ఆచార్య గంగిశెట్టి లక్ష్మినారాయణ అమెరికాలో మృతి

కేంద్ర సాహిత్య అకాడెమి ‘అనువాద సాహిత్య పురస్కారం‘ తో గంగిశెట్టి లక్ష్మినారాయణను సత్కరించింది.;

Update: 2025-08-01 09:17 GMT

ప్రముఖ తెలుగు పండితులు, రచయిత, విద్యావేత్త ఆచార్య గంగిశెట్టి లక్ష్మినారాయణ అమెరికాలో అమరణించారు. భారత కాలమానం ప్రకారం 1–8–25 శుక్రవారం నాడు ఉదయం అమెరికాలో కాలిఫోర్నియాలో తుదిశ్వాస విడిచారు. ఆచార్య గంగిశెట్టి లక్ష్మినారాయణ అనంతపురం జిల్లా కదిరి మండలంలో జన్మించారు. తెలుగులో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ, సంస్కృతంలో ఎంఏ, బిఎడ్‌ పూర్తి చేశారు. బిఎడ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గంగిశెట్టి లక్ష్మినారాయణ రెండు గోల్డ్‌ మెడల్స్‌ కూడా దక్కించుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖ అధ్యక్షులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. శ్రీ భైరప్ప గారు కన్నడంలో రచించిన ‘పర్వ’ నవలను అత్యంత సమర్ధవంతంగా తెలుగులోకి అనువదించారు. ఆ అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడెమి ‘అనువాద సాహిత్య పురస్కారం‘ తో గంగిశెట్టి లక్ష్మినారాయణను సత్కరించింది. ‘రావిరంగారావు సాహిత్యపీఠం’ వ్యవస్థాకుల్లో గంగిశెట్టి లక్ష్మినారాయణ కూడా ఒకరు.


గంగిశెట్టి జీవితం


గంగిశెట్టి లక్షీనారాయణ తనకల్లు గ్రామం, అనంతపురం జిల్లాలో 1947వ సంవత్సరంలో శ్రీమతి జింకా రుక్మిణమ్మ, జింకా గంగిశెట్టిలకుజన్మించారు. నేలనపడ్డ 10 నెలలకే కన్నతండ్రి గతిస్తే అంతా తానై కాపాడినవారు పితామహులు జింకా చెన్నరాయప్ప.

'విమర్శయనగా ఒక కావ్యాన్ని విషయీకరించుకొని రాయు మరొక కావ్యమ"ను రాళ్ళపల్లి గారి నిర్వచనాన్ని ఆదర్శంగా తీసుకుని 'సమగ్ర సాహిత్య అధ్యయన విధానా నికి మరో పేరే విమర్శ' అని గట్టిగా నమ్మే వారిలోగంగిశెట్టి లక్ష్మీ నారాయణ ఒకరు. అన్వయ విమర్శకంటే, సైద్దాంతిక విమర్శను బాగా అభిమా నిస్తారు. శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయ కళాశాలలో పట్టభద్రస్థాయిలో ఆంగ్ల సాహి త్యాన్ని ప్రత్యేక ఐచ్ఛికంగా అధ్యయనం చేసిన ఫలితంగా తెలుగులో విమర్శను శాస్త్రీయంగా రాసే అలవాటు చేసుకున్నారు.

ఆర్.ఎస్.సుదర్శనం పంథాలో రాయడానికి గట్టి ప్రయత్నం చేయడం వీరి వ్యాసాల్లో కనిపిస్తుంది. ఒక రచనలోని అంతఃరచన ఆవిష్కారమే విమర్శ అనే సూత్రాన్ని బలంగా విశ్వసించారు. ఆ దృక్కోణం నుంచే విశ్లేషణాత్మక వివేచన సాగించారు. కావ్యాత్మను, ప్రమాణీకరణను విమర్శకు రెండు ప్రాణ లక్షణాలుగా పాటిస్తారు.

సమీక్షకు విమర్శకు స్పష్టమైన తేడా ఉన్నదన్నారు. రెండింటి మర్యాదలు, తీరుతెన్నులు పేర్కొంటూ, దినపత్రికలు తెలుగులో సాహిత్య విమర్శకు చోటిచ్చినప్పటినుంచి సమీక్షే విమర్శగా భ్రమింపబడే స్థితి వచ్చిందన్నారు.అప్పటి నుంచి శాస్త్రీయ సాహిత్య అధ్యయనం తగ్గుముఖం పట్టిందంటూ తరచూ తమ రచనల్లో ప్రస్తావించారు.

1975లో భారతిలో ప్రచురితమైన వ్యాసాలలో ప్రాచీన సాహిత్యాలకు సంబంధించిన వివిధ రచించారు. భాషాశాస్త్రంలో లాగే వర్ణనాత్మక, చారిత్రం, తులనాత్మక విమర్శ మార్గాలను నిరూపించుకొని, నిర్దిష్ట మార్గంలో వివేచన చేయడం వల్ల, విమర్శ ఎక్కువ శాస్త్రీయ స్థాయిని పొందుతుందని వారు పేర్కొన్నారు.

ఆయాకాల నాలుగు దాక్షిణాత్య భాషల బోధన ఉన్న బెంగుళూరు క్రీస్తు కళాశాలలో తొలి ఉద్యోగ ప్రభావం వల్ల నేమో 71 నుంచే నాలుగు భాషల సామాన్య సాహిత్య ధర్మాలు, సంప్రదాయాల అధ్యయనం మీద మక్కువ పెంచుకొన్నారు. తెలుగు కన్నడ అనువాదాలు చేపడుతూ, తులనాత్మక సాహిత్య రంగంలో కృషి చేయసాగారు. వీరి అనువాద గ్రంధాలలో కన్నడం నుంచి 73లో బిళిగిరి గారి వర్ణనాత్మక వ్యాకరణ అనువాదం, 2004లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి పొందిన పర్వ అనువాదం (మూలం: ఆచార్య ఎస్.ఎల్.బైరప్ప) తెలుగు నుంచి కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కావ్యానందం కన్నడ అనువాదం ప్రముఖ మైనవి.

తెలుగు కన్నడ సాహిత్యాలతో మొదలైన అధ్య యనం, క్రమంగా వీరిని తులనాత్మక భారతీయ సాహిత్య అధ్యయనం వైపు నడిపించింది. తులనాత్మక సాహిత్యమంటే తులనాత్మక భారతీయ సాహిత్యమేనని, భాషా సారస్వతాల సమన్వయమే దాని స్వరూపమని అందులో ఏ భాషా సాహిత్యాన్ని సరిగ్గా ఆకళింపు చేసుకోవాలనుకొన్నా తులనాత్మక భారతీయ నేపథ్యం నుంచి అధ్యయనం చేసినప్పుడే సమగ్రత సిద్ధిస్తుందని, గట్టిగా విశ్వసిస్తూ, ఆ దృక్కోణం నుంచే తమ వ్యాసాలను రచించారు.

తెలుగు సాహిత్యం కేవలం అనువాదప్రాయంగా మొదలయిందనే వాదనను ఆయన తిరస్కరించారు.

భారతీయ సమగ్ర నేపథ్యంతో పాటు, చరిత్ర-సంస్కృతుల సమన్వయపరంగా గంగిశెట్టి విమర్శ సాగింది. ఒక విధంగా వారిది చారిత్రక సాంస్కృతిక విమర్శ మార్గం.పాల్కురికి సోమన, పోతన, పెద్దనల వంటి ప్రాచీన కవుల వివేచన అయినా, పురాణ, ఇతిహాసాల వంటి ప్రక్రియల పరిశీలన అయినా ఆధునిక కాలంలోని వివిధ రచయితల,ప్రక్రియల అనుశీలన అయినా, ఆయా కాలాల చారిత్రక -సాంస్కృతిక సందర్భాన్ని ప్రధాన పరిగణనలోకి తీసుకొన్నారు. ఆ నేపథ్యంలో ఆయా రచయితల, రచనల స్వభావ ధర్మాలను, అవి అందిస్తున్న సందేశాన్ని, నెరవేరుస్తున్న ప్రయోజనాన్ని వివరించడం ఆయన విమర్శ రచనల్లో అగుపిస్తుంది.

చరిత్ర-సంస్కృతుల్లో పరిశోధన, ప్రత్యేక శిక్షణ అందుకు వారికి సయి. రచనల్లోని వివిధ స్తలాలను గుర్తు పట్టి, ఆయా కాల ప్రభావాల నేపథ్యంలో వాటిని పరిశీలించి, ముఖ్యలక్షణాలను సూత్రీకరించి, సూత్ర నిష్పన్నం చేయడం సరైన శాస్త్రీయ విమర్శ పద్ధతి అని ఒకచోట వారుపేర్కొంటారు. ఆ మేరకు, సంరచనాత్మక (స్ట్రక్చరల్), విని ర్మాణాత్మక (డికన్ స్ట్రక్షన్) ధోరణుల ప్రభావాన్ని ఆయన విమర్శ రచనల్లో పరిమితంగానైనా గుర్తుపట్టవచ్చు.

నాటక రంగం మీద కూడా పరిమితంగానే రాసినా, వాటి మౌలికత నాటక విమర్శకుల దృష్టి నాకర్షించింది. కన్నడ నాటక కర్త, జ్ఞాన పీఠ పురస్కార విజేత కంబాల్ కళాతత్వం గురించి రాసిన వ్యాసంలో ఆధునిక భారతీయ నాటక రంగ వికాసాన్ని సమగ్రంగా వివేచించి, పాశ్చాత్యప్రభావంతో భారతీయ స్వభావం ఎలా సమసించిందో వివరించారు. అలాగే జానపదీయత, భారతీయ కళాధర్మాలనెలా బలంగా శాసిస్తున్నదో, దానిని ఆధునికతకు అను గుణంగా పునర్నవీకరించు కోవలసిన విధానమూ, దాని ఆవశ్యకం గురించి మరికొన్ని వ్యాసాల్లో ప్రస్తావించారు.

"వైరుధ్యాల మధ్య అనూహ్యంగా రూపొందే ఘటనా వైచిత్రి- నాటకం" అనీ, "కవి-గమక- వాగ్మిలు ప్రాచీన కాలంలో ప్రత్యేక కళావిదులనీ, ఆ మూడు విద్యలను సమన్వయించు కొనే కళావిదుడు నటుడన్నారు.అవన్నీఉన్నదే నాటకమన్నారు. నాటకం తరంగాలు తరంగాలుగా విస్తరించే జీవన కలశానికి ఒక నడిబిందువు. నాటకానికి వారిచ్చిన నిర్వచనాలు కొత్తదనంతో కూడుకొన్నవి.

విమర్శకు గంగితెల తెలుగుమాట లోనారిక. నన్నయ గారి ప్రయోగంలో లోనారసికి అర్థం విమర్శించి చూడడమనే అభిప్రాయంతో ఆ మాటను వాడారు.

ప్రాచీన సాహిత్యంలో వ్యక్తినామంతో మొదలుపెట్టి, ప్రతి ముఖ్యాంశం వాటి పేరుతోనే స్పష్టంగా అర్థమవుతుంది కనుక, ప్రాచీన సాహిత్యానుశీలనలో నిరుక్తం చాలా ముఖ్యపాత్ర వహిస్తుందన్నదని ఆయన అభిమతం.

మనుచరిత్రలో ప్రవరుడనే అరుదైన పేరుపెట్టడంలోనే పెద్దన తాను (4:48)  చెప్పదలచుకొన్న భావాన్ని ప్రతీకమానం చేశాడని ఆయన అభిప్రాయం. నరుడు ఎప్పుడు వరుడు( శ్రేష్ఠుడు) అవుతాడో, ఎప్పుడు ప్రవరుడు (అతి శ్రేష్టుడు) అవుతాడో వరూధినీ ప్రవరాఖ్యంలో చిత్రించాడనీ, ఒక వ్యాసంలో విశ్లేషించారు. ఇక్కడ కథాస్వరూపమంతా పేరులోనే నిక్షిప్తమైందన్నారు

Tags:    

Similar News