వైసీపీకి మద్దతుగా అల్లూ అర్జున్ ప్రచారం..!
ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్.. ఈరోజు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిని కలిశారు. అందరూ ఓట్లేసి భారీ మెజార్టీలో శిల్పా రవిని గెలిపించాలని ఫ్యాన్స్‌ను కోరారు.
ఆంధ్రలో ఎన్నికల ప్రచారానికి నేడే ఆఖరి రోజు. ఈరోజు ఆంధ్ర ఎన్నికల ప్రచారల ఘట్టంలో కీలక అంశం చోటు చేసుకుంది. కొన్ని రోజుల కిందటే ‘కుటుంబ సభ్యడిగా నా ప్రేమ, నా మద్దుతు ఎల్లవేళలా మీకే ఉంటాయి. మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నా’ అంటూ పవన్ కల్యాణ్ ఉద్దేశించి ట్వీట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఈరోజు వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా ఉంది. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న బన్నీ.. అతనిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఇది వైసీపీ తరపు ప్రచారమేనా!
కుటుంబ సభ్యునిగా తన పూర్తి మద్దతు మీకే ఉంటుందంటూ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసిన బన్నీ.. ఇప్పుడు సడెన్‌గా వైసీపీ అభ్యర్థి శిల్పా రవి తరపున ప్రచార బరిలోకి దిగడం తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి. అయితే ఈరోజు తన భార్య స్నేహారెడ్డితో కలిసి బన్నీ.. శిల్పా రవి ఇంటికి వెళ్లారు. వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవి.. బన్నీ దంపతులకు చాలా క్లోజ్ ఫ్రెండ్. బన్నీ రావడంతో అతనిని చూడటానికి అభిమానలు తండోపతండాలుగా వచ్చారు. అభిమానులను చూసిన బన్నీ వారికి అభివాదం చేయడం.. అదే సమయంలో పక్కనే శిల్పా రవి ఉండటంతో అంతా దీన్ని ఎన్నికల ప్రచారం అనుకున్నారని బన్నీ సన్నిహితులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇది ఎటువంటి ప్రచార కార్యక్రమం, సభ కాదని, శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటి దగ్గరేనని, వచ్చిన వారంతా కూడా బన్నీని చూడటానికేనని శిల్పా రవి అనుచరులు కూడా చెప్పారు. అంతేకాకుండా బన్నీ వైసీపీ తరపున ప్రచారమే చేయలేదని, వైరల్ అవుతున్న వీడియో ఎన్నికల ప్రచారానికి సంబంధించినది కాదని బన్నీ అభిమానులు చెప్తున్నారు. అందుకు.. అక్కడ ఉన్న ప్రజల్లో ఏ ఒక్కరూ కూడా ఏ పార్టీకి సంబంధించిన జెండా కూడా పట్టుకుని లేకపోవడమే నిదర్శనమని, ఏ పార్టీ ప్రచారమైనా పార్టీ జెండా లేకుండా జరుగుతుందా అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇంకా నయమంటున్న విశ్లేషకులు
బన్నీ నంద్యాలకు వెళ్లడం అక్కడ ఎన్నికల ప్రచారం తరహాలో ప్రజలు రావడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కానీ దీనిపైన స్పందిస్తున్న విశ్లేషకులు మాత్రం నంద్యాల సీటు టీడీపీకి రావడం వల్ల ఇప్పుడు ఒకందాన మంచి జరిగిందని అంటున్నారు. అదెలా అంటే.. ఒకవేళ నంద్యాల సీటు నుంచి జనసేన అభ్యర్థి గనుక పోటీలో ఉండి ఉంటే.. ఈ పాటికే ఫ్యాన్స్ మధ్య దాడులు, అల్లర్లు మొదలై ఉండేవని, కానీ అక్కడ టీడీపీ అభ్యర్థి నిలబడటం వల్ల అటువంటి లేకుండా సోషల్ మీడియా వార్ దగ్గరే ఆగిపోయిందని వారు అభిప్రాయపడుతున్నారు.