పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై అన్నీ అనుమానాలే.. అన్నీ ప్రశ్నలే

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల అనుమానాస్పద మృతి కేసు సవాలుగా మారింది.;

Update: 2025-03-28 03:59 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు ప్రపంచంలో సంచలనం సృష్టించిన పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల అనుమానాస్పద మృతి క్రైస్తవ సమాజాన్ని కలవరపాటుకు గురి చేసింది. మత ఘర్షణలు లేని, మత సామరస్యంతో మెలిగే తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్క సారిగా అభద్రతా భావం నెలకొంది. పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతి సంఘటన దృశ్యాలు చూసిన, విన్న ప్రతి ఒక్కరిలోను, క్రైస్తవ సమాజంలోను, ప్రజాస్వామ్య వాదుల్లోనూ అన్నీ అనుమానాలు, ప్రశ్నలే మెదులుతున్నాయి. సామాజి మాధ్యమాల్లోను ఈ ప్రశ్నలే చర్చనీయాంశాలుగా మారాయి. వీటికి ప్రభుత్వం, పోలీసులు సమాదానం చెబుతుందా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.

పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతికి సంబంధించిన అనేక వీడియోలు వైరల్‌గా మారాయి. ఆయన బుల్లెట్‌ మీద ప్రయాణిస్తూ సోమవారం రాత్రి 11:31 గంటల సమయంలో కొవ్వూరు టోల్‌గేట్‌ దాటుతూ కనిపించారు. ప్రవీణ్‌ పగడాల 11:42 గంటల సమయంలో నయారా పెట్రోల్‌ బంకు వద్దకు చేరుకున్నప్పడు రికార్డు అయిన మరో వీడియో కూడా వైరల్‌గా మారింది. హైవే మీద ప్రవీణ్‌ పగడాల ప్రయాణిస్తున్న సయమంలో లారీలు వెళ్లడం కనిపిస్తున్నాయి. అయితే ఈ వీడియోలు అనేక అనుమానాలకు తావిచ్చేవిగా ఉన్నాయి. ప్రవీణ్‌ పగడాల ప్రయాణిస్తున్న బుల్లెట్‌కు హెడ్‌లైట్‌ లేదు. పగిలిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఇండికేటర్‌ లైట్లు మాత్రమే వెలుగుతూ కనిపిస్తున్నాయి. అంటే అప్పటికే ప్రవీణ్‌ పగడాల మీద దాడి జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రవీణ్‌ పగడాల మృతికి సంబంధించిన మొత్తం కేసులో తొలి, అతి కీలక అనుమానంగా దీనిని భావిస్తున్నారు.
ఇలాంటి అనేక కీలకమైన అనుమానాలు ఈ కేసులో కనిపిస్తున్నాయి. ఏదైనా బైక్‌ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు దానిని నడుపుత్ను వ్యక్తి మీద బైక్‌ పడినట్లు ఎక్కడా ఉండదు. వ్యక్తి ఒక చోట, బైక్‌ మరో చోట పడే చాన్సులే ఎక్కువుగా ఉంటాయి. కానీ ప్రవీణ్‌ పగడాల కేసులో దప్పటి కప్పుకున్నట్లు హతుడు మీద బుల్లెట్‌ పరిచినట్లు పడి ఉంది. ఆ బుల్లెట్‌ ఏ మాత్రం డ్యామేజ్‌ కాకుండా అలానే ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇదెలా సాధ్యం అవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బుల్లెట్‌ను నడుపుతున్నప్పుడు ప్రవీణ్‌ పగడాల హెల్మెట్‌ను ధరించి ఉన్నాడు. ఇది విదేశాల నుంచి తెప్పించుకున్న హెల్మెట్‌. అలాంటి హెల్మెట్‌ ధరించి డ్రైవ్‌ చేస్తోన్న ప్రవీణ్‌ పగడాల ముఖం మీద, తలపైన గాయాలు ఉన్నాయి. ముఖం రెండుగా చీలిపోయినట్లు గాయాలు ఉన్నాయి. అంత దృఢమైన, శక్తివంతమైన హెల్మెట్‌ ధరించి ఉన్న ప్రవీణ్‌ పగడాలకు ఇలాంటి బలమైన గాయాలు ఎలా జరిగాయనేది అనుమానాలకు తావిచ్చేదిగానే ఉంది.
ప్రమాదం జరిగినప్పుడు డెడ్‌ బాడీకి ఉన్న దుస్తుల మీద రక్తంతో ఉన్న చెప్పులు, బూట్ల ముద్రలు కనిపించవు. కానీ ప్రవీణ్‌ పగడాల కేసులో ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. యాక్సిడెంట్‌ చోటు చేసుకున్నప్పుడు డెడ్‌బాడీ దుస్తుల మీద రక్తపు మరకలతో ఉన్న బూట్ల మరకలు కనిపించడానికి అవకాశమే లేదు. రక్తపు మరకలతో ఉన్న చెప్పులు, బూట్లతో ప్రవీణ్‌ పగడాల చాతి మీద తొక్కిన విధంగా ఆ మరకలు కనిపిస్తుండటం ఇది ప్రమాదం కాదు, హత్యే అనేదానికి కారణంగా చెబుతున్నారు. అంతేకాకుండా ప్రవీణ్‌ పగడాల మృతదేహం పడిఉన్న చోటులో రక్తపు మరకలతో ఉన్న కర్రలు కనిపించాయి. డెడ్‌ బాడీ చుట్టూ ఈ కర్రలు ఉన్నాయి. కొట్టినప్పు అంటుకున్న రక్తపు మరకలు కర్రలపై ఎలా ఉంటాయో అదేవిధంగా కర్రలకు రక్తపు మరకలు ఉన్నాయి. అంటే ఎవరో ఈ కర్రలతోనే ప్రవీణ్‌ పగడాలను కొట్టి కొట్టి చంపినట్లు అనుమనాలకు తావిచ్చేలా ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు సహజంగా బైక్‌లు నుజ్జు నుజ్జు అయిపోతుంటాయి. పార్టు పార్టులుగా పగిలిపోయి విరిగి పోయి ఉంటాయి. వంకర్లు పోయి ఉంటాయి.
కానీ ప్రవీణ్‌ పగడాల బుల్లెట్‌కు ఒక్క హెడ్‌లైట్‌ పగిలిన దెబ్బ తప్ప బుల్లెట్‌కు ఎక్కడా కూడా గీసుకున్నట్లు కూడా లేదు. చెక్కు చెదరకుండా అలా డెడ్‌ బాడీ మీద పరిచినట్లు ఉంది. మనిషి ప్రాణం పోయిన ఈ ప్రమాదంలో బైక్‌కు ఒక్క సొట్ట కూడా లేదంటే ఇది ప్రమాదం ఎలా అవుతుందనే అనుమానాలు రేకెత్తించేదిగా ఉంది. ఎవరో ప్రవీణ్‌ను ప్రీ ప్లాన్డ్‌గా చంపేసి బుల్లెట్‌ను అతని మీద వేసి, దీనిని ప్రమాదం అని చిత్రీకరించేలా ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ïసీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయిన ప్రకారం టోల్‌ ప్లాజా నుంచి ప్రమాదం జరిగిన చోటు వరకు కేవలం ఆరు కిమీ దూరం మాత్రమే ఉంది. ఈ నడుమ కాలంలో, మధ్య దూరంలో అసలు ఏమి జరిగిందనేది ఈ కేసులో అత్యంత కీలకమైన అంశంగా మారింది. ప్రవీణ్‌ పగడాల డెడ్‌ బాడీ పడి ఉన్న తీరు, సీసీటీవీలో కనిపిస్తున్న దృశ్యాలు చూసిన వారు ఈ ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.
తనకు ప్రాణ హాని ఉందని మరణించడానికి కొద్ది రోజుల ముందు ప్రవీణ్‌ పగడాల చెప్పారని, అలా చెప్పిన కొద్ది రోజుల తర్వాత ఆయన మృతి చెందారని, ఈ నేపథ్యంలో ఇది యాక్సిడెంట్‌ ఎలా అవుతుందని, ఇది హత్యే అని ప్రశ్నిస్తున్నారు. ప్రవీణ్‌ ప్రయాణిస్తున్న బుల్లెట్‌ను వెనుక నుంచి ఏదైనా వాహనం ఢీ కొట్టితే ఆ స్పీడ్‌కు చాలా దూరంలో పడి చెల్లా చెదురు కావాలి. కానీ రోడ్డుకు 5 అడుగుల తక్కువ దూరంలోనే పడి ఉన్నాడు. బుల్లెట్‌కు ఏమీ కాలేదు. దానిని నడుపుతున్న వ్యక్తి ఎలా మరణిస్తాడు. హెల్మెట్‌ పెట్టుకున్న వ్యక్తి తలకు, ముఖానికి గాయాలు ఎందులు అవుతాయి? ఎలా అవుతాయి? కారు గుద్దింది అంటున్నారే కానీ దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీనే లేదు. సోమవారం రాత్రి 11:32 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.. కానీ సుమారు ఒంటి గంట సమయంలో ప్రవీణ్‌ పగడాల కార్యాలయానికి ఆయన ఫోన్‌ నంబర్‌ నుంచి మెస్సేజ్‌లు వెళ్లాయి. అంతకు ముందే ఆ వ్యక్తి చనిపోతే ఆయన ఫోన్‌ నుంచి ఆ మెస్సేజ్‌లు పంపింది ఎవరు?
ఫారిన్‌ హెల్మెట్‌ పెట్టకున్న వ్యక్తి కేవలం మూతి పగలి ఎలా చనిపోతారనేది మరో అనుమానం. ఒక వేళ ఇది ప్రమాదమే అయితే డెడ్‌ బాడీ దుస్తుల మీద రక్తపు మరకలతో కూడిన ఫుట్‌ ప్రింట్లు ఎందుకు ఉంటాయి? బుల్లెట్‌కు ఉన్న సేఫ్టీ రాడ్లుకు ప్రవీణ్‌ పగడాలను పదే పదే కొట్టినట్లు ఉందనేది మరో ప్రశ్న. సంఘటన జరిగి 24 గంటలు గడిచినా.. డెడ్‌ బాభీకి పోస్టుమర్టం చేయలేదు. కుడి భుజం మీద, ఎడం భుజం మీద, మోకాళ్ల మీద గాయాలు ఉన్నాయి. ప్రవీణ్‌ పగడాల కాలికి తొడ భాగంలో కాలిపోయినట్లు ఉంది. వేసుకొని ఉన్న ప్యాంట్‌ కాలిపోకుండా లోపల్‌ శరీరభాగం ఎలా కాలుతుంది? టోల్‌ ప్లాజా వద్ద బుల్లెట్‌ మీద ఉన్నది ప్రవీణ్‌ పగడాలేనా? ఇంకెవరైనా తీసుకొచ్చారా? అప్పటికే బండి హెడ్‌ లైట్‌ పగిలి పోయింది, సిగ్నల్‌ లైట్లు మాత్రమే పని చేస్తున్నాయి.
ఇలా ఒకటి కాదు.. రెండు కాదు, పదుల సంఖ్యల్లో అనుమానాలు, ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. వివిధ రకాల మీడియాలతో మాట్లాడిన క్రైస్తవ సోదరులు కూడా దాదాపు ఇలాంటి అనుమానాలనే వ్యక్తం చేస్తున్నారు. ఇదే రకమైన ప్రశ్నలను సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటన్నింటి ప్రభుత్వం సమాధానం చెబుతుందా? ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు లోను కాకుండా పోలీసులు విచారణ జరుపుతారా? బాదితుడి కుటుంబానికి, క్రైస్తవ సమాజానికి న్యాయం చేకూర్చి, తాము పారదర్శకంగానే వ్యవహరించామనే సందేశాన్ని యావత్‌ తెలుగు సమాజానికి అందిస్తారా? అనే అనుమానాలు, ప్రశ్నలు అందరిలో మెదులుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల కేసులో ప్రభుత్వం, పోలీసులు ఏమని చెబుతారనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
Tags:    

Similar News