TRAGEDY | ఆస్తి కోసం నా గొంతు కోసి చంపొద్దు, మామా!
'మామా, నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు, ఈ కత్తి ఎందుకు? ఎక్కడికి మామా వెళ్తున్నాం.. అంటుండగానే ఆ పిల్లాడి గొంతు తెగి కిందపడింది. ఇదో కలియుగ కంసుడి కథ..
By : The Federal
Update: 2024-11-30 12:39 GMT
'మామా, నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు, ఈ కత్తి ఎందుకు? ఎక్కడికి మామా వెళ్తున్నాం.. అంటుండగానే ఆ పిల్లాడి గొంతు తెగి(TRAGEDY) కిందపడింది. నెత్తుటి మడుగులో ఆ పిల్లాడు గిలగిలా కొట్టుకుని కళ్లు తేలేశాడు. అభం శుభం తెలియని ఆ పిల్లాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
మహాభారతంలో కంసుడు ఉన్నాడో లేడో గాని కలియుగంలో చాలా మంది కంసులు ఉన్నారని నిరూపించిన ఈ సంఘటన శ్రీపుట్టపర్తి సత్యసాయి జిల్లాలో జరిగింది.
ఏం జరిగిందంటే...
తల్లి లేకపోయినా మేనమామ ఉంటే చాలంటంటారు పెద్దలు. అలాంటి మేనమామ చేతిలో ఆ పిల్లాడు అత్యంత కిరాతకంగా చచ్చిపోతే ఆ తల్లి గుండె ఎంతగా తల్లడిల్లి ఉంటుందో కదా.. ఆ పిల్లాడు చచ్చిపోతూ ఎంతగా విలవిల్లాడి ఉంటాడో.. ఊహిస్తేనే కడుపులో దేవేసినట్టుండే ఈ సంఘటన సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో జరిగింది. ఆస్తిపై కన్నేసిన మేనమామ తన మేనల్లుణ్ణి చంపితే ఆస్తి వస్తుందనుకున్నాడు గాని జీవితాంతం ఈ ఘోర నేర భారాన్ని మోయాల్సి వస్తుందని భావించి ఉండడు.
మడకశిర మండలం మరువపల్లికి చెందిన వెంకటేశ్వర్లు, పుష్పలత కి 14 ఏళ్ల కిందట పెళ్లి అయింది. ఓ పిల్లాడు పుట్టిన తర్వాత ఆ దంపతులు విభేదాల కారణంగా విడిపోయారు. విడిపోయి కూడా 12 ఏళ్లు దాటింది. అప్పటి నుంచి ఆమె తన పిల్లాడు చేతన్ తో పాటు తన పుట్టింటి వద్దే ఉంటోంది. విడాకుల తర్వాత వెంకటేశ్వర్లు రెండో పెళ్లి చేసుకున్నాడు. పుష్పలత మాత్రం తన ఊరికి సమీపంలోని కియా మోటార్స్ కంపెనీలో పని చేస్తూ తన జీవితాన్ని ఈదుకొస్తోంది.
తన కుమారుడు చేతన్ ను 3 కిలోమీటర్ల దూరంలోని ఆమిదాలగొంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిస్తోంది. ఇప్పుడా పిల్లాడు 8వ తరగతికి వచ్చాడు.
కిడ్నాప్ జరిగిందిలా...
నవంబర్ 28న చేతన్ మామూలుగానే స్కూలుకు వెళ్లాడు. ఆ తర్వాత వాళ్ల తాత శ్రీరామప్పకు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి.. "నీ మనవణ్ణి కిడ్నాప్ చేశాం.. బడిలో ఉన్నాడో లేదో చూసుకుని.. ఫోన్ చేయ్’ అని చెప్పి ఫోన్ కట్ చేశారు. దీంతో కంగారు పడిన శ్రీరామప్ప ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ స్కూలుకు వెళ్లాడు. నా మనుమడు ఎక్కడంటూ అందర్నీ అడిగారు. ఎవరో వచ్చి బైక్‌పై తీసుకువెళ్లారని అక్కడి వాళ్లు చెప్పారు. దీంతో ఆయన ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు శ్రీరామప్పకు వచ్చిన ఫోన్‌కాల్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఆ నంబర్ ఓ మహిళదని గుర్తించారు. ఆమెను స్టేషన్‌కు పిలిపించారు.
మేనమామే కాలయముడు...
మరోవైపు చేతన్‌ను వాళ్ల మేనమామ తీసుకెళ్లాడని విద్యార్థులు చెప్పారు. పోలీసులు చేతన్ మేనమామ అశోక్‌ను అనుమానించి, అదుపులోకి తీసుకున్నారు. అశోక్ తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసినట్టు ఆ మహిళ చెప్పడంతో పాటు అసలు ఏమి జరిగిందో పోలీసులకు వివరించింది. ఎవరికో ఫోన్ చేసుకుంటానంటే ఫోన్ ఇచ్చానే తప్ప తనకు ఏ పాపం తెలియదని చెప్పింది. పోలీసులు ఆమెను వెళ్లిపొమ్మని చెప్పి అశోక్ కు నాలుగు తగిలించి విచారించారు. దీంతో చేతన్‌ను హత్య చేసింది తానేనని అశోక్ అంగీకరించినట్లు సమాచారం.
పిల్లాణ్ణి ఎలా చంపారంటే...
పిల్లాణ్ణి మోటారు సైకిల్ పై ఎక్కించుకుని తీసుకుని పోవడాన్ని పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. పిల్లాణ్ణి మడకశిర - కర్ణాటక సరిహద్దులోకి తీసుకువెళ్లారు. పిల్లాడు అప్పటికే భయంతో అరుపులు కేకలకు లంకించుకున్నాడు. తనను ఇంటికి పంపించమని తన మేనమామను బతిమిలాడాడు. చేతులు కాళ్లు కట్టేస్తుంటే వద్దని వేడుకున్నాడు. అయినా కనికరం లేని నిందితులు ఆ పిల్లాడు చేతన్ నోట్లో గుడ్డలు కుక్కి అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
బాలుడిని కిడ్నాప్ చేసిన వారిలో చేతన్ మేనమామ ఉన్నట్లు గుర్తించారు. పుష్పలత సోదరుడైన చేతన్ ను చంపేస్తే ఆమెకు వచ్చే మూడు ఎకరాల పొలం తనకు దక్కుతుందని ఆశించి అతను ఈ కిరాతకానికి పూనుకున్నట్టు అనుమానిస్తున్నారు. బాలుని మృతితో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. తండ్రి లేకపోయినా అల్లారుముద్దుగా పెంచుకున్న తమ బిడ్డను దారుణంగా చంపేశారని చేతన్ తాత శ్రీరామప్ప కన్నీరు మున్నీరయ్యారు. పిల్లాణ్ణి చంపిన తీరు విని గ్రామంలోని ప్రతి ఒక్కరూ కంటనీరు పెట్టారు.