‘ఆ తర్వాతే రంజన్ మిశ్రా పని మొదలవ్వాలి...’
ఎస్ సి రిజర్వేషన్ల వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు కోసం ఆంధప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఐఎఎస్ అధికారి రంజన్ మిశ్రాకు సూచన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణపై ‘సుప్రీం కోర్టు’ తీర్పు అమలుకు చర్యలు మొదలుపెట్టింది. అందుకోసం రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏక సభ్య కమీషన్ ఏర్పాటు చేసింది. దాంతో ముప్పై ఏళ్ల క్రితం మొదలైన ‘మాదిగ దండోరా’ ఉద్యమ ఫలాలకోసం నిరీక్షించిన మాదిగ ఉద్యోగులు, ‘ప్రొఫెషనల్స్’ 23.11.24న విజయవాడలో సుప్రీంకోర్టు తీర్పు విజయోత్సవ సభ నిర్వహించారు.
ఐదు జిల్లాల నుంచి వచ్చిన ‘ఎస్సీ-బి’ కులాల రిటైర్డ్ ఉద్యోగులు, ‘ప్రొఫెషనల్స్’ సమావేశమై ఉపకులాల వర్గీకరణ తీర్పు అమలు తర్వాత క్షేత్ర స్థాయిలో దాన్ని వినియోగానికి తీసుకోవలసిన చర్యలు గురించి చర్చించారు. ‘సుప్రీం’ తీర్పు తమకు అనుకూలంగా రావడంతో సాధించిన ఈ విజయం ప్రాతిపదికగా తమలో ఆర్ధికంగా బలహీనులైన వారి నైపుణ్య అభివృద్ది చర్యల అమలుకు రాజధాని కేంద్రంగా ఒక యంత్రాంగం అవసరమని దాన్ని ఏర్పాటు చేసే దిశలో నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం- M 3 (మాదిగ మిత్ర మండలి) పేరుతో ఒక ‘ఫెడరేషన్’ తరహా వ్యవస్థ ఏర్పాటు చేసి దాన్ని జిల్లాలకు విస్తరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఈ ప్రయత్నాలకు ఒక ప్రతీకాత్మక చర్యగా సుప్రసిద్ధ దళిత కవి సామాజిక కార్యకర్త కృపాకర్ మాదిగ రచన ‘పంచుకుందాం రా’ కవితా సంకలనం ఆవిష్కరణ జరిగింది. సుప్రసిద్ధ దళిత స్త్రీవాద రచయిత్రి జూపాక సుభద్ర కు కొత్తగా ఈ ఏడాది ఏర్పడిన ‘డా. శ్రీకాకుళపు జాయ్ అడియల్ మేరి రాయ్’ స్మారక ప్రతిభా పురస్కారం – 2024 అందచేసారు. ముప్పై ఏళ్ల క్రితం ‘మాదిగ దండోరా’ ఉద్యమం మొదలైన దగ్గర నుంచి దానితో కలసి పనిచేసిన సీనియర్ స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ ఎస్.బి.ఎస్. ప్రకాష్ కుమార్ కృష్ణాజిల్లా ఉయ్యూరు కేంద్రంగా ‘శ్రీకాకుళపు బ్రదర్స్’ పేరుతొ దీన్ని ఏర్పాటు చేసారు. ఈ అవార్డ్ కు ఎంపిక చేసిన వారికి రూ. 25,000/- నగదు మొమెంటో,శాలువాతో సత్కరిస్తారు.
ఈ సందర్భంగా- ‘సుప్రీం తీర్పు తర్వాత ‘మూడవ చూపు’ మాటేమిటి?’ పేరుతో ఈ రచయిత ‘ది ఫెడరల్’ వెబ్సైట్ కు సిరీస్ గా రాసిన ఎనిమిది వ్యాసాలు పుస్తకం- ‘ముప్పై ఏళ్ల తర్వాత’ ఈ సభలో విడుదల చేసారు. ఈ సమావేశానికి యూనివర్సిటీ ప్రొఫెసర్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సర్వీస్/రిటైర్డ్ సీనియర్ అధికారులు, అడ్వకేట్లు, డాక్టర్లు, టీచర్లు, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు ఉద్యోగులు హాజరయ్యారు.
ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఇదే తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా నాలుగున్నర ఏళ్ళపాటు ఎస్సీ ‘వర్గీకరణ’ అమలులో ఉన్నప్పుడు ‘మాదిగ’ కులాన్ని- ‘ఎస్సీ’బి గ్రూపుగా పరిగణించింది. మళ్ళీ ఇప్పుడు తీర్పు అమలైతే, తిరిగి అదే ‘శ్రేణి’ తమకు లభిస్తుందని వీరు భావిస్తున్నారు. మా కంటే వెనుకబడిన ‘రెల్లి’ ఉపకులాలను మునుపటి మాదిరిగానే మా కంటే ముందు ‘ఎస్సీ’ ఏ గ్రూపుగా ఉంచాలని, రాబోయే విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికి ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు గ్రామ పంచాయతీ స్థాయి వరకూ చేరతాయని భావిస్తున్నాము అని సదస్సు కో-కన్వీనర్ తగరం రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అలాగే, ‘ఎస్సీ’ సంక్షేమ రంగానికి గత పదేళ్ళలో అయిన వ్యయం, వాటి లబ్దిదారులు ఏ ఉపకులాల వారు తదితర వివరాలు సంబంధిత కార్యాలయాల నుంచి రంజన్ మిశ్రా కమీషన్ సేకరించాక మాత్రమే అది తన పనిని మొదలుపెట్టాలని కోరుతూ, త్వరలో కమీషన్ చైర్మన్ ను కలిసి ‘ఎస్సీ’బి గ్రూపు పక్షంగా వినతి పత్రం ఇస్తామని ఆయన తెలిపారు.
ఈ సదస్సులో సైమన్ పల్లెపోగు IRS (Rtd) Central Excise and Customs ఇందుపల్లి ప్రకాష్ కుమార్ జాయింట్ కలెక్టర్-2 (రి) పి.జే. బెనర్జీ హైకోర్టు అడ్వకేట్, డా. వల్లూరి రామారావు Chief Medical officer, Goverment of India Medical services, Madras డా. కె. సుదర్శనం ఆస్టర్-రమేష్ హాస్పటల్స్ , డా. పి.జే. రత్నాకర్ జియాలజీ డిపార్టమెంట్, డా. నూతక్కి సతీష్ లా డిపార్టమెంట్ ఆచార్య నాగార్జున యూనివర్శిటీ, డా. శ్రీమతి కే. భాగ్యలక్ష్మిPrincipal SRR&CVR Degree College Vijayawada, కవులు ఖాదర్ మొహియుద్దీన్, అనిల్ డ్యానీ, కె. జోసఫ్, దాసరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశ బాధ్యతలు సమన్వయం: శ్రీ ఏ. గుప్తా (రైల్వేస్) సభాసమన్వయం: శ్రీ వై. జాన్ విల్సన్ (BSNL) ఆతిధ్యం: కె. రంగారావు (ఇన్స్యూరెన్స్) వ్యాఖ్యానం బి. జయప్రకాష్ (ఆకాశవాణి) చేసారు.