ప్రకృతి చెక్కిన ఆధ్యాత్మిక ద్వారం
తిరుమల శిలా తోరణం ఎంతో మంది భక్తులను ఆకర్షిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ గడ్డపై ఉన్న తిరుమల క్షేత్రం ఎప్పుడూ భక్తులకు ఆధ్యాత్మిక ఆశ్రయం. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ విస్తరించిన ఆధ్యాత్మిక ప్రదేశాలలో శిలా తోరణం ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. ఇది కేవలం రాతి ద్వారం మాత్రమే కాదు, ప్రకృతి, పురాణాలు కలిసి సృష్టించిన అద్భుత కథ. భూగర్భ శాస్త్రజ్ఞులకు ఇది 2.5 బిలియన్ సంవత్సరాల పురాతన రహస్యం, భక్తులకు స్వామి పాదస్పర్శ జ్ఞాపకం. ఈ అద్భుతమైన ప్రదేశం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
శిలా తోరణం 'రాతి ద్వారం' అని అర్థం వచ్చే ఈ నిర్మాణం తిరుమల ఆలయం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. రెండు బ్రహ్మాండమైన రాళ్ల మధ్య 2.5 మీటర్ల ఎత్తు, 8 మీటర్ల వెడల్పుతో ఏర్పడిన సహజ ఆర్చ్. గాలి కోత, నీటి ప్రవాహాల వల్ల వేల సంవత్సరాల క్రితం సిద్ధమైనదని భూగర్భ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అరుదైన సహజ ఆర్చ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందిన ఇది అంతర్జాతీయ భూగర్భ అధ్యయనాలకు ముఖ్యమైన స్థలం.
శిలా తోరణ ప్రాంతం
పురాణాల ప్రకారం శ్రీ వేంకటేశ్వర స్వామి భూమిపై అవతరించినప్పుడు తన మొదటి అడుగు ఈ శిలా తోరణం గుండా వేశారని నమ్మకం. "ఇది పవిత్ర ద్వారం. స్వామి పాదస్పర్శ అనుభూతి చెందడానికి భక్తులు ఇక్కడికి వస్తారు," అని భక్తుడు తిర్లుక దినేష్ ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు. ఈ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత వల్లే ఇది తిరుమల సందర్శకులు తప్పక చూడాల్సిన ప్రదేశం.
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆధ్వర్యంలో ఈ ప్రాంతం పార్కుగా అభివృద్ధి చెందింది. నడక మార్గాలు, కూర్చునే స్థలాలు, ప్రార్థనా ప్రదేశాలు, పూజా సామగ్రి దుకాణాలు ఏర్పాటు చేశారు. అటవీ కోళ్లు, కుందేళ్లు, పావురాలు వంటి జంతువుల బొమ్మలు, జలచరాల శిల్పాలు పిల్లలను ఆకట్టుకుంటాయి. "ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మికత కలిసిన ఈ పార్కు, సందర్శకుల అనుభవాన్ని మరపురానిదిగా చేస్తుంది," అని టిటిడి అధికారి శ్రీనివాస్.పి తెలిపారు.
ఇక్కడి విశిష్టతలలో మరొకటి రాళ్ల ధ్వని లక్షణాలు. రాళ్లపై కొట్టినప్పుడు వివిధ ధ్వనులు వచ్చే ఈ అనుభవం, భూగర్భ శాస్త్రంలో ధ్వని విశ్లేషణకు ఉదాహరణ. రాళ్ల సాంద్రత, ఆకృతిలో తేడాల వల్ల ఇలాంటి మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రహస్యమైన అంశం శిలా తోరణాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.
శిలా తోరణ ముఖ ద్వారం
శిలా తోరణం కేవలం ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు.. ప్రకృతి, చరిత్ర సమ్మిళితం. భక్తులు, భూగర్భ శాస్త్రజ్ఞులు, పర్యాటకులు అందరూ ఇక్కడ శాంతి, జ్ఞానం పొందుతారు. "ప్రకృతితో స్నేహం చేయడం" అనేది ఈ ప్రాంతం చెప్పే కథ. తిరుమల సందర్శనలో శిలా తోరణాన్ని చూడకుండా వెళ్తే, అది అసంపూర్ణమే.
తిరుమలలోని శిలా తోరణం సమీపంలో ఉన్న చక్ర తీర్థం ఒక పవిత్రమైన తీర్థం, ఇది ఆధ్యాత్మిక, పురాణ ప్రాముఖ్యత కలిగినది. ఇది శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సుమారు 2 కి.మీ. దూరంలో ఉంది. సహజసిద్ధమైన రాతి ఆర్చ్ (శిలా తోరణం) పక్కనే ఉంది. భక్తులు ఇక్కడ స్నానం చేసి పాపాలు తొలగిస్తారని నమ్ముతారు. ఇది తిరుమల సందర్శనలో ముఖ్యమైన ఆకర్షణలలో ఒకటి.
చరిత్ర, పురాణ కథ
పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ స్థలంలో తపస్సు చేయాలనుకున్నాడు. అయితే ఆ స్థలాన్ని శుద్ధి చేయడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం పడిన చోట ఏర్పడిన నీటి ఊటే చక్ర తీర్థంగా పిలువబడుతుంది. ఈ తీర్థంలో స్వయంభు శివలింగం (సహజసిద్ధమైన శివలింగం) ఉంది. దీనిని భక్తులు పూజిస్తారు. ఈ కథ విష్ణు-శివుల మధ్య ఐక్యతను సూచిస్తుంది. తిరుమల క్షేత్రంలో శైవ, వైష్ణవ సమన్వయానికి ఉదాహరణ.
ప్రాముఖ్యత
చక్ర తీర్థం స్నానం చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయని, మానసిక శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇది ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా చర్మ వ్యాధులు తగ్గించడానికి సహాయపడుతుందని కూడా చెబుతారు. తిరుమలకు వచ్చే భక్తులు శిలా తోరణం సందర్శించిన తర్వాత ఈ తీర్థాన్ని తప్పకుండా చూస్తారు.
ఈ తీర్థం ఒక చిన్న జలపాతం రూపంలో ఉంటుంది. చుట్టూ గ్రీన్ వాతావరణం ఉంది. ఇది పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి చిన్న నడక మార్గం ఉంది. మోకాళ్ల సమస్యలు ఉన్నవారికి కొంచెం కష్టంగా ఉండవచ్చు, కానీ అనుభవం మరపురానిది.
పార్క్ గా అభివృద్ది చేసిన ప్రాంతం
శిలా తోరణం వంటి సహజ నిర్మాణాలతో సంబంధం కలిగి ఉండటం వల్ల, ఇది భూగర్భ శాస్త్ర అధ్యయనాలకు కూడా ముఖ్యమైనది. పురాతన కాలం నుంచి ఈ ప్రదేశం పవిత్రంగా పరిగణించబడుతుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఈ ప్రదేశాన్ని సంరక్షిస్తూ, భక్తుల సౌకర్యాలు కల్పిస్తుంది. ఇది ఆధ్యాత్మిక శాంతి, ప్రకృతి సౌందర్యం కలిసిన అద్భుతమైన స్థలం.
పైనుంచి కిందికి చూస్తే, రద్దీగా కదిలే జనసమూహం ఒక జీవన చిత్రంలా కనిపిస్తుంది. పై భాగం నుంచి చూసే వారికి ఒక అనుభూతి, కింద నుంచి పైకి చూసే వారికి ఒక అనుభూతిని ఇస్తుంది. చక్రతీర్థంలో నీరు ఉన్నా స్నానాలు చేసేందుకు అవకాశం లేకుండా ఉంది. కిందకు దిగి పైకి రావడానికి సరైన నడక దారి లేకపోవడంతో పై నుంచి నీటి వైపు తిరిగి భక్తులు నమస్కరించి చక్రస్థానం చేసినట్లుగా భావిస్తున్నారు. అయితే ఆ నీటిని పైపుల ద్వారా ఒక ప్రాంతానికి మళ్లించి అక్కడ భక్తులు స్నానం చేసేలా టీటీడీ చర్యలు తీసుకునే ప్రయత్నాల్లో ఉంది.