మొంథా వల్ల 78,796 మంది రైతులు నష్టపోయారు

మొంథా తుఫాన్ నష్టం వివరాలు 5 రోజుల్లో ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Update: 2025-10-29 16:35 GMT

మొంథా తుఫాన్‌తో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఐదు రోజుల్లోగా పంట నష్టానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నష్టం వివరాలను త్వరగా సేకరించేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, వాటిని కాపాడేందుకు గల అవకాశాలపై రైతులకు తగు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. బుధవారం ఉదయం మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి, పర్యటన అనంతరం సాయంత్రం సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రంలో... తుఫాన్ వల్ల సంభవించిన నష్టంపైనా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు సేకరించన సమాచారం వరకు పరిశీలిస్తే... రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని, ఇందులో 59 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వరి పంటతో పాటు, ప్రత్తి, మొక్కజొన్న, మినుము వంటి పంటలు నీట మునిగినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 78,796 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. అలాగే 42 పశువులు చనిపోయినట్టు చెప్పారు. అయితే ఇది ప్రాథమికంగా ఉన్న అంచనాలు మాత్రమేనని.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను చూస్తుంటే... తుఫాన్ ప్రభావం వల్ల జరిగిన నష్టం ఇంకా పెరిగేలా ఉందని అధికారులు వెల్లడించారు.

యధావిధిగా ఆర్టీసీ సర్వీసులు
సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ తక్షణం జరగాలని స్పష్టం చేశారు. బుధవారం రాత్రి కల్లా విద్యుత్ సరఫరా చేయాలని, గురువారం నాటికి రహదారుల గుంతలు మరమ్మతు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులు యధావిధి కొనసాగించాలని సూచించారు. ఈ విషయాల్లో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరమ్మతులకు గురైన ఫీడర్లను పునరుద్ధరిస్తున్నామని, కూలిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్ట పరచాలన్నారు. పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని చెప్పారు. జలాశయాల సమర్ధ నీటి నిర్వహణకు జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు గురువారం నాటికి బియ్యం, నిత్యావసరాల పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా తాగు నీటి సరఫరాకు ఇబ్బంది రాకూడదని, తాగునీరు కలుషితం అయితే సహించేది లేదని, డయేరియా కేసులు నమోదు కాకుండా రూరల్ వాటర్ సప్లయ్ అధికారులు బాధ్యత వహించాలన్నారు.
ప్రకాశం జిల్లాలో మెరుగైన చర్యలు చేపట్టాలి
ఒంగోలు పట్టణంలో పలు కాలనీలు నీట మునగడంపై ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ఇటువంటి పరిస్థితి తలెత్తలేదని, భవిష్యత్‌లో పాలనా వైఫల్యం కనిపించకూడదని ముఖ్యమంత్రి చెప్పారు. తుఫాన్ రక్షణ చర్యలపై పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ప్రతీ జిల్లాలోనూ తుఫాన్ల సమయంలో తలెత్తే పరిస్థితులను అధిగమించేలా ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. రోడ్లు, పునరావాస కేంద్రాలు, విద్యుత్-తాగునీటి సరఫరా వంటి విషయాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రజాభిప్రాయం సేకరించి, లోపాలను సరిచేసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారని అధికారులు వెల్లడించగా, మృతుల కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తుఫాన్ తీరం దాటడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. తుఫాన్ తీవ్ర స్థాయిలో లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని, ప్రభుత్వం తీసుకున్న రక్షణ చర్యలపై ప్రజల నుంచి సానుకూల స్పందన, సంతృప్తి వ్యక్తమవుతోందని వెల్లడించారు.
మొత్తం 1.16 లక్షల మందికి పునరావాసం
రాష్ట్రంలో 1,209 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో 1.16 లక్షల మందికి మొంథా తుఫాను సమయంలో ఆశ్రయం లభించింది. మొత్తం 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం చూపింది. రాష్ట్రంలో 380 కి.మీ. పొడవున పంచాయతీరాజ్ రహదారులు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతినగా రూ.4.86 కోట్ల నష్టం వాటిల్లింది. 2,294 కి.మీ. పొడవున ఆర్ అండ్ బీ రహదారులు దెబ్బతిని రూ.1,424 కోట్ల నష్టం సంభవించింది. రూరల్ వాటర్ సప్లయ్‌కు సంబంధించి రూ.36 కోట్లు, ఇరిగేషన్‌ పనుల్లో రూ.16.45 కోట్ల వరకు నష్టం జరిగింది. సురక్షిత ప్రాంతాలకు 3,175 మంది గర్భిణీలను తరలించారు. 2,130 మెడికల్ క్యాంపుల నిర్వహించారు. 297 రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండగా, వాటిని దారి మళ్లించేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 380 చెట్లు రహదారులపై విరిగిపడగా, అన్నింటినీ తొలిగించారు. మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సీఎస్ విజయానంద్ సహా ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
Tags:    

Similar News