అమ్మా... ఎక్కడికి వెళ్లావ్..!?

అప్పుల బాధ తాళలేక తండ్రి వెళ్లిపోయాడు. ఈ వేదనతో తల్లి గుండెపోటుతో ఈ లోకాన్ని వీడింది. పాలు తాగే ఓ పసికూన, పాలబుగ్గల పసికందులు దిక్కులేని వారయ్యారు.

Update: 2024-05-31 10:17 GMT

నాన్న అనే ఆప్యాయత దక్కలేదు. అమ్మ అనే అనుబంధం ఒక్కసారిగా దూరమైంది. అనంతపురం జిల్లా ఐదుకల్లులో ముగ్గురు పాలబుగ్గల చిన్నారులు అనాథలయ్యారు. అమ్మా మాకోసం రా..! అని సోకిస్తున్న ఆ పసిపిల్లల హృదయ ఘోషను తెలుసుకున్న ఐసిడిఎస్ అధికారులు అనాథలుగా మిగిలిన పిల్లలకు సంరక్షకులుగా మారారు. ఐదుకల్లు గ్రామంలో అభ్యుదయం, సేవాభావం ఇంకా సజీవంగానే ఉందని చాటిచెప్పే రీతిలో.. ఓ యువకుడు స్పందించాడు. పిల్లల పరిస్థితి తెలుసుకున్న ఆ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, ఒక్కరోజులో రూ.5.50 లక్షల వరకు పోగేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామంలో గొల్ల చంద్రకళ (36)కు ప్రభావి (11), అనుశ్రీ (6) తో పాటు ఆరు నెలల బాబు ఉన్నాడు. కూలీ పనుల ఆధారంగా జీవించే ఈ కుటుంబం కష్టాల కడలిని కూడా ఈదుతోంది. వ్యక్తిగత అవసరాలో, కుటుంబం కోసమో తెలియదు కానీ చంద్రకళ భర్త తిమ్మరాజు గ్రామంలో అప్పులు చేశాడని తెలిసింది. ఆ ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లిపోయాడని గ్రామస్తుల నుంచి అందిన సమాచారం. ఆరు నెలల క్రితం ఒకసారి కొడుకును చూడటానికి వచ్చి వెళ్ళాడని, ఆ తర్వాత తిమ్మరాజు ఎక్కడున్నాడో కూడా తెలియదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేశారో? లేక మరేమైనా ఇతర సమస్యలతోనో తీవ్ర ఆందోళనకు గురైన చంద్రకళ ఈ నెల 28వ తేదీ రాత్రి గుండెపోటుతో మరణించారు. పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న ఆరేళ్ల బాలుడు, అమ్మ మాట్లాడకపోవడంతో రోధిస్తున్న ఆరేళ్ల అనుశ్రీ, ఊహ తెలిసిన ప్రభావి (11) ఏమి చేయాలో తెలియక రోదిస్తూ ఉండడం ఆ గ్రామాన్ని కలచివేసింది. ఆ పిల్లల గుండె మంటలు ఆర్పడం, సముదాయించడం అయినవాళ్లకు సాధ్యం కాలేదు. ఊరి జనంలో కన్నీరు పెట్టని వారు లేరు. ఆ కుటుంబ రక్త సంబంధీకులు చంద్రకళ అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి..




 

మీడియాతో వెలుగులోకి..

కమ్యూనిస్టు ఉద్యమ నాయకులకు పురిటిగడ్డ అయినా ఐదుకల్లు గ్రామంలో చోటుచేసుకున్న విషాద ఘటనపై బుధవారం మీడియా వార్తలు ప్రచురించింది. వెంటనే ఐసీడీఎస్ అనంతపురం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీదేవి రంగంలోకి దిగారు. ఈ సంఘటనపై శ్రీదేవి ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడారు. "ఐదుకల్లు గ్రామంలో జరిగిన విషాదాంతం పత్రికల్లో చూశాను. వెంటనే, కంబదూరు సిడిపిఓ వనజను అప్రమత్తం చేయడంతో పాటు అందరం కలిసి వెళ్ళాం. పత్రికల్లో చాలా తక్కువ రాశారు. చాలా దయనీయ పరిస్థితి అక్కడ మమల్ని కలిచి వేసింది’’ అని శ్రీదేవి ఆవేదన చెందారు. ‘‘ఆ పిల్లల మేనత్త, ఇంకొంతమంది బంధువులతో మాట్లాడాం. వారు కూడా కూలీ పనుల ఆధారంగా జీవించే వారే’’ అని శ్రీదేవి వివరించారు.

"ఇద్దరు ఆడపిల్లల్లో ప్రభావిని కస్తూర్బా గురుకుల పాఠశాలలో చేర్పించి సంరక్షణ బాధ్యతలు పర్యవేక్షిస్తాం. అనుశ్రీ (6)ని ఐసిడిఎస్ సంరక్షణలో ఉంచుకుని ఒకటవ తరగతిలో చేర్పించి చదువు చెప్పించే బాధ్యత తీసుకుంటామని శ్రీదేవి వివరించారు. పాలు కూడా మరవని 6 నెలల బాలుని సంరక్షణ బాధ్యత వారి మేనత్ తీసుకుంటానని అంటున్నారు. వారి వద్ద ఉన్నప్పటికీ నిత్యం పర్యవేక్షణ ఉంటుందని శ్రీదేవి వివరించారు.

ఆ యువకుడు ఓ ఆదర్శం

ఇదిలా ఉండగా.. "ఐదుకల్లు గ్రామంలో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు" అని పత్రికలో వచ్చిన కథనం ఓ యువకుడి దృష్టిలో పడింది. హైదరాబాదులో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ఆ యువకుడు వెంటనే తన మిత్రులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశాడు. గ్రామంలో ముగ్గురు పిల్లల దయనీయ స్థితి చాలా దుర్భరంగా ఉంది. అందులో ఒక శాతం కూడా పత్రికలో రాయలేకపోయారు. అనే విషయాన్ని తెలుసుకున్న ఆ యువకుడు వెంటనే స్పందించాడు. ఆ పత్రిక క్లిప్పింగ్‌ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. గురువారం ఉదయం పోస్ట్ చేస్తే రాత్రికి రూ. 4.30 లక్షల వరకు ఆయన ఇచ్చిన పేటీఎం నెంబర్లో మిత్రులు, సౌహార్ధ హృదయం ఉన్నవారు డబ్బులు జమ చేశారు. ఆ కోవలో చిత్తూరు కడప, అనంతపురం జిల్లాలోని కొందరు జర్నలిస్టులు నగదు జమ చేయడంతో పాటు ఆ అకౌంట్ నెంబర్, పిల్లల దయనీయ స్థితిని వైరల్ చేశారు. ఆ విధంగా, పిల్లల భవిష్యత్తు కోసం దూర దృష్టితో ఆలోచన చేసిన సాయినాథ్ అనే వ్యక్తి ఆచూకీ తెలిసింది. అనేకమంది జర్నలిస్టులను చైన్‌లింకు మాదిరి సంప్రదిస్తూ వెళ్ళగా, చివరిగా సాయినాథ్ అందుబాటులోకి వచ్చారు. ఆయన ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడారు.




 

" మాది శెట్టూరు మండలం మొలకలవేడు. మా ఊరికి దగ్గరలోనే ఐదుకల్లు గ్రామం ఉంది. అక్కడ పిల్లల పరిస్థితి పేపర్‌లో చూశా. మా మిత్రులను వెంటనే అక్కడికి పంపితే, అక్కడున్న హృదయ విదారక దృశ్యంలో ఒక శాతం కూడా పేపర్లో రాయలేదని సమాచారం వచ్చింది. వెంటనే ఆ క్లిప్పింగ్ పిల్లల ఫోటోలు ట్యాగ్ చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాను. గురువారం రాత్రికే సుమారు రూ.4.30 లక్షలు నా స్నేహితులు, మానవతా హృదయం ఉన్నవారందరూ స్పందించి జమ చేశారు. అధికారుల సమక్షంలో ఆ పిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా" అని సాయినాథ్ వివరించారు.

" తనకు అందిన నగదు ఫిక్స్ డిపాజిట్ చేసి, వచ్చే వడ్డీ పిల్లల సంరక్షకులకు అందించే ఏర్పాటు చేస్తా" అని సాయినాథ్ చెబుతున్నారు. మీకే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. " మా ఊరి పక్కన గ్రామంలో ఈ సంఘటన జరగడం అనేది నన్ను కలచివేసింది. ఈ తరహా సహకారం అందించడం నాకు కొత్త కాదు" అని వివరించారు. అతి బలవంతం మీద ఆయన కొన్ని వివరాలు వెల్లడించారు.

గతంలో.. "అయ్యగారిపల్లెలో ఓ వ్యక్తి కోసం ఆరు లక్షలు, లక్ష్యం పల్లెలో నాలుగు లక్షలు, సోషల్ మీడియా వర్కర్‌కు ఆరోగ్యం బాగా లేకుంటే రూ.10 లక్షలు, క్యాన్సర్‌తో బాధపడుతున్న వేణు అనే వ్యక్తి కోసం రూ.ఒక లక్ష, గత ఏడాది మా మ్యాత్స్ టీచర్ కుమారుడికి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ కోసం రూ. 1.5 లక్షలు సోషల్ మీడియా ద్వారా రెండు మూడు రోజుల వ్యవధిలోనే సేకరించి, బాధితులకు అందించా" అని సాయినాథ్ వివరించారు. ఐదుకల్లు గ్రామంలో ఆదర్శ కమ్యూనిస్టు ఉద్యమ నేత సదాశివన్ పేరును ప్రస్తావించగా, "వాళ్లంతా పాతతరం కమ్యూనిస్టులు సార్. ఆయన గురించి విన్నాం ఇంకా మా ఊర్లలో కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. ఆ ప్రభావం ఇంకా ఉంది. కానీ నా వరకు మానవీయ సంఘటనలు దృష్టికి వస్తే మాత్రం నా వంతు సహకారం అందిస్తూనే ఉంటాను’’ అని హైదరాబాద్‌లో కన్సల్టెన్సీ ఏజెన్సీ నిర్వహిస్తున్న బీఎస్సీ, ఎల్ఎల్బి పట్టభద్రుడు సాయినాథ్ వివరించారు.

"తల్లిని కోల్పోయిన ముగ్గురు పిల్లల కోసం సాయినాథ్ చేసిన కృషి అభినందనీయం" అని ఐసిడిఎస్ అనంతపురం ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీదేవి అన్నారు. సోషల్ మీడియా ద్వారా నిధుల సేకరణ అంశం తన దృష్టికి కూడా వచ్చిందని ఆమె నిర్ధారించారు. తాజాగా అనంతపురం ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య కూడా గ్రామాన్ని సందర్శించి అనాధలైన ఆ పిల్లలను ఊరడించారు. ప్రస్తుతం వారి ఆలనాపాలన చూస్తున్న కుటుంబీకులకు ఆర్థిక సాయం కూడా అందించారు. పిల్లల దయనీయ స్థితిని తెలుసుకున్న అనేకమంది దాతలు అండగా నిలవడానికి ముందుకు వస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి ఆ పిల్లల చదువులు భవిష్యత్తు కోసం ఐసిడిఎస్ అధికారులు చేస్తున్న కృషికి మరింత తోడ్పాటు ఇవ్వాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News