ఆ 'వృద్ధ కీచకుడు' ఆత్మహత్య చేసుకున్నాడు!
తునిలో బాలికపై అత్యాచారం కేసు నిందితుడు తాటిక నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు.
By : The Federal
Update: 2025-10-23 04:58 GMT
కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారం కేసు నిందితుడు తాటిక నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. కోమటిచెరువులో ఆయన మృతదేహాన్ని బయటికి తీశారు. పోలీసుల అదుపులో ఉండగానే ఈ ఘటన జరిగింది. తాటిక నారాయణరావును బుధవారం అర్ధరాత్రి కోర్టుకు తరలిస్తున్న సమయంలో బహిర్భూమికి వెళ్తానని చెప్పి పోలీసు జీపు దిగాడు. తుని పట్టణ శివారులోని కోమటిచెరువు పక్కన పోలీసులు వాహనాన్ని ఆపారు. ఆ తర్వాత చెరువు లోపలి వైపుకి వెళ్లి చెరువులో దూకినట్లు పోలీసులు తెలిపారు. తుని రూరల్ పోలీస్‌స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు పొద్దుపోయే వరకు గాలించారు. గురువారం ఉదయం మృతదేహం లభ్యమైంది.
తాటిక నారాయణ రావు తుని మండలంలో టీడీపీ సీనియర్ నాయకుడు. మైనర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించినట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. స్థానిక గురుకుల పాఠశాలలో 8వ తరగతి అమ్మాయిని హాస్టల్ నుంచి తాతవరుస అని చెప్పి బయటకు తీసుకువెళ్లి, హంసవరం సపోటా తోటల్లో ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు, తోట యజమాని వెంటనే స్పందించి బాలికను రక్షించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తుని రూరల్ జగన్నాధగిరి గురుకుల పాఠశాలలో చదువుతున్న ఆ మైనర్ ను తాటిక నారాయణ రావు హాస్టల్ నుంచి తీసుకువెళ్లాడు. ఆమె తాతనని చెప్పి బయటకు తీసుకువచ్చారు. కుటుంబ సమస్యలు చర్చించాలని పేర్కొన్నాడు. అనంతరం ఆమెను హంసవరం సపోటా తోటల్లోకి తీసుకువెళ్లి అసభ్యంగా తాకుతూ ప్రవర్తించాడు. ఈ సమయంలో స్థానికులు గమనించి ప్రశ్నించగా, నారాయణ రావు "ఆమెను మూత్ర విసర్జన కోసం తీసుకువచ్చాను" అని బుకాయించాడు. అంతటితో ఆగకుండా తాను టీడీపీ కౌన్సిలర్ అని చెప్పి, ప్రశ్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరింపులకు దిగాడు.
స్థానికులు వెంటనే స్పందించి బాలికను రక్షించి, ఘటనను వీడియోలో రికార్డ్ చేశారు. ఈ వీడియోలో నారాయణ రావు రెడ్ స్కూటర్‌పై ఉండటం, బాలిక ముఖాన్ని బ్లర్ చేసి షేర్ చేయడం వంటి వివరాలు కనిపిస్తున్నాయి. వీడియోలో "మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు?" అని ప్రశ్నించడం, పోలీసులను పిలవాలని చర్చలు జరగడం వంటివి ఉన్నాయి. ఈ ఘటనపై హాస్టల్ నుంచి బాలికను ఎలా తీసుకువెళ్లాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైరల్ గా మారిన వీడియో
ఈ ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఈ వీడియోను షేర్ చేస్తూ, నారాయణ రావును "వృద్ధ కీచకుడు" అని విమర్శించింది. టీడీపీ నాయకత్వం, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పాలనలో మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అనంతరం పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హజరుపరిచే సమయంలో నారాయణరావు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.