కరెంటు మీటర్లతో పేదల సంక్షేమానికి షాక్..!

ఆధార్ నంబర్ విద్యుత్ మీటర్లకు అనుసంధాన ప్రక్రియ నగదు బదిలీ పథకాలకు పిడుగులా మారేలా ఉంది. పేదలకు అన్యాయం జరగకుండా చూడాలని బీజేపీ నేత అభిప్రాయపడ్డారు.;

Update: 2025-05-05 12:10 GMT

ఇళ్లలో కరెంటు వాడకం ౩౦౦ యూనిట్లు దాటితే సంక్షేమ పథకాలకు కోత పడే ప్రమాదం ఏర్పడింది. తల్లికినందనం (అమ్మ ఒడి), సామాజిక పింఛన్ లబ్ధిదారులపై పిడుగు పడుతుంది. విద్యుత్ మీటర్లకు ఆధార్ నంబర్ అనుసంధానం చేసే పక్రియ వల్ల ఈ ప్రమాదం ముంచుకు వచ్చింది. మీటర్ కు అనుసంధానం చేయడం నెలాఖరులోపు పూర్తి చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Full View

సూపర్ 6 మేనిఫెస్టోలో తల్లికివందనం పథకంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై భారం పెరిగింది. ఈ పథకంలో 81 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. అనేక కోణాల్లో వడబోసి, ఆ సంఖ్యను 69.16 లక్షల మందికి కుదించారు. ఆదాయం, విద్యుత్ వాడకం, ఆర్థిక స్థితిని మదింపు చేసిన తరువాత దాదాపు పది లక్షల మందిని అనర్హులుగా గుర్తించారు. ఈ వివరాలు విద్యాశాఖ అధికారులు వెల్లడించినవే.

నెలకు ఆరు వేలు పింఛన్ తీసుకుంటున్న 7.79 లక్షల మంది వికలాంగులను ఎంపిక చేసిన ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. దీంట్లో రెండు లక్షల మందిని పరిశీలిస్తే, 40 వేల మంది అనర్హులుగా తేలారు. అందులో చిత్తూరు, కృఫ్షా, విజయనగరం జిల్లాల్లో జిల్లాకు మూడు వేల మంది తేలారు. మిగిలిన వారిని కూడా వైకల్య నిర్ధారణ వైద్య పరీక్షలకు ముందుకు రావడం లేదు. వారికి విద్యుత్ మీటర్ల వల్ల షాక్ తగిలే ప్రమాదం ఉంది.

" కరెంటు వాడకంపై సంక్షేమ పథకాలకు లింకు పెట్టడం సరైంది కాదు" అని బీజేపీ ఓబీసీ విభాగం (BJP OBC Cell) రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జల్లి మధుసూదన్ అభ్యంతరం చెప్పారు.

ఇళ్లతో పాటు వ్యవసాయ కనెక్షన్లకు దరఖాస్తుల పరిశీలన తరువాతే మంజూరు చేస్తారు. ఆ కనెక్షన్ల ఆధారంగానే సబ్ స్టేషన్లలో సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్లను ఏర్పాటు చేస్తారు. ఆ వివరాలు ట్రాన్స్ కో ఏఈ (TRANCO- AE) కార్యాలయంలో అందుబాటులో ఉంటాయనేది జగమెరిగిన సత్యం. కానీ,

"రైతులు ఎన్ని వ్యవసాయ మీటర్లు వాడుతున్నారు. ఎవరి పేరుతో ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి? ఈ గణాంకాలు సేకరించడానికే ఆధార్ సీడింగ్ చేస్తున్నాం" అని డిస్కం తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (Discom Exvutive Engineer -EE) చంద్రశేఖర్ చెబుతున్నారు.

సమస్య ఏమిటంటే

రాష్ట్రంలో ఉచిత పథకాలు ప్రధానంగా నగదు బదిలీ వంటి సంక్షేమ పథకాలకు కొన్ని నిబంధనలు విధించింది.

2020లో అమ్మఒడి (తల్లికి వందనం) పథకంలో విద్యార్థులకు ఏడాదికి రూ.15 వేలు ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో లబ్ధికి 11 నిబంధనలు పెట్టారు. కుటుంబ ఆదాయ పరిమితి, ఐదెకరాలు లోపు భూమి, మున్సిపాలిటీల్లో 750 చదరపు అడుగుల లోపు స్థిరాస్థి ఉండాలని షరతు విధించారు. సొంత టాక్సీ ఫరవాలేదు. సొంతిల్లు, దానికి 200 యూనిట్ల లోపు మాత్రమే విద్యుత్ వాడకం ఉండాలి అని చెప్పినా, కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆ పరిమితి 300 యూనిట్లకు పెంచారు.

అమలుకు ముందే కోత..

నగదు బదిలీ పథకాల్లో ప్రధానంగా తల్లికి వందనం, సామాజిక పింఛన్లు, సూపర్ -6 హామీలు ప్రకటించిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ పథకాల్లో ఎలాంటి కోత విధించకుండా నగదు చెల్లించడానికి సిద్ధమైంది. తల్లికి వందనం పథకం కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 9,407 కోట్లు కేటాయించారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తింప చేయాలనే నిర్ణయంతో 2024 -25 విద్యా సంవత్సరంలో 81 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే, వారిలో 69.16 లక్షల మందినే అర్హులుగా విద్యా శాఖాధికారులు గుర్తించారు. అంటే దాదాపు పది లక్షల మంది విద్యార్థులకు కోత పడినట్టే కనిపిస్తోంది.

జనంపై దెబ్బ మీద దెబ్బ

2014 నుంచి 2019 వరకు వాడిన కరెంటుకు చార్జీలకు అదనంగా సామాన్యుడి నుంచి సంపన్నులు ట్రూ అప్ చార్జీ కింద రూ. 3,690 కోట్ల రూపాయల భారం భరించారు.

2020 నాటికి మళ్లీ సర్దుబాటు చార్జీల కింద 2,800 కోట్లతో కలిపి మొత్తంగా 6,400 కోట్ల భారం మోపారు. 2021 -22లో యూనిట్ కు రూ.2 వంతున తొమ్మిది వేల కోట్లు వసూలు చేశారు. వైసీపీ పాలనలో ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలు వసూలు చేశారని ప్రతిపక్షంలో టీడీపీ గగ్గోలు పెట్టింది. ఈ పార్టీ కూటమి అధికారంలోకి రాగానే ఇంధన చార్జీల సర్దుబాటు పేరిట 9,412 కోట్లు వసూలు చేయడానికి 200 యూనిట్లు విద్యుత్ వాడే వారిలో ఒక్కొక్కరిపై ర.184 అదనంగా చార్జీ విధించింది.

ఇదే ఇప్పుడు సమస్య?

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే తల్లికివందనం అమలు కాలేదు. విద్యుత్ మీటర్లకు ఆధార్ అనుసంధానం వల్ల పరిమితికి మించి విద్యుత్ వినియోగించే కుటుంబంలోని విద్యార్థులకు ఈ పథకం వర్తించే అవకాశం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. సామాజిక పింఛన్ లబ్ధిదారులపై కూడా పడే అవకాశం ఉన్నట్లు విద్యుత్ అధికారుల మాటలు స్పష్టం చేస్తున్నాయి. అంటే మొత్తంగా నగదు బదిలీ వంటి సంక్షేమ పథకాల లబ్ధిపై నీలినీడలు వ్యాపించినట్టే.

"ఆధార్ కు విద్యుత్ మీటర్లు అనుసంధానం చేసే ప్రక్రియ పాతదే. మిగిలిన కనెక్షన్లు కూడా అనుసంధానం చేయాలని సిబ్బందిని ఆదేశించాం" అని ట్రాన్స్ కో ఈఈ చంద్రశేఖర్ ధృవీకరించారు.

"నా పరిధిలో తిరుపతి, రూరల్ మండలం, కరకంబాడి ప్రాంతం, రేణిగుంట మండలాల్లో ఇళ్లు, పరిశ్రమలు, వ్యవసాయ మోటార్లకు ఉన్న 1.90 లక్షల విద్యుత్ మీటర్లకు అనుసంధానం చేయలేదు. వాటిని పూర్తి చేయమని సిబ్బందిని ఆదేశించాం" అని చంద్రశేఖర్ వివరించారు.

మీటర్ నంబర్ తోనే కోత...?

"ఆధార్ నంబర్ కు మీటర్ అనుసంధానం చేయడం వల్ల సంక్షేమ పథకాలకు షాక్ తప్పకపోవచ్చు" అని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీసులోని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. ఆయన ఏమన్నారంటే..

"ఆధార్ కు లింక్ చేయడం వల్ల మీటర్ నంబర్ కూడా ఏ శాఖ అయినా సులువుగా తెలుసుకుంటుంది. దీనివల్ల ఆ ఇంటి యజమాని ఎంతమేరకు విద్యుత్ వాడుకున్నారు? దాని ద్వారా వారి ఆర్థిక స్థోమత ఏమిటి? అనేది తేలిపోతుంది" అని ఆయన విశ్లేషించారు. దీని ద్వారా సంక్షేమ పథకాలపై ఆ ప్రభావం ఉంటుందనడంలో సందేహం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

నేను చాయించా

"మా ఇంటి మీటరును ఆధార్ తో అనుసంధానం చేయించా" కడప జిల్లా ఎర్రగుంట్ల సమీపంలోని చిలంకూరు ప్రాంతానికి చెందిన అలిదెన వెంకటేష్ చెప్పారు. "మీటర్ కనెక్షన్ నా భార్య పేరుపై ఉంది" అని తిరుపతి నగరం అన్నారావు సర్కిల్ ప్రాంతంలో దుస్తులు ఇస్త్రీ చేసే వెంకటేష్ చెప్పారు.

"మా ఇంటికి 250 యూనిట్ల లోపే కరెంటు కాలుతుంది. దీనివల్ల నా వృద్ధాప్య పింఛన్ కు ప్రమాదం లేదు కదా? సార్ అని ప్రశ్నించారు. 300 యూనిట్లు దాటితే పింఛన్ పోతుందేమో అని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మేము, మా పిల్లలు ఆ ఇంటిలో ఉండేది తక్కువ. కాబట్టి ఇబ్బంది లేదులే" అని తనకు తాను ధైర్యం చెప్పుకున్నారు.

నగదు బదిలీ పథకాలతో ఓటు బ్యాంకు రాజకీయాలు సాగించడంలో ఏ పార్టీ కూడా తీసిపోవడం లేదనే విషయం 2004 నుంచి పరిశీలిస్తే అర్థం అవుతుంది. ఉచిత విద్యుత్ పథకం, పింఛన్ల పెంపుదలతో ఈ పథకాలు జోరందుకున్నాయి. దివంగత సీఎం వైఎస్ఆర్, తరువాత సీఎం ఎన్. చంద్రబాబు, ఆ తరువాత మాజీ సీఎం వైఎస్. జగన్ పోటీలు పడ్డారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం ఎన్. చంద్రబాబు ధారాళంగా సూపర్ -6 పథకాలు ప్రకటించారు.

"ఈ పథకాలు తలుచుకుంటే భయం వేస్తోంది" అని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చమత్కార వ్యాఖ్యతో విమర్శలకు ఆస్కారం కల్పించారు.

ఎందుకంటే..

2024 డిసెంబర్ 31న రాష్ట్రంలో 63,77, 943 మంది కోసం 2,717 కోట్ల రూపాయలు విడుదల చేసింది. త్వరలో 50 వేల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయడానికి పరిశీలన ప్రక్రియ జరగుతోంది. ఇది పూర్తయితే బడ్జెట్ పెరుగుతుంది. దీనికోసం అర్హులను నిర్ధారించడానికి నిర్వహించిన తనిఖీల్లో బోగస్ పింఛన్ల మూడు నెలల కిందటే గుర్తించారు. తాజాగా విద్యుత్ వాడకం కూడా పిడుగులా మారే ప్రమాదం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

పేదలకు అన్యాయం

ఈ వ్యవహారంపై బీజేపీ ఓబీసీ సెల్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జల్లి మధుసూదన్ స్పందించారు.


"రేషన్ కార్డులకు ఆధార్ నంబర్ అనుసంధానం చేశారు. దేశ భద్రత దృఫ్ట్యా ఈ ప్రక్రియ స్వాగతించాలి. అన్ని పథకాలకు అను సంధానం చేయడం మంచిదే" అని జల్లి మధుసూదన్ అభిప్రాయపడ్డారు. పేదలు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి అన్యాయం చేయడం మాత్రం సహించరానిది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు అర్హులకు న్యాయం చేయాలన్నారు.

మొత్తం మీద ఆధార్ నంబర్ తో విద్యుత్ మీటర్లను అనుసంధానం ప్రక్రియ పూర్తయ్యాక ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది వేచిచూడాలి.

Similar News