అమరావతి రాజధానిలో ప్రధాన రంగాలతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా ఓ రంగంగా రూపు దిద్దుకోనుంది. ఏ రాజధాని ప్రాంతంలోనూ స్పోర్ట్స్‌కు ఒక ప్రత్యేక ప్రదేశ మంటూ ఏర్పాటు చేయలేదు. ఏవైనా చిన్న ఆటస్థలాలు, స్టేడియాలు వంటివి ఉండొచ్చు. అలా కాకుండా ప్రత్యేకంగా స్పోర్ట్స్, గేమ్స్‌కు సుమారు మూడు ఎకరాలు కేటాయించి అందులో క్రీడల్లో రాణించే వారికి తగిన శిక్షణ కూడా ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు తగిన విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం క్రీడా శాఖను ఆదేశించినట్లు సమాచారం. అన్ని రకాల క్రీడలు ఆడటంతో పాటు శిక్షణ కూడా ఉండే విధంగా చేయడం వల్ల రాజధాని ప్రాంతంలో ఉండే ఉద్యోగులకు క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. సెలవుల్లో సరదాగా ఆడతారు. అలాగే వారి పిల్లలు అవసరమైన సందర్భాల్లో శిక్షణ తీసుకుంటారు. శిక్షణ పొందిన యువకులు భవిష్యత్‌లో శిక్షకులుగా ఎదుగుతారనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది.
అందులో భాగంగానే క్రికెట్ టీమ్ మాజీ కెఫ్టెన్, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పిజిటిఐ) చైర్మన్ కపిల్ దేవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అమరావతిలో కలిసారు. గోల్ఫ్ క్రీడను ఏపీలో అభివృద్ధి చేసే అంశాలపై చర్చించారు. ఏపీలో అనువైన ప్రాంతాలు ఉన్నా, గోల్ఫ్ క్రీడ ఆడే క్రీడాకారులు ఉన్నా.. శిక్షకులు కరువయ్యారు. ఇందుకు ప్రత్యేక క్రీడా మైదానాలు కావాల్సి ఉంటుంది. పచ్చని పశ్చిక మధ్య అహ్లాదకరమైన వాతావరణంలో గోల్ఫ్ క్రీడను ఎక్కువ మంది ఆడేందుకు ఇష్టపడతారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని కియా ఫ్యాక్టరీలో వివిధ దేశాలకు చెందిన వారు ఉద్యోగులుగా ఉన్నారు. వీరు వీకెండ్‌లో గోల్ఫ్ ఆడేందుకు బెంగళూరుకు వెళుతున్నారు. వీరంతా ఇక్కడే ఆడాలంటే కావాల్సిన మైదానాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
గోల్ఫ్ మైదానాలు అనంతపురం, విశాఖపట్నం, అమరావతిలో ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రదేశాలు ఉన్నందున అక్కడ గోల్ఫ్ క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని కపిల్ దేవ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. కపిల్‌దేవ్ మాటలపై సీఎం సానుకూలంగా స్పందించారు. గోల్ఫ్ క్రీడ ఆరోగ్యవంతమైన క్రీడ అని, ఎంతో హాయిగా ఆడుకునేందుకు అవకాశం ఏపీలో ఉందని, రాబోయే కాలంలో ఇక్కడే అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా జరుగుతాయని కపిల్ దేవ్ సీఎం వద్ద ప్రస్తావించారు. అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్, అనంతపురం, వైజాగ్‌ల్లో ప్రీమియర్ గోల్ఫ్ కోర్స్ క్లబ్‌లను ప్రారంభించేందుకు దృష్టి సారించాలని కపిల్ దేవ్ సీఎంను కోరారు. యువకుల్లో గోల్ఫ్ పట్ల ఆసక్తి పెరుగుతోందని, గోల్ఫ్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గోల్ఫ్ క్లబ్‌లు ఉపయోగపడతాయనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
క్రికెట్ క్రీడాకారులు కూడా తగిన శిక్షణ తీసుకునేందుకు మైదానాలు ఒకే చోట అందుబాటులో లేవు. అలాగే వివిధ రకాల జాతీయ, అంతర్జాతీయ క్రీడలతో పాటు రాష్ట్ర స్థాయి క్రీడలకు కూడా శిక్షణ కేంద్రంగానూ, క్రీడా మైదానంగాను క్రీడా హబ్‌ను అమరావతిలో ఏర్పాటు చేసి అంతర్జాతీయంగా పేరు సంపాదించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికే దాదాపు పాత జిల్లా కేంద్రాల్లో క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. ఇందులో వివిధ రకాల ఆటలు జరుగుతున్నాయి. భవిష్యత్‌లో పెద్ద స్టేడియాలను అభివృద్ధి చేయాలని, మినీ స్టేడియాలు శిక్షణకు ఉపయోగ పడే విధంగా చూడాలనే ఆలోచన ప్రభుత్వంలో ఉంది. జిల్లా కేంద్రాల్లో ఉండే స్టేడియాల్లో స్థానిక క్రీడాకారులు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆటలు ఆడుతున్నారు. కొందరు కోచ్‌లు వాలీబాల్, ఫుడ్ బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ వంటి ఆటల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగాలంటే ప్రతి ఒక్కరూ శారీరకంగా ఎంతో కొంత శ్రమ చేయాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు. క్రీడలు కూడా ఆరోగ్య సూత్రాల్లో ప్రధానమైన భూమిక పోషిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉండటం వల్ల ఏపీలో జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం తీర్చి దిద్దాలనే ఆలోచనలో ఉన్నారు. మంగళగిరిలో ప్రస్తుతం ఉన్న జాతీయ క్రికెట్ క్రీడా స్టేడియం నిర్మాణంలో కొన్ని లోపాలు ఉన్నందున వాటిని సరిదిద్దాలా.. లేక కూలగొట్టి అదే స్థానంలో కొత్త స్టేడియం నిర్మించాలా? అనే ఆలోచన ఏసీఏ చేస్తోంది. క్రీడా హబ్‌గా అమరావతిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినందున కేవలం క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం రెండెకరాల స్థలం ప్రభుత్వం నుంచి తీసుకోవాలనే ఆలోచనలో ఏసీఏ ఉంది. అందుకు సీఎం నుంచి అనుమతి రావాల్సి ఉంది. చిన్నితో కపిల్ దేవ్ క్రికెట్ క్రీడారంగానికి ఉన్న భవిష్యత్‌పై చర్చించారు. ఏసీఏ ద్వారా తన చేతనైనంత వరకు క్రికెట్ అభివృద్ధికి తోడ్పాటు నందిస్తానని, అందుకు మీ సహకారం కావాలని కపిల్‌దేవ్‌ను ఎంపీ కోరారు.