ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 38 గంటలే..

నాలుగో విడతలో ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

Update: 2024-05-11 12:55 GMT

నాలుగో విడతలో ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ 25 పార్లమెంటు నియోజకవర్గాలకు మే 13న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం విస్తృత బందోబస్తు, సీసీ కెమెరాలు, గొడవలు జరగడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో నిరంతర నిఘా, వివాదాస్పద ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేసింది.

ఓటర్లు ఎంతమందంటే...

ఏపీలో ఓటర్ల సంఖ్యకు సంబంధించి ఈసీ ఫైనల్ లిస్ట్‌ని రిలీజ్ చేసింది. దీని ప్రకారం.. రాష్ట్రంలో 4.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. రాష్ట్రంలో 2.2 కోట్ల పురుష ఓటర్లు, 2.10 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారు. మిగతా వారిలో సర్వీస్ ఓటర్లు, థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో కొత్త ఓటర్లు 5.94 లక్షలు నమోదయ్యాయి.

మొత్తం పోటీలో ఎంతమందంటే..

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 175 అసెంబ్లీ స్థానాలకు 2,300 మంది పోటీ చేస్తున్నారు. స్టేట్ అబ్జర్వర్స్ సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియను 100 శాతం వెబ్‌క్యాస్టింగ్ నిర్వహిస్తారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని సైతం ఏర్పాటు చేస్తున్నారు. 29,897 పోలింగ్ స్టేషన్లలో నామమాత్రపు వెబ్‌క్యాస్టింగ్ ఏర్పాట్లు చేశారు.

ఓటర్లకు సదుపాయాలు..

ఎండలు తీవ్రస్థాయిలో ఉండటంతో.. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. ఎండ తీవ్రత కారణంగా ఓటర్లు ఇబ్బంది పడకుండా.. అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఈసీ సూచించింది. పోలింగ్ కేంద్రాల్లో మంచినీళ్లు,ఫ్యాన్లు, కూలర్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వంటి వాటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. 85 ఏళ్లకు పైబడిన వారికి, అంగవైకల్యం కలిగిన వారికి హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించింది.

అసెంబ్లీకి పోటీ పడుతున్న ప్రముఖులెవరంటే...

మూడు ప్రాంతీయ పార్టీలు- వైసీపీ, టీడీపీ, జనసేన అధ్యక్షులు- వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, కె.పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పులివెందుల, కుప్పం, పిఠాపురంలో పోటీ హోరాహోరిగా సాగుతోంది. చంద్రబాబు వరుసగా 7 సార్లుగా గెలుస్తూ వస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఆయన్ను ఓడించాలని వైసీపీ ఈసారి గట్టి పట్టుదలతో ఉంది. వైసీపీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్సీ కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ పోటీలో ఉన్నారు. తెర వెనుక తతంగమంతా మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోటీ చేస్తున్న పులివెందులలో టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి మరోసారి పోటీ పడుతున్నారు. ఈ రెండు సీట్లలో ఆయా పార్టీల అధ్యక్షులు గెలిచే అవకాశాలే ఎక్కువ.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పోటీలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను ఈసారి కూడా అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా చూసేందుకు వైసీపీ అదే సామాజికవర్గానికి చెందిన మహిళ ఎంపీ వంగా గీతను ప్రత్యర్థిగా నిలిపింది. ఈ నియోజకవర్గంలో పోటీ చాలా తీవ్రంగానే ఉంది. కాపు సామాజికవర్గం యువత పవన్ కల్యాణ్ కి మద్దతు ఇస్తోంది. ముద్రగడ పద్మనాభం లాంటి సీనియర్ నేతలు మాత్రం పవన్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్నప్పటికీ ఎక్కువగా ముఖాముఖి పోటీ సాగుతున్న నియోజకవర్గాలే. మంగళగిరి నుంచి చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ (టీడీపీ), చీపురుపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ, నగరి నియోజకవర్గం నుంచి సినీనటి, ప్రస్తుత మంత్రి రోజా సెల్వమణి (వైసీపీ), విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంతో కలిసి పోటీ చేస్తున్నా ఒకటి రెండు నియోజకవర్గాలలో తప్ప మిగతా అన్ని చోట్ల నామమాత్రపు పోటీలేనని భావించవచ్చు. రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాలలో పిఠాపురం, మంగళగిరి ఉన్నాయి.

Live Updates
2024-05-11 13:04 GMT

పోలింగ్‌ రోజు సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు

మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ రోజు అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు ఉటాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నిల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు.  జూన్‌ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం ఉందన్నారు. బందోబస్తు కోసం రాష్ట్రానికి కేంద్ర బలగాలు వచ్చాయని, 60వేల మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉంటారని చెప్పారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ.320 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. తనిఖీలకు సంబంధంచి 8వేలకు పైగా కేసులు నమో చేశామన్నారు. రాష్ట్రంలో 1.88 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారని వికాస్‌రాజ్‌ తెలిపారు.

Tags:    

Similar News