ఆస్ట్రేలియాకు ఆంధ్రా రొయ్యలు...
ఏపీ ఆక్వా రైతులకు కొత్త ఉత్సాహం వచ్చింది. నారా లోకేష్ వ్యూహాత్మక ప్రయత్నాలు ఫలించాయి.
భారతీయ రొయ్యల (ప్రాన్స్) ఎగుమతులపై ఆస్ట్రేలియా విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో ఏపీలోని ఆక్వా రైతులు, ముఖ్యంగా రొయ్యల సాగుదారులు భారీ ఊరట పొందుతున్నారు. అమెరికా విధించిన భారీ సుంకాల (60 శాతం వరకు) కారణంగా తీవ్ర నష్టాలు చవిచూస్తున్న ఆక్వా రంగానికి ఇది కొత్త మార్గాన్ని చూపింది. నిజానికి ఆస్ట్రేలియా కు ఆంధ్రా రొయ్యలు గతంలో కూడా ఎగమతి అయ్యేవి. అవి వైట్ స్పాట్, యెల్లో హెడ్ డిసీజెస్ వల్ల ఆస్ట్రేలియా ఈ దిగుమతులను అపేసింది.
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా ప్రభుత్వంతో జరిపన చర్చల అనంతరం ఆంధ్రా రొయ్యలను దిగుమతి చేసుకునేందుకు ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది.
ఆస్ట్రేలియా ఒప్పందం, ఎగుమతుల స్థాయి
ఆస్ట్రేలియా ప్రభుత్వం భారతీయ అన్‌పీల్డ్ ప్రాన్స్ (చర్మం తీయని రొయ్యలు) దిగుమతికి మొదటి అనుమతిని ఇచ్చింది. వైట్ స్పాట్ వైరస్ కొన్ని రొయ్యల్లో కనిపిచండంతో ఆస్ట్రేలియా 2017 లో నిషేధం విధించింది. ఇపుడు నిషేధం ఎత్తి వేసింది. ఇప్పుడు ఈ అడ్డంకి తొలగిపోవడంతో ఏపీ ఆక్వా ఉత్పత్తులు ఆస్ట్రేలియా మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశం ఏర్పడింది. 2024-25లో భారతదేశం మొత్తం సీ ఫుడ్ ఎగుమతులు 7.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.66,000 కోట్లు) విలువైనవి. ఇందులో ఏపీ వాటా 60 శాతం కంటే ఎక్కువ. ఏపీ సీ ఫుడ్ ఎగుమతులు సంవత్సరానికి రూ.21,246 కోట్ల విలువైనవి. ఇందులో రొయ్యలు 80 శాతం వాటా కలిగి ఉన్నాయి.
ఈ ఒప్పందం ఫలితంగా ఏపీలోని 2.5 లక్షల ఆక్వా రైతు కుటుంబాలు, 30 లక్షల మంది సంబంధిత ఉద్యోగులు లాభపడతారు. అమెరికా సుంకాల కారణంగా 50 శాతం ఆర్డర్లు రద్దు కావడం, రూ.600 కోట్ల నష్టాలు ఎదురవడం వంటి సమస్యలు తీరనున్నాయి. ఆస్ట్రేలియా మార్కెట్ తెరుచుకోవడం వల్ల స్థిరమైన ఆదాయం, కొత్త డిమాండ్ ఏర్పడుతుంది. లోకేష్ సీ ఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా (SIA) అధికారులతో చర్చలు జరిపి సస్టైనబుల్ ఆక్వాకల్చర్, క్వాలిటీ అప్‌గ్రేడ్, ట్రేడ్ మిషన్లు వంటి సహకారాలను ప్రోత్సహించారు.
బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ప్రతినిధులతో లోకేష్
ఇతర దేశాలతో ఒప్పందాలు, మార్కెట్ విస్తరణ
నారా లోకేష్ నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం ఆక్వా ఎగుమతులను ఒకే మార్కెట్ (అమెరికా)పై ఆధార పడకుండా విస్తరించేందుకు కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి రాసిన లేఖలో యూరోపియన్ యూనియన్ (EU), దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, రష్యాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ (FTAs) కుదుర్చుకోవాలని సూచించారు. ఇప్పటికే ఎగుమతిదారులు EUకు సీ ఫుడ్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో లోకేష్ ఈ విస్తరణ అవకాశాలను సృష్టించడంపై దృష్టి సారించారు. దీంతో రైతులు కొత్త మార్గాల్లోకి అడుగు పెట్టేందుకు మార్గం సుగమమవుతుంది.
ప్రస్తుతం నేరుగా ఒప్పందాలు కుదిరిన దేశం ఆస్ట్రేలియా మాత్రమే. కానీ ఇతర దేశాలతో చర్చలు పురోగతిలో ఉన్నాయి. దీనివల్ల ఏపీ ఆక్వా రంగం అంతర్జాతీయంగా మరింత బలోపేతం అవుతుంది. అదనంగా డొమెస్టిక్ మార్కెట్ విస్తరణ, రూ.100 కోట్ల కార్పస్ ఫండ్, కోల్డ్ స్టోరేజీలు, హైజీనిక్ మార్కెట్లు వంటి చర్యలు రైతులకు మరింత భరోసా కల్పిస్తాయి.
ఆర్థిక, సామాజిక ప్రభావాలు
ఈ అభివృద్ధి ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోస్తుంది. అమెరికా సుంకాలు (25 శాతం అదనపు + 5.76 శాతం కౌంటర్ వెయిలింగ్ + 3.96 శాతం యాంటీ-డంపింగ్) వల్ల ఎగుమతులు తగ్గిపోయాయి. కానీ ఆస్ట్రేలియా వంటి కొత్త మార్కెట్లు ఈ నష్టాన్ని పూడ్చుతాయి. లోకేష్ వ్యూహాత్మక సమన్వయం, సీ ఫుడ్ బ్రాండింగ్, క్వాలిటీ స్టాండర్డ్స్ అప్‌గ్రేడ్ దీర్ఘకాలిక లాభాలను తెస్తుంది. అయితే వైట్ స్పాట్ వైరస్ వంటి సవాళ్లను అధిగమించడానికి రైతులకు శిక్షణ, సస్టైనబుల్ పద్ధతులు అవసరం.
యూఎస్ టారిఫ్ ల నష్టాన్ని భర్తీ చేస్తుంది: ఎస్ఈఏఐ
ఆస్ట్రేలియా మార్కెట్ తెరవడం యూఎస్ టారిఫ్‌ల నష్టాలను భర్తీ చేస్తుందని, ఎక్స్‌పోర్టర్లు ప్యానిక్‌లో లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీలు ప్రకటించాలని సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEAI) - ఆంధ్రప్రదేశ్ యూనిట్ ప్రెసిడెంట్ కె ఆనంద్ కుమార్ అభ్యర్థించారు. ఈ అవకాశం ఆక్వా రంగాన్ని పునరుజ్జీవనం చేస్తుందని స్వాగతించారు.
సస్టైనబుల్ షిప్మెంట్స్ దారి: SEAI పవన్ కుమార్
ఆస్ట్రేలియా ఎగుమతులకు కంప్లయన్స్ ప్రోటోకాల్స్ (వైట్ స్పాట్, యెల్లో హెడ్ డిసీజెస్ టెస్టింగ్), హెల్త్ సర్టిఫికేషన్స్, ఇన్‌స్పెక్షన్‌లపై స్పష్టత అవసరమని ఎస్‌ఈఏఐ అధ్యక్షులు జి. పవన్ కుమార్ పేర్కొన్నారు. ఇది రెండేళ్ల పాటు సస్టైనబుల్ షిప్‌మెంట్‌లకు దారి తీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్రం సబ్సిడీలు అందించాలి: ఎస్‌ఈఏఐ సెక్రటరీ జనరల్
యూఎస్ ఎక్స్‌పోర్టులు 80 శాతం తగ్గాయని, ఆస్ట్రేలియా మార్కెట్ వైవిధ్యీకరణకు సహాయపడుతుందని ఎస్‌ఈఏఐ సెక్రటరీ జనరల్ కె.ఎన్. రాఘవన్ పేర్కొన్నారు. క్రెడిట్ లిమిట్లు పెంచి, సబ్సిడీలు అందించాలని కేంద్రాన్ని కోరారు.
FTAలపై చర్చలు వేగవంతం చేయాలి: ఏపీ ప్రాన్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
ఆస్ట్రేలియా అనుమతి యూఎస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) డిమాండ్‌లకు ప్రేరణ అవుతుందని ఏపీ ప్రాన్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సుబ్బరాజు అన్నారు. ఇది రైతులకు మార్కెట్ ఆప్షన్లను పెంచుతుందని స్వాగతించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు FTAలపై చర్చలు వేగవంతం చేయాలని సూచించారు.
మొత్తంగా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన ఏపీని పెట్టుబడుల గేట్ వే గా మార్చడమే కాకుండా, ఆక్వా రైతులకు అంతర్జాతీయ అవకాశాలను అందించింది. ఇతర దేశాలతో FTAs కుదిరితే, ఎగుమతులు మరింత పెరిగి రాష్ట్ర ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుంది.