మిర్చి రైతుకు కాస్తంత ఊరట.. కేంద్రం హామీ

కర్రవిరక్కుండా పాము చావకుండా కేంద్రం ఏపీ మిర్చి రైతు సమస్యకు పరిష్కారం సూచించింది. మార్కెట్ ధరకు-సాగు ఖర్చుకు మధ్య ఉన్న తేడాను భరాయిస్తామని చెప్పింది.;

Update: 2025-02-22 13:11 GMT
కర్రవిరక్కుండా పాము చావకుండా కేంద్రం ఏపీ మిర్చి రైతు సమస్యకు పరిష్కారం సూచించింది. మార్కెట్ ధరకు-సాగు ఖర్చుకు మధ్య ఉన్న తేడాను భరాయిస్తామని చెప్పింది. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
ఢిల్లీలో ఏం చర్చించారంటే...
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్, ఆ శాఖ కార్యదర్శి దేవేష్‌ చతుర్వేది ఫిబ్రవరి 22న ఢిల్లీలోని కృషిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ తరఫున పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, అమరావతి నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇందులో ప్రధానంగా మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీం కింద కొనుగోలు చేసి మార్కెట్‌ ధర- సాగు ఖర్చుకు మధ్య ఉన్న తేడాను కేంద్రం చెల్లించడం, ఎంఐఎస్‌ కింద సేకరించే సరకు గరిష్ఠ పరిమితిని 25% నుంచి 75% వరకు పెంచడం, మిర్చి సాగు వ్యయాన్ని ఐకార్‌ నిర్ణయించిన ధర ప్రకారం కాకుండా ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన రూ.11,600ని పరిగణనలోకి తీసుకోవడం, ఎగుమతులకు ఉన్న అడ్డంకులను తొలగించడంపైనే చర్చించారు.
ఈ డిమాండ్లలో తొలి మూడింటికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఎగుమతుల విషయంపై మాత్రం రాష్ట్రంలో ప్రత్యేక సదస్సు నిర్వహించి క్షేత్రస్థాయిలోని రైతులు, ఎగుమతిదారులు, ఇతర భాగస్వామ్యపక్షాల సలహాలు, సూచనలు తీసుకొని వాటిని అమల్లోకి తెస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.
ఏపీ ఏమని కోరిందంటే...
మిర్చి కొనుగోళ్లు త్వరగా ప్రారంభిస్తామని కేంద్రమంత్రి చౌహాన్ చెప్పారు. "పంట ఉత్పత్తి వ్యయానికి, కొనుగోలు ధరకు మధ్య అంతరాన్ని వీలైనంత త్వరగా చెల్లిస్తాం. ఎంఐఎస్‌ కింద 25% వరకు ఉన్న గరిష్ఠ పరిమితిని 75% వరకు పెంచుతాం. మిర్చిసాగుకు క్వింటాకు రూ.10వేల పైచిలుకు ఖర్చవుతుందని కేంద్రం నిర్ణయిస్తే... మేం రూ.11,600 అవుతుందని చెప్పి, ఆ మేరకు పెంచేలా చూస్తాం" అని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు కె.రామ్మోహన్ నాయుడు చెప్పారు. సాగు వ్యయాన్ని పెంచాలని ఐకార్‌ అధికారులకు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ గట్టిగా చెప్పారు. ఇది చాలా సానుకూల పరిణామం.
ఇప్పుడు ఐకార్‌ దానిపై దృష్టిసారించింది. ఈ నిర్ణయంతో గుంటూరు, పల్నాడు, రాయలసీమల్లో ఉన్న మిర్చి రైతులకు ప్రయోజనం కలుగుతుంది అని రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు.
అయితే వాస్తవ సాగు వ్యయానికి ఐకార్ నిర్ణయించే సాగు వ్యయానికి చాలా తేడా ఉంటుంది. ఎకరా మిర్చికి సుమారు 3 లక్షల ఖర్చవుతుందని ఏపీ రైతులు చెబుతున్నారు. ఇందులో ఐకార్ ఎంత నిర్ణయిస్తుందో వేచి చూడాలి.
చంద్రబాబు మీటింగ్...
ఏపీలో మిర్చి రైతుల సమస్యలపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra babu) సమావేశం నిర్వహించారు. మిర్చి ధరలపై రైతులు, ఎగుమతిదారులతో సీఎం చర్చించారు. చైనా, థాయిలాండ్‌, మలేసియా తదితర దేశాలకు మిర్చి ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మిర్చి పంటకు సరైన ధర దక్కేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని సీఎం ఆదేశించారు. గుంటూరు మార్కెట్‌ యార్డ్‌లో మిర్చి నిల్వలకు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకున్నారు.
సరిగ్గా ఈ నేపథ్యంలోనే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ స్పందించారు. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీం కింద కొనుగోలు చేసి మార్కెట్‌ ధర- సాగు ఖర్చుకు మధ్య ఉన్న తేడాను కేంద్రం చెల్లించడం, ఎంఐఎస్‌ కింద సేకరించే సరకు గరిష్ఠ పరిమితిని 25% నుంచి 75% వరకు పెంచడం, మిర్చి సాగు వ్యయాన్ని ఐకార్‌ నిర్ణయించిన ధర ప్రకారం కాకుండా ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన రూ.11,600ని పరిగణనలోకి తీసుకోవడం, ఎగుమతులకు ఉన్న అడ్డంకులను తొలగించడంపైనే చర్చించారు. ఇందులో తొలి మూడు డిమాండ్లకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి సానుకూలంగా ఉంది.
Tags:    

Similar News