సెలూన్లకు విద్యుత్ రాయితీలో వివక్ష

కేబినెట్ లో సెలూన్లకు ఉచిత విద్యుత్ ను 150 యూనిట్ల నుంచి 200 యూనిట్ల పెంపుకు ఆమోదం;

Update: 2025-08-07 05:40 GMT
Salon Shoop

నాయీ బ్రాహ్మణులు నిర్వహించే సెలూన్ షాపులకు ప్రస్తుతం ఇస్తున్న ఉచిత విద్యుత్ ను 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనిని నాయీ బ్రాహ్మణులు స్వాగతిస్తున్న ఇతర కులాల్లో ఉన్న సెలూన్ షాపులు నిర్వహించే వారు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. కుల ప్రాతిపదికన కాకుండా సెలూన్ షాపులు నిర్వహించే వారందరికీ ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఉచిత విద్యుత్ అందించాలని కోరుతున్నారు. ‘కుల వృత్తికి చాటిలేదు గువ్వల చెన్నా’ అనేది ఒకప్పటి సామెత. నేడు ఆ సామెతకు విలువ లేదు. ఏ కులం వారు ఆ వృత్తి చేయడం లేదు. దీనిని ప్రభుత్వం గుర్తించాలి.


నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హమీని నెరవేర్చడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత హర్షం వ్యక్తంచేశారు. అర్హులైన నాయీ బ్రాహ్మణులందరికీ ఉచిత విద్యుత్ ను 150 నుంచి 200 యూనిట్లకు పెంచుతూ కేబినెట్ భేటీలో ఆమోదించడంపై సీఎం చంద్రబాబుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. గడడిచిన ఎన్నికల్లో నాయీ బ్రాహ్మణుల కష్టాలను గుర్తించిన సీఎం చంద్రబాబు ఉచిత విద్యుత్ ను 200 యూనిట్ల వరకూ అందిస్తానని హామీ ఇచ్చారు. బుధవారం సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో నిర్వహించిన కేబినెట్ భేటీలో నాయీ బ్రాహ్మణులందరికీ ఉచిత విద్యుత్ ను 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచుతూ మంత్రి మండలి సభ్యులు ఆమోదం తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కేటగిరీ-II సర్వీస్ కింద 40,808 సెలూన్ షాపులు గుర్తింపు పొందాయి. ఈ షాపులన్నింటికీ నెలకు 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ అందించనున్నట్లు వెల్లడించారు. నాయీ బ్రాహ్మణులకు అందించే ఉచిత విద్యుత్ వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.100.20 కోట్లు భారం పడుతోందని మంత్రి సవిత తెలిపారు. నాయీబ్రాహ్మణులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. దేవాలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు ఇచ్చే గౌరవ వేతనం రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. నాయీ బ్రాహ్మణులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని మంత్రి సవిత పేర్కొన్నారు.


కులంతో ముడిపెట్టడం ఎంత వరకు సమంజసం...?

సెలూన్ సాపులు ప్రస్తుతం కులంతో సంబంధం లేకుండా ఎంతో మంది నడుపుతున్నారు. నాయీ బ్రాహ్మణులు కాకపోయినా సెలూన్ షాపులు నిర్వహిస్తున్న వారందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందించాలని డిమాండ్ వచ్చినా ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. కులం అడిగిన తరువాత సెలూన్ షాప్ నిర్వహిస్తున్న వారు మంగళి (నాయీ బ్రాహ్మణ) అని నిర్థారించిన తరువాతనే వారికి ఉచిత విద్యుత్ ను 200 యూనిట్ ల వరకు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి కులంతో సంబంధం లేకుండా అనేక వృఅనేక సామాజిక వర్గాల వారు చేస్తున్నారు. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా వారికి రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్ర నాథ్ పేర్కొన్నారు.

కుల రహిత సమాజం కోసం ప్రయత్నించాలి..

దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ కుల రహిత సమాజం కోసం ప్రయత్నిస్తే ప్రస్తుతం సమాజంలో ఉన్న తారతమ్యాలు తగ్గే అవకాశం ఉందని కుల రహిత సమాజం కోసం పోరాడే ఆండ్ర మాల్యాద్రి పేర్కొన్నారు. ఆయన ప్రస్తుతం కుల వివక్ష పోరాట సమితీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించడం ద్వారా కులాలను కూడా ప్రోత్సహించిన వారుగా ప్రభుత్వం మారిపోతోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో దేశంలో కుల వివక్ష ఎక్కువగా ఉందని ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగంలో రాయితీలు ఇచ్చారని, ఇన్నేళ్లయినా కుల వివక్షను రూపు మాపడంలో ప్రభుత్వాలు సక్సెస్ కాకపోగా ఇంకా కులాన్ని గుర్తుంచుకునేలా పథకాలు ఇవ్వడం, అవి గొప్పగా చెప్పుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News