ఒకే హెలికాఫ్టర్ లో ఆ ముగ్గురూ.. బీజేపీ నేతకు నో ప్లేస్

ఆహార పొట్లాలు సిద్ధం, ఎవరూ ఆందోళన పడొద్దన్న మంత్రి జనార్దన్ రెడ్డి

Update: 2025-10-16 05:59 GMT
ఎన్డీఏ కూటమి నేతల బంధం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ(PM Modi), రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెట్టపట్టాల్ వేసుకుని నడిచారు. ఒకే హెలికాఫ్టర్ లో ఈ ముగ్గురూ శ్రీశైలం బయల్దేరారు.

 కర్నూలు ఎయిర్‌పోర్టులో దిగిన ప్రధానికి సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) స్వాగతం పలికారు. నారా లోకేష్ సహా పలువుర్ని పరిచయం చేసిన అనంతరం ఈ ముగ్గురూ కలిసి ఒకే హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పక్కనే ఉన్నప్పటికీ హెలికాఫ్టర్ లో చోటు లభించలేదు. ప్రధానితో వెళ్లేందుకు ప్రొటోకాల్ అంగీకరించదని అధికారులు చెప్పినట్టు సమాచారం.

శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం దర్శించుకోనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సున్నిపెంట వద్ద సుమారు 1500 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఆహార పొట్లాలు సిద్ధం..
ప్రధాని మోదీ సభ సందర్భంగా కర్నూలుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు ఇప్పటికే ఆయా ప్రాంతాల నుంచి బయల్దేరారు. సభకు వచ్చే ప్రజల కోసం ఆహార ఏర్పాట్లు చేశారు. కర్నూలులోని పలు ప్రాంతాల్లో ఆహార పొట్లాలను సిద్ధం చేస్తున్నారు. నంద్యాల-కర్నూలు రోడ్డులో ఆహార ఏర్పాట్లను మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. ఫుడ్‌స్టాల్‌లో ఏర్పాటు చేసిన వివిధ రకాల వంటకాలు, ఆహార పదార్థాల నాణ్యతను ఆయన పరిశీలించారు. సభకు వచ్చే సామాన్య ప్రజలు, కూటమి నేతలు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులకు మంత్రి సూచించారు.
Tags:    

Similar News