కారంచేడు గాయానికి నలభైయేళ్లు...

కారంచేడులో 1985 జూలై 17 న నలభై ఏళ్ళ క్రితం దళితుల ఊచకోత జరిగింది. అందులో ఆరుగురు మరణించారు.;

Update: 2025-07-17 06:14 GMT

భారత దేశాన్ని కుదిపి వేసిన కారంచేడు ఊచకోత నలభై ఏళ్ళ క్రితం ఇదే రోజున అంటే 1985 జూలై 17 న  జరిగింది. ఈ ఘటనలో కమ్మ కులానికి చెందిన వారు మాదిగ కులానికి చెందిన వారిపై దాడి చేసి ఆరుగురిని చంపారు. ఈ ఘటనలో ముగ్గురు మాదిగ స్త్రీలపై అత్యాచారం జరిపారు.ఈ దాడిలో గ్రామస్తులు కొందరు తమ ఇళ్లను వదిలి పారిపోవాల్సి వచ్చింది. కొందరు ఇళ్ళు తగలబెట్టబడ్డాయి.

అనేక వాద వివాదాలకూ, రాజకీయ పరిణామాలకూ, ఉద్యమాలకూ దారితీసిన దుర్ఘటన అది. నాడు ఒంగోలు, నేడు బాపట్ల జిల్లా; ఆనాటి జనాభా 13600, అందులో సుమారు 6000 మంది కమ్మవారు; 2000 మంది దళితులు, అందులో 1100 మాదిగ, 900 మాల, మిగతా ఇతరులు వుండేవారు. ఈ సంఘటనకు ముందు, తరువాత కూడా ఈ మాదిరి సంఘటనలు అనేకం జరిగాయి. చుండూరు లో 1991 ఆగస్టు 6 న జరిగిన ఘోరం కూడా నేటికీ మరిచి పోలేనిది. వీటికి వ్యతిరేకంగా అనేక రూపాలలో ప్రతిఘటన కూడా వచ్చింది. అయినా పరిస్థితి లో పెద్ద మార్పు వున్నట్లు కనిపించదు.

కారం చేడులో, మరణించిన గాయపడిన బాధిత కుటుంబాల వారితో పాటు అనేక మందిని ఆ రోజుల్లో కలిసిన ఓపిడిఆర్ నిజనిర్ధారణ కమిటీ అనేక విషయాలను కూడా వెల్లడించింది. వందల సంఖ్యలో వచ్చి మాదిగ వాడపై చేసిన దాడిలో ఆరుగురు గ్రామీణ పేదలు మరణించారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. నలుగురు మానభంగాలకు గురయ్యారు ఈ దౌర్జన్యాల ప్రత్యక్ష సాక్షి అయిన మహిళను తర్వాత హత్య చేశారు. ఈ దౌర్జన్యాల్ని 'కుల సంఘర్షణలు' గా పాలకవర్గాలూ ప్రభుత్వమూ వారి మీడియా తొలి దశలో చిత్రించాయి. కాగా ఈ ఘటనలోని వర్గ కోణాన్ని విస్మరించి లేదా తగ్గించి "దళితులపై కమ్మ భూస్వాముల దాడి" అని పలువురు సమీక్షించారు. ఆ గ్రామ దళిత కుటుంబాల్లో మాల మాదిగలున్నా ఈ దాడి మాదిగ కుల పేదల పై మాత్రమే జరిగింద న్నది ఒక వాస్తవం. దానికి గల కారణాలు ఓపిడిఆర్ రిపోర్టులో కనిపిస్తాయి. ఈ ఘటన గురించిన మరిన్ని వివరాలు  ఇక్కడ ఉన్నాయి.



ఈ రోజు గ్రామంలో నాటి బాధితులకు నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది.



 చీరాల విజయనగర్ కాలనీ (కారంచేడు బాధితుల పునరావాస కాలనీ)లో ప్రతీ ఏడాదీ జూలై 17 న జరిగే అమరుల సంస్మరణ కార్యక్రమం జరుగుతుంది.ఈ ఏడాది కూడా నేడు సంస్మరణ కార్యక్రమం గంభీరవాతావరణంలోజరిగింది.





ఉదయం 10 గంటలకు కాలనీ నుండి నినాదాలతో  నాటి బాధితుల సామూహిక సమాధుల ( రుధిర క్షేత్రం) దగ్గరకు ఊరేగింపు సాగింది.




వారి కుటుంబ సభ్యులు, దళిత ఉద్యమ అభిమానులు, కార్యకర్తలు,నాయకులు వెళ్ళి, అమరవీరులకు నివాళులు అర్పించారు. తదుపరి రుధిర క్షేత్రం వద్ద స్మారక సభ నిర్వహించారు.కారంచేడు గ్రామ స్తులతో పాటు ఇరుగు పొరుగు ఇతర ప్రాంతాల నుంచీ వచ్చిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  


లకే రాజారావు,BSP మాజీ ఎమ్మెల్యే, బి.పరంజ్యోతి, BSP మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, దుడ్డు భాస్కరరావు సభాధ్యక్షుడు, కృపాకర్ మాదిగ, జూపాక సుభద్ర, పిల్లి మాణిక్యారావు లిడ్ క్యాప్ చైర్మన్, టిడిపి అధికార ప్రతినిధి, మున్నంగి నాగరాజు,చింతపల్లి,గురుప్రసాద్,భైరి నరేష్, కొరివి వినయ్ కుమార్,నీలం నాగేంద్ర, డాక్టర్ బాబూరావు,భగత్సింగ్, జి.ఆర్.అంబేడ్కర్,మున్నంగి లక్ష్మయ్య,సుందరరావు, దుడ్డు సులోచన, మున్నంగి సువార్త,ఇంకా దళిత ఉద్యమ కార్యకర్తల,అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News