పాడేరులో ఆదివాసీ దినోత్సవం
ఏజెన్సీలోని పాడేరులో ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అక్కడి గిరిజనులతో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడతారు.;
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం (ఆగస్టు 9) న అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. ‘గిరిజనుల హక్కుల పరిరక్షణ- కృత్రిమ మేధస్సు, ఆదివాసీల భవిష్యత్తు’ అనే థీమ్‌తో ఈ కార్యక్రమం జరుగుతుంది. సీఎం స్థానిక గిరిజన సంప్రదాయ వేడుకల్లో పాల్గొని, ఆదివాసీల కష్టసుఖాలను తెలుసుకుని, కాఫీ పెంపకందారులతో సమావేశమై, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాజెక్టులు
ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో రూ.2404 కోట్లతో రోడ్లు, వంతెనల నిర్మాణం ద్వారా 2075కి పైగా గ్రామాలను అనుసంధానించనుంది. అల్లూరి జిల్లాలో రూ.41 కోట్లతో రోడ్ల కారిడార్లు, రూ.50 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, పాడేరులో మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతున్నాయి. జల్ జీవన్ మిషన్ కింద రూ.2373 కోట్లతో 13,816 ఆవాసాలకు మంచినీటి సరఫరా, రూ.150 కోట్లతో 520కి పైగా రెసిడెన్షియల్ పాఠశాలలను వసతి గృహాలుగా మార్చనున్నారు. అరకు కాఫీ విస్తరణ కోసం రూ.202 కోట్లు, పర్యాటక ప్రాజెక్టుల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.
ఆదివాసీల నృత్యం (ఫైల్ ఫొటో)
ఆదివాసీ సంక్షేమం
2024-25 ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్డ్ ట్రైబ్ కాంపోనెంట్ కింద రూ.7557 కోట్లు వ్యయం చేస్తున్న ప్రభుత్వం, 4.82 లక్షల గిరిజన కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సోలార్ రూఫ్ టాప్ పథకం, రూ.1595 కోట్లతో 3,77,051 మందికి పెన్షన్లు, రూ.642 కోట్లతో 4,86,803 మంది విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం పథకం అందిస్తోంది. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలనకు ‘మిషన్-2047’ ద్వారా 1487 మందికి నెలకు రూ.10,000 ఫించన్, ప్రకృతి వ్యవసాయం, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంతో గిరిజన రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది.