ఆంధ్ర సర్కారీ ప్రచారానికి ఓ ప్రైవేటు సంస్థ కావలెను!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన పథకాలు, కార్యక్రమాల ప్రచారం కోసం వినూత్న పద్ధతులు అమలు చేయనుంది.;

Update: 2025-03-03 07:40 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన పథకాలు, కార్యక్రమాల ప్రచారం కోసం వినూత్న పద్ధతులు అమలు చేయనుంది. ఇప్పటికే బ్రాండ్ అంబాసిడర్‌లను నియమించనున్నట్టు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేందుకు ఇప్పటికే అనేక విభాగాలు ఉన్నాయి. అందులో ప్రధానమైంది రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ. ఈ శాఖ ఆధ్వర్యంలో పని చేసే మరికొన్ని విభాగాలూ ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ ప్రచారం కోసం ప్రైవేటు ఏజెన్సీని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.
వాస్తవానికి జనవరిలోనే కమ్యూనికేషన్‌ ఏజెన్సీ ఏర్పాటుపై కసరత్తు మొదలైంది. ఆసక్తి ఉన్న సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించినప్పటికీ పాలనా పరమైన అభ్యంతరాలు రావడంతో తిరిగి తాజాగా సరికొత్త ప్రకటనను I&PR విభాగం విడుదల చేసింది. ఆసక్తి ఉన్న సంస్థలు మార్చి 11వ తేదీ లోగా దరఖాస్తులు పంపుకోవచ్చు. ఆసక్తిగల సంస్థలు ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున గత మూడేళ్లు టర్నోవర్‌ కలిగి ఉండాలి. ప్రచార, ప్రసార మాధ్యమాలలో అనుభవం ఉన్న కనీసం 100 మంది జర్నలిస్టులను, ఇతర సిబ్బందిని ఆ సంస్థ మెయినెటెయిన్ చేసి ఉండాలి.
విధి విధానాలు ఎలా ఉంటాయంటే...
ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడం ప్రధానకర్తవ్యం. పథకాలు గ్రామీణ ప్రాంతాలకు చేరేలా ప్రచారం నిర్వహించాలి. దూరదర్శన్, రేడియో, సోషల్‌ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను పెంచాలి. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలతోపాటు ఇతర ప్రముఖ భాషల్లోనూ ప్రచారం నిర్వహించడంతోపాటు ప్రభుత్వ ప్రతిష్ట పెంచే కథనాలను ఆయా మీడియాల్లో వచ్చేలా చూడాలి.
మీడియా కవరేజ్, ట్రాకింగ్, విశ్లేషణ చేయడంతోపాటు వివిధ శాఖలకు చెందిన వార్తలను మీడియా సంస్థలకు తెలియ­జేయాలి. అవసరం మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మీడియా ప్రముఖులతో పర్యటనలు నిర్వహించాలి. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఉన్నతాధికారుల ఇంటర్వ్యూలు ప్రముఖ వార్తాపత్రికలు, టీవీలు, ఎఫ్‌ఎం రేడియో చానళ్లలో వచ్చేలా చూడాలి. దేశీ, విదేశాల్లోని మీడియా రంగ ముఖ్యులకు ప్రభుత్వ సమావేశాల గురించి తెలియజేయాలి. ప్రభుత్వ సానుకూల, ప్రతికూలతలపై ప్రజాభిప్రాయం సేకరించాలి. వాటికి అనుగుణంగా వ్యూహాలను సూచించాలి.
ప్రభుత్వ ప్రచారం కోసం ప్రైవేటు సంస్థలకు ఎన్ని కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తారనేది ఇంకా ఖరారు కాలేదు.
Tags:    

Similar News