ఐదో తరగతి ఆనంద్ గొంతు కోసిన తోటి విద్యార్థులు

ఏలూరు జిల్లా చింతలపూడి గురుకుల పాఠశాలలో 10 ఏళ్ల బాలుడిపై దారుణ దాడి చోటుచేసుకుంది.

Update: 2025-11-15 10:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా, చింతలపూడి మండలంలోని డా. బీ.ఆర్. అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో అర్థరాత్రి వేళ దారుణ సంఘటన చోటుచేసుకుంది. 5వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల మారుముళ్ల ఆనంద్ కుమార్ అనే బాలుడిపై గుర్తు తెలియని కొందరు విద్యార్థులు ఆకస్మికంగా దాడి చేశారు. ఉన్మాదులుగా మారిన ఆ విద్యార్థులు బ్లేడ్‌తో అతని గొంతు కోశారు. ఈ దారుణ దాడి పాఠశాల హాస్టల్‌లో భయాన్నినింపింది.  ఘటన అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో జరిగింది. 

పాశవిక దాడి: గొంతు కోసి పరారు 

పోలీసుల విచారణ ప్రకారం.. ఐదో తరగతి చదువుతున్న ఆనంద్ కుమార్ హాస్టల్‌లో నిద్రించగా, గుర్తు తెలియని ముగ్గురు విద్యార్థులు అతని మీద దాడి చేశారు. బ్లేడ్‌తో అతని కంఠంపై గాయపరిచి, పీక కోసి పాశవికంగా ప్రవర్తించారు. దాడి తర్వాత వారు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో ఆనంద్ కుమార్ విలవిల్లాడిపోయాడు. నొప్పి తట్టుకోలేక గట్టిగా కేకలు వేయడం మొదలెట్టాడు. ఆనంద్ కుమార్ కేకలకు పక్కన నిద్రించిన విద్యార్థులు మేల్కొన్నారు. రక్తంతో తడిచి ఉన్న ఆనంద్ ను చూసి ఒక్క సారిగా షాక్ అయ్యారు. వెంటనే హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ ఘటన పాఠశాలలో చదువుతున్న వారిని భయభ్రాంతులకు గురిచేసింది. 

తక్షణ చికిత్స: ఐదు కుట్లు, నిలకడగా ఆరోగ్యం

 స్పందించిన సిబ్బంది, తోటి విద్యార్థులు ఆనంద్ కుమార్‌ను చింతలపూడి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతని కంఠంపై ఐదు కుట్లు వేసి, తీవ్ర గాయాలకు చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స తర్వాత, పరిస్థితి స్థిరంగా ఉండటంతో ఏలూరు జిల్లా ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఆనంద్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని, 24 గంటల్లో డిస్చార్జ్ అవ్వొచ్చని  వైద్యులు చెప్పారు.  "మా బిడ్డ బతికితే చాలు" అంటూ ఆ బాలుడి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు స్థానికులను సైతం కన్నీరు తెప్పించింది. 

పోలీసు దర్యాప్తు: ఇద్దరు అనుమానితులు, కేసు నమోదు

ఘటన తెలిసిన వెంటనే చింతలపూడి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది. SI రమేష్ కుమార్ నేతృత్వంలో టీమ్ స్థలానికి చేరుకుని, IPC 307 (హత్యాయత్నం), 323 (గాయపరిచేలా కొట్టడం) కింద కేసు నమోదు చేసింది. బాదితుడు ఆనంద్ కుమార్ ఏడు, ఎనమిదో తరగతులు చదువుతున్న ముగ్గురు విద్యార్థులపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులు పాఠశాల CCTV ఫుటేజ్ సేకరించి, సాక్షుల వాంగ్మూలాలు రికార్డ్ చేస్తున్నారు. రెండు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి రిపోర్ట్ సమర్పిస్తాం అని పోలీసులు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్‌పై కూడా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటనపై స్థానిక SC సంఘాలు, విద్యార్థి సంఘాలు ధర్నాలు చేపట్టాయి. గురుకులాల్లో 24/7 సెక్యూరిటీ, కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News