రాజధాని అమరావతి మాటలకే పరిమితమైందే..!
గూగుల్‌లో వెతికినా కనిపించని రాజధాని నగరం. గాల్లో మాత్రమే కనిపించే విశ్వనగరం.;
అమరావతి ఎక్కడుంది? అమరావతికి గుర్తింపు ఏది? నేతల మాటల్లో తప్ప మరెక్కడా లేదు. విశ్వనగరం, అభివృద్ధికే మారురూపం అంటూ నేతలు కోసే కోతల్లోనే కనిపిస్తుంద కానీ.. ఇంకెక్కడా కనిపించడం లేదు. దాదాపు 5కోట్ల మంది ప్రజలు ఉన్న రాష్ట్ర రాజధానిగా చెప్తున్న ఈ ప్రాంతానికి కనీస గుర్తింపు కూడా లేదు. మనం చెప్పుకోవడానికే కాదు.. చూపించుకోవడానికి ఏమీ లేదు. పదేళ్లకు పైగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రచారం చేస్తున్నారే తప్ప.. గుర్తింపు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ముఖ్యమంత్రులు మారారే తప్ప.. రాష్ట్ర రాజధాని అంశం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది.
2014 ఎన్నికల్లో సీఎం పీఠాన్ని అధిష్టించిన సీఎం చంద్రబాబు.. రైతుల దగ్గర నుంచి భూములు సేకరించి మరీ అమరావతిని నిర్మిస్తానన్నారు. విశ్వనగరం చేస్తానన్నారు. దేశంలోని అన్ని రాజధాని నగరాలకన్నా మేటిగా తీర్చిదిద్దుతానన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ అమరావతికి ఎటువంటి గుర్తింపు లేదు. రాజధాని నగరంగా చెప్తున్నప్పటికీ ఇప్పటికీ పోస్టల్ కోడ్ లేదు. Google లో అమరావతి అని వెతికితే ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న అమరావతి ఊసే వస్తుంది తప్పితే.. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి కానరాదే.
ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎక్కడ ఉంది అని చూస్తే.. అది కూడా రాజధాని అని చెప్పుకుంటున్న అమరావతిలో లేదు. వెలగపుడిలో ఉంది. అమరావతికి పిన్ కోడ్ లేదు కానీ.. సచివాలయానికి ప్రత్యేక పిన్ కోడ్ ఉంది. అది 522238.. ఇది 1776 మంది జనాభాతో 5.8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉండే ప్రాంతానికి ఇచ్చిన పిన్‌కోడ్. సెక్రటేరియట్ భవనానికి ఇచ్చిన ప్రాధాన్యత కూడా రాజధాని నగరానికి లేకుండా పోయింది. ఆన్‌లైన్‌లో అమరావతి అని వెతికితే ఇప్పటికి కూడా గుంటూరు జిల్లాలో భాగంగానే చూపిస్తుండటం గమనార్హం. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటింది.. అమరావతి రాజధాని అని చంద్రబాబు ప్రకటించింది కూడా ఎనిమిది సంవత్సరాల ముందు మాటే.. కానీ ఇప్పటికి కూడా అమరావతికి ప్రత్యేక గుర్తింపు లేదు. ఏమీ లేని అమరావతి అసలు ఎక్కడుంది? అంటే మాత్రం.. నాయకుల మాటల్లో అన్న మాటే వినిపిస్తోంది.
అమరావతికి రెండోసారి వేసిన శంకుస్థాపన రాయి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. రాజకీయ నాయకుల మాటల్లో, ప్రజల కలలో, శుక్రవారం ప్రధాని మోదీ చేసిన శంకుస్థాపన రాయిపైన ఉంది. సెక్రటేరియట్ భవనం నేమ్ ప్లేట్‌పైన కూడా ఉంది. అంతే తప్ప.. మరెక్కడా అమరావతి లేదు. ‘‘పక్కా ప్రణాళికతో అందరికీ అవకాశాలు సృష్టించేలా, రాష్ట్రానికి చోదక శక్తిగా నిలిచేలా ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తాం’’ అని పునఃప్రారంభ కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో అమరావతి వినిపించింది.
మూడేళ్లలో విశ్వనగరంగా అమరావతిని నిర్మిస్తామన్న మంత్రులు ఉపన్యాసాల్లో మెరిసింది. ప్రపంచస్థాయి నగరంగా మారే సత్తా ఉన్న సిటీ అమరావతి అన్న ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటల్లో పలకరించింది. ‘అమరావతి భవిష్యత్ పట్టణ కేంద్రంగా ఆవిర్భవిస్తుందని, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథాన్ని మెరుగుపరుస్తుందని’ అని ప్రధాని మోదీ ప్రసంగంలో వినిపించింది. దాంతో పాటుగా సెక్రటేరియట్ భవన నేమ్‌బోర్డ్‌పై దుమ్ము పడుతూ దర్శనమిస్తుంది. శుక్రవారం ప్రధాని మోదీ చేసిన రెండో శంకుస్థాపన రాయిపైనా కనిపించింది.
2015లో అమరావతికి ప్రధాని మోదీ వేసిన శంకుస్థాపన రాయి
అమరావతికి రెండు రాళ్లు..
రాజధాని అన్న ట్యాగ్‌ను అమరావతికి అంటించిన తర్వాత ఆ ప్రాంతానికి ఏమైనా వచ్చిందా? అంటే రెండు రాళ్లు, చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి వచ్చాయనే చెప్పాలి. 2015లో అమరావతి ప్రణాళికను ప్రకటించిన తర్వాత శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీ వచ్చారు. ఆయన తనతో పాటు యమునా నది నీరు, భారత పార్లమెంటు నుంచి మట్టిని తెచ్చి ఇచ్చారు. దాంతో పాటు అప్పుడు ఒకసారి చేసిన శంకుస్థాపన రాయి, ఇప్పుడు మళ్ళీ వేసిన శంకుస్థాపన రాయి మాత్రమే అమరావతికి వచ్చాయి. అంతకుమించి రాజధాని ప్రాంతానికి రావాల్సిన గుర్తింపే రాలేదు.
ఈ నగరం కాబోయే విశ్వనగరం, ఫ్యూచర్ సిటీ, అభివృద్ధికి కేరాఫ్. ఇవి మన నేతలు చెప్తున్న మాటలు. రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి రాజధానిని నిర్మిస్తానన్న చంద్రబాబు.. ఇప్పటి వరకు పిన్ కోడ్ కూడా తీసుకురాలేదు. అమరావతి అంటే ఆంధ్ర రాజధాని కాదు.. అరకొరగా జరిగిన పనులే దర్శనమిస్తున్నాయి. అసలు నేతలు చెప్తున్న ఆంధ్ర రాజధాని అమరావతి ఎక్కడుంది?..