‘అల్లుడి వీడియో అంతా ఒక కుట్ర’.. అంబటి రాంబాబు

అల్లుడు గౌతమ్ వీడియోపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. గౌతమ్ అందుకే అలా మాట్లాడారని వివరించారు.

Update: 2024-05-06 07:19 GMT

‘మా మామ అంబటి రాంబాబుకు ఓటెయొద్దు’ అంటూ డాక్టర్ గుండబోలు గౌతమ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు స్పందించారు. తన అల్లుడి వీడియో వెనక పవన్ కల్యాణ్ కుట్ర ఉందని ఆరోపించారు. తన అల్లుడికి లేనిపోనివి చెప్పి రెచ్చగొట్టి వీడియో చేయించారని, ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఇంత దిగజారుడు రాజకీయాలకు పవన్ కల్యాణ్ తెరలేపారంటూ మండిపడ్డారు. పల్నాడు జిల్లాలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తన అట్టుడి వీడియోపై అంబటి రాంబాబు స్పందించారు. గౌతమ్ మాటలు పట్టించుకోవద్దని, అయినా తానేంటో ప్రజలకు తెలుసని అన్నారు.

అంతా కలిసే ఈ నాటకం

‘‘2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌కు ఎంత కీలకమైనవో ప్రతిఒక్కరికీ తెలుసు. వీటిలో ఓడిపోతమన్న భయం ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేస్తోంది. అందుకే ప్రజల దృష్టికి మరల్చడానికి పవన్ కల్యాణ్, చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ కలిసి ఈ నాటకాలు ఆడుతున్నారు. ప్రజల మనసుల్లో వైసీపీపై ఉన్న అభిమానాన్ని ఏం చేయలేని పరిస్థితుల్లో వైసీపీ నేతల ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి వారు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు. మా కుటుంబంలో ఉన్న విభేదాల గురించి తెలిసే.. గౌతమ్‌ను రెచ్చగొట్టి ఈ వీడియో విడుదల చేశారు’’అని విమర్శలు చేశారు అంబటి.

నాలుగేళ్లుగా విభేదాలు

‘‘నా రెండో కుమార్తె డాక్టర్ మనోజ్ఙ, అల్లుడు డాక్టర్ గౌతమ్ మధ్య నాలుగేళ్లుగా విభేదాలు ఉన్నాయి. రెండేళ్లుగా కూతురు, మనవరాలు, మనవడు నా సంరక్షణలోనే ఉన్నారు. వారికి అల్లుడు గౌతమ్ నుంచి ఎటువంటి సహాయం అందడం లేదు. కట్టుకున్న భార్య, కన్న పిల్లలపైనే బాధ్యత లేని వ్యక్తి ఇప్పుడు తన బాధ్యత అంటూ నాపై లేనిపోని అబద్దాలు చెప్తున్నారు. మా అల్లుడి మాటలు ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర. గౌతమ్ వ్యాఖ్యలపై అసలు స్పందించేవాడినే కాదు’’ అని చెప్పారాయన.

అందుకే స్పందిస్తున్నా

‘‘మా అల్లుడు గౌతమ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలన్న ఆలోచన కూడా నాకు లేదు. కానీ పొన్నూరులో కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న జనసేన అధినే పవన్ కల్యాణ్.. అంబటి రాంబాబుకు ఓటెయ్యొద్దని సొంత అట్టుడే చెబుతున్నారని అన్నారు. అందుకే స్పందిస్తున్నా.. ప్రతి కుటుంబంలో వివాదాలు ఉంటాయి. అలాగే మా కుటుంబంలో కూడా ఉన్నాయి. నా రెండో కూతురును పెళ్ళి చేసుకున్న గౌతమ్ మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. అందులో భాగంగానే నా కూతురును బెదిరించి విడాకులు ఇవ్వాలని గౌతమ్ కోరారు. అందుకే నా కూతురు, వారి పిల్లలను నా సంరక్షణలో ఉంచుకుని వారి భవిష్యత్ కోసం న్యాయ పోరాటం చేస్తున్నా’’అని ఆయన వివరించారు.

Tags:    

Similar News