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత మంత్రి పదవిని నిర్వహించడంలో ఫెయిల్ అయిందని ఆరోపించి పవన్ కల్యాణ్ సంచలనం సృష్టించారు. ఆ తరువాత జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చ రాగా తన పిల్లలు బయటకు రాలేనంతగా షోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ వారు అవమానించారని, వారు నాతో ఆ బాధను పంచుకున్నప్పుడు ఏ తండ్రికైనా ఎలా ఉంటుందో చెప్పాలంటూ తాను కావాలని అనితను అవమానించలేదని, బాధలో నుంచి వచ్చిన మాటలేనని పవన్ కల్యాణ్ మంత్రి వర్గంలో చెప్పారు. దీంతో సోషల్ మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అసభ్యకర, అభ్యంతర కర పోస్టులు సోషల్ మీడియాలో పెడుతున్న వారిపై వందల సంఖ్యలో కేసులు నమోదు చేసింది. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా అరెస్ట్ లు జరిగాయి. నిందితులు కోర్టులను ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ లు దాఖలు చేసుకున్నారు.

పవన్ కల్యాణ్ గెలుపు సంచలనం కాగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ తరువాత జరిగిన ప్రతి రాజకీయ వ్యూహం వెనుక పవన్ కల్యాణ్ ఉంటూ వచ్చారు. కొన్ని సంఘటనలు జరిగిన ప్రాంతాలను నేరుగా వెళ్లి విజిట్ చేయడం, సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకుని రాష్ట్ర ప్రజలు ఆశ్చర్య పోయే విధంగా చేయడం, వైఎస్ జగన్ అనుయాయులు, ఇతర నాయకులపై విరుచుకు పడుతూ వచ్చారు. బీజేపి నిర్ణయాలను బీజేపీ వారికంటే పవన్ కల్యాణ్ అమలు చేసే విషయంలో ముందడుగు వేస్తూ వస్తున్నారు.

రచ్చకెక్కిన కాకినాడ పోర్టు వ్యవహారం

రాజకీయ పార్టీల తీరుపైనా ప్రత్యేకమైన చర్చ జరిగింది. ప్రజలు కొన్ని పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఎందుకు లేకుండా చేశారనే చర్చలతోనే ఆరు నెలల కాలం గడిచింది. ఒకింత కక్షలు, కార్పణ్యాలకు కూడా రాష్ట్రం ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. రేషన్ బియ్యం కుంభకోణం, కాకినాడ పోర్టు కొనుగోళ్ల వ్యవహారంలో లావాదేవీలపై కూడా పెద్ద దుమారం రేగింది. తనను బెదిరించి గత ప్రభుత్వం పోర్టులో సగం వాటాను జగన్ మనుషులు అక్రమంగా సంతకాలు చేయించి స్వాధీనం చేసుకున్నారని కేవీ రావు ఏసీబీ కి ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసేందుకు వెతుకులాట ప్రారంభించారు. వారు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని ప్రథమ నిందితునిగా పోలీసులు కేసులో పెట్టారు.

జగన్ పై చెల్లెలు పోరు

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది. 2024లో ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ పార్టీ తరపున కడప నుంచి ఎంపీగా పోటీచేసి ఓటమి పాలైంది. కొంగు చాచి ఓటడుగుతున్నా.. మా చిన్నాన్నను చంపిన వారు కడప నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. అవినాష్ రెడ్డిని ఓడించండి. నన్ను గెలిపించి నిజాయితీని బతికించండి. జగన్ పెద్ద మోసగాడు. ప్రజలను మోసం చేశారంటూ తీవ్రస్థాయిలో షర్మిల ధ్వజమెత్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాలకు గాను 159 నియోజకవర్గాల్లో పోటీచేసి ఓటమి పాలైంది. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసింది. సోనియా, రాహుల్ గాంధీలను ప్రమోట్ చేస్తూ బహిరంగ సభల్లో ప్రసంగించారు. తెలుగుదేశం, వైఎస్సార్సీపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు. అయినా జనం ఆదరించలేదు.

రాజధాని నిర్మాణంపై వేగంగా అడుగులు

రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి చూపిస్తామని ప్రకటించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించిన లే అవుట్స్ ను తిరిగి ప్రభుత్వం ఆమోదించి అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఒకటీ రెండు మార్పులు తప్ప అమరావతి ప్లాన్ గతంలో ఏదైతే ఉందో దానినే ఆమోదించి అమలుకు నిర్ణయం తీసుకున్నారు. సచివాలయం నిర్మాణంలో ఆర్ట్ అండ్ ఆర్క్ టెక్చర్ వంటి అంశాలతో కలుపుకుని హంగులన్నీ ఉండే విధంగా చూసుకునే బాధ్యతను సింగపూర్ కన్సార్టియం వారికి అప్పగించారు. కేంద్రం ద్వారా రూ. 15వేల కోట్లు, రాష్ట్రం ద్వారా రూ. 16వేల కోట్లు అప్పుల రూపంలో తీసుకునేందుకు అవసరమైన అగ్రిమెంట్లు పూర్తి చేశారు. నిర్మాణాలను వచ్చే జనవరి నుంచి మొదలు పెట్టాలని నిర్ణయించారు.

తిరుమల లడ్డులో నెయ్యి కల్తీ ఉందని చెప్పిన సీఎం

కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డులో ఉపయోగించే నెయ్యిలో కల్తీ ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించి ప్రపంచ వ్యాప్తంగా చర్చకు కారకులయ్యారు. దేశంలోనూ, విదేశాల్లోనూ తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడారన్న వార్త దావానలంలా వ్యాపించింది. కల్తీ జరిగిందనటానికి ఈ రిపోర్టులే కారణమంటూ ఓ సంస్థ ఇచ్చిన రిపోర్టును ముఖ్యమంత్రి చదవి వినిపించారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం నియమించారు. అయితే ముఖ్యమంత్రే స్వయంగా కల్తీ జరిగిందని ప్రకటించడంతో ఎవ్వరూ పెద్దగా వాదించలేదు. ఆ తరువాత భక్తులు కానీ, ఇతరులు కానీ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కల్తీ జరిగిందనేందుకు ఇంత వరకు సరైన ఆధారాలు దొరకలేదు. ఈ వ్యవహారంలో సీఎం అభాసుపాలు అయ్యారనే విమర్శలు వచ్చాయి.

వైఎస్సార్సీపీ వారిపై కేసుల పరంపర

గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, పార్టీ నాయకులపై దాడులు చేసిన వారిపై కేసులు వరుసగా నమోదయ్యాయి. ఒక మాజీ ఎంపీతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు జైలు పాలయ్యారు. చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులపై కేసులు నమోదయ్యాయి. కొన్ని అవినీతి ఆరోపణల నేపథ్యంలో నమోదు కాగా మరికొన్ని తెలుగుదేశం, జనసేన పార్టీల వారిపై దాడులు జరిగినందుకు నమోదు చేశారు. కొందరు మాజీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పరారు కాగా వారికోసం ప్రత్యేక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. ప్రధానంగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ లపై నమోదైన కేసుల్లో అరెస్ట్ లు చేయాలనే వ్యూహాలు పన్నినా కోర్టుల్లో బెయిల్ తీసుకుని వారు పోలీసుల నుంచి తప్పించుకున్నారు.

అధికారులపై కేసులు పెట్టి అరెస్ట్ చేసినంత వేగంగా రాజకీయ నాయకులను అరెస్ట్ లు చేయలేక పోయారు. చాలా మంది బెయిల్ తీసుకుని అరెస్ట్ ల నుంచి తప్పించుకున్నారు. కొందరు నాయకులు విషయంలో ప్రభుత్వం కూడా దూకుడు తగ్గించింది. తన తల్లిని అవమానించిన వారిని వదిలేదే లేదని పంతం పూనిన మంత్రి లోకేష్ సైతం నాయకుల అరెస్ట్ ల విషయంలో కాస్త వెనక్కు తగ్గినట్లు కనిపించిది.

ఐపీఎస్ అధికారులపై కేసులు

ప్రభుత్వం అధికారం చేపట్టగానే కొందరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను టార్గెట్ చేసింది. గత ప్రభుత్వంలో పాలకులకు తొత్తులుగా మారారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పోస్టింగ్ లు ఇవ్వకుండా పక్కన పెట్టారు. మొదటి మూడు నెలలు సుమారు 15 మంది సెంట్రల్ సర్వీస్ వారికి పోస్టింగ్ లు ఇవ్వలేదు. అవినీతి ఆరోపణలపై గత ప్రభుత్వంలో అగ్రిమాపక శాఖ డీజీగా, సీఐడి విభాగాధిపతిగా ఉన్న ఎస్ సంజయ్ పై డిసెంబరు 24న కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్, పనిచేసిన విజి వెంకటరెడ్డిని అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. ఫైబర్ నెట్ ఎండీగా పనిచేసిన అధికారిపై కూడా కేసు నమోదు శారు. ఎపి ఎండీసీ మాజీ ఎండి వాసుదేవరెడ్డిపై కూడా పోలీసులు కేసు పెట్టారు.

సంచలనం రేపిన ముంబై నటి కేసు

ముంబైకి చెందిన సినీ హీరోయిన్ కాదంబరీ జత్వానిచె పై అకారణంగా కేసు నమోదు చేయించి వేధించారనే నేరం కింద ముగ్గురు సీనియర్ ఐపీఎస్ లపై కేసులు నమోదయ్యాయి. పిఎస్ఆర్ అంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కొందరు ఐఏఎస్ లకు నేటికీ పోస్టింగ్ ఇవ్వలేదు. సమాచార శాఖ కమిషనర్ గా పనిచేసిన ఐఏఎస్ అధికారి విజయకుమార్ రెడ్డిపై కూడా అవినీతి ఆరోపణల కింద కేసు ఏసీబీ కేసు నమెదు చేసింది. ఇక ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులుగా పనిచేసిన వారిపైనా కేసులు నమోదయ్యాయి. వారిని అరెస్ట్ చేశారు. చాలా మంది అధికారులు అవినీతి ఆరోపణలుపై కేసుల్లో ఇరుక్కోగా, వైఎస్సార్ సీపీకి అనుకూలంగా వ్యవహరించారనే కారణంతో పోస్టింగ్ లకు నోచుకోక నిరీక్షిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై కొన్ని విమర్శలు ఉన్నాయి.

కుదిపేసిన రేషన్ బియ్యం కుంభకోణం

రేషన్ బియ్యం కుంభ కోణాలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. కాకినాడ పోర్టు నుంచి లక్షల టన్నుల రేషన్ బియ్యం ఎగుమతి అవుతున్నాయని గుర్తించారు. అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న షిప్ వద్దకు ఉప ముఖ్యమంత్రి సముద్రంలోపలికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. వందల మంది ప్రజలు, పార్టీ నేతలు ఆయనను ఫాలో అయ్యారు. అందరి సమక్షంలోనే షిప్ లో రేషన్ బియ్యం ఉన్నాయని నిరూపించి విచారణకు ఆదేశించారు. దీనిపై ప్రత్యేకంగా పోలీస్ బృందంతో సిట్ ఏర్పాటైంది. ఈ సిట్ కు ఐపీఎస్ అధికారిని పర్యవేక్షనాధికారిగా నియమించారు. కలెక్టర్ తో ఏర్పాటు చేసిన బృందం కూడా ప్రత్యేక నివేదిక ఇచ్చింది. ఇదే తరుణంలో మచిలీపట్నంలోని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)కు చెందిన గోడౌన్ నుంచి వందల టన్నుల బియ్యం బస్తాలు మాయమయ్యాయి. మంత్రి భార్య జయసుధ, ప్రభుత్వ జిల్లా అధికారిపై కేసు నమోదు చేశారు. జిల్లా అధికారిని అరెస్ట్ చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్కడ చూసినా వేల టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నారు. అందరిపై కేసులు నమోదుకు ఆదేశించారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను ఈనెల 30న అరెస్ట్ చేశారు.

నకిలీ ఐపీఎస్ కలకలం

పవన్ కల్యాణ్ ఏజెన్సీ ఏరియాలో పర్యటిస్తున్న సందర్భంగా విజయనగరం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఐపీఎస్ అధికారి వేషం వేసుకుని పవన్ కల్యాణ్ సెక్యూరిటీతో ఉండిపోయారు. కార్యక్రమం ముగిసిన తరువాత పోలీసుల మధ్య ఉన్న ఐపీఎస్ అధికారి ఎవరనే విషయం వీడియోల్లో చూసి పోలీసు అధికారులు ఆశ్చర్య ఈ విషయంలో హోం మంత్రి తీవ్రంగా స్పందించారు. ఒక్క రోజులోనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు పోలీస్ వేషంలో రక్షణ సిబ్బందిలోకి వచ్చాడు. ఎవరు పంపించారు. అనే విషయాలపై పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సార్లు పవన్ కల్యాణ్ కు మావోయిస్టులు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను హతమార్చేందుకు వచ్చారా? అనే కోణంలోనూ విచారణ జరుగుతోంది.

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల కాల్చివేత

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సబ్ కార్యాలయంలోని జూలై 21న రికార్డుల కాల్చివేత సంఘటన కూడా రాష్ట్రాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఈ సంఘటనలో ఇరువురు ఉన్నధికారులు సస్పెన్షన్ కు గురయ్యారు. డిజీపీ ద్వారకా తిరుమలరావు, సిఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేరుగా హెలికాఫ్టర్ ద్వారా సంఘటా స్థలానికి చేరుకుని పరిశీలించి వచ్చారు. రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా ప్రత్యేక దర్యాప్తు జరిపారు. ప్రజల నుంచి అక్కడ అర్జీలు స్వీకరించారు. రికార్డులు కాల్చినంత మాత్రాన ఆన్ లైన్ లో ఉన్న రికార్డులు పదిలంగా ఉన్నాయనే విషయం స్పష్టమైంది. పైగా కొందరు కావాలనే రికార్డులు కాల్చారనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఇందులో ఉందనే ప్రచారం కూడా సాగింది. ఆ దిశగా కూడా విచారణ జరిగినా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం రాలేదు. ఈ కేసులో ఈనెల 30న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రచారానికే పరిమితమైన భారీ పెట్టుబడులు

రాష్ట్ర అభివృద్దికి ప్రైవేట్ పెట్టుబడులే దిక్కని, పెట్టుబడుల కోసం ఇప్పటికే పలు సార్లు సమావేశాలు నిర్వహించారు. దేశ, విదేశాలకు చెందిన వారితో సంప్రదింపులు జరిపారు. చాలా మందితో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నారు. రాష్టంలో 1,82,162 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 30న ప్రకటించారు. దీని ద్వారా 2,63,411 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. ఈ ఏడాదికి పెట్టుబడుల వ్యవహారం మాటలకే పరిమితమైంది. పారిశ్రామిక, ఇంధన రంగంలో పెట్టుబడులు భారీ స్థాయిలో వస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించిన లెక్కలు కూడా వెల్లడించింది. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయనే ఆశతో ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు.

అమిత్ షా వ్యాఖ్యలపై నోరు మెదపని పాలక, ప్రతిపక్షం

బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఉద్దేశించి పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు అంబేద్కర్ ను అవమానించేవిగా ఉన్నాయని, ప్రతిపక్ష పార్టీలతో పాటు దళిత సంఘాల వారు ఆందోళనలు నిర్వహించారు. అయితే సీఎం చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కానీ నోరు మెదపక పోవడాన్ని పలువురు తప్పు పట్టారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ నాయకుడు వైఎస్ జగన్ కూడా ఈ విషయంలో నోరు మెదపలేదు.

విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కుంభం కోణం జరిగిందని, విద్యుత్ కొనుగోలు రాష్టాలకు, దేశాలకు అదానీ లంచాలు ఇచ్చేందుకు మాట్లాడారని అమెరికా దర్యాప్తు సంస్థ వెల్లడించిన అంశాలపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు నోరు మోదపలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ కు ముడుపులు అందనున్నాయని దర్యాప్తు సంస్థ ఆరోపించినా గౌతమ్ అదానీ ప్రధాన మంత్రి మోదీ మనిషి కావడం వల్ల అధికారం పక్షం నోరు మెదపలేదనే విమర్శలు ఉన్నాయి.

అభివృద్ధిపై ఎన్నో ఆశలలు...

ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగులు బడ్జెట్ లో ఉండేది. ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలైంది. నెలనెల వడ్డీ కట్టడానికే వస్తున్న ఆదాయం సరిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుల బారి నుంచి రాష్ట్రం బయటపడి అభివృద్ధి పదం వైపు పయనించాలని ప్రజలు కోరుకుంటున్నారు. పాలకులు కక్షలు వీడి అభివృద్ధిపైనే దృష్టిని కేంద్రీకరించాలని ఆశగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం, ఎన్డీఏ అత్యధిక మెజారిటీతో గెలవడం అంటే గతంలో అభివృద్ధి జరగలేదనే ఒక్క ఆలోచనతోనే ఈ తీర్పును ఇచ్చారు. ఈ తీర్పు పాలకులకు కనువిప్పు కలిగించే తీర్పు అని చెప్పాల్సిందే. అధికారం చేపట్టిన కొత్తలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తీర్పు ఇంతలా.. ఇలా ఉంటుందని ఊహించలేదని స్పష్టం చేశారు. ప్రజల ఆశలు ఫలించాలని కోరుకుంటోంది ది ఫెడరల్.

Tags:    

Similar News