ఆస్ట్రేలియాలో ఇద్దరు ఏపీ విద్యార్థులు దుర్మరణం
ఆస్ట్రేలియాలో ఏపీ కి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.;
ఆస్ట్రేలియాలో ఏపీ కి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈత సరదా ఇద్దరి మృత్యువుకి దారితీసింది. బాపట్ల జిల్లాకు చెందిన చైతన్య ముప్పరాజు, ప్రకాశం జిల్లాకు చెందిన సూర్యతేజ బొబ్బ ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుతున్నారు. వీరిద్దరూ మరో స్నేహితుడితో కలిసి క్వీన్స్‌లాండ్‌లోని కెయిర్న్స్ సమీపంలోని మిల్లా మిల్లా జలపాతంలో ఈతకు వెళ్లారు. అక్కడ ఈత కొడుతున్న సమయంలో చైతన్య, సూర్యతేజ నీటమునిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో అక్కడే ఉన్న వీరి స్నేహితుడు షాక్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముగ్గురు యువకులు ఈత కొడుతున్న సమయంలో ఒకరు నీటిలో కొట్టుకుపోయారు. గమనించిన మరో స్నేహితుడు అతనిని కాపాడేందుకు వెళ్ళాడు. దురదృష్టవశాత్తూ ఇద్దరూ నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు అని ఇన్‌స్పెక్టర్ జాసన్ స్మిత్ తెలిపారు. విద్యార్థులు నీటమునిగినట్లు సమాచారం అందుకున్న వెంటనే క్వీన్స్‌లాండ్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. మంగళవారం ఉదయం 8:50 గంటలకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఒక హెలికాఫ్టర్ సహాయంతో వారికోసం గాలించారు. విద్యార్థులు కనిపిస్తే వైద్య సహాయం అందించేందుకు అంబులెన్స్ తోపాటు వైద్య సిబ్బందిని రెడీగా ఉంచారు. కానీ ఎంత ప్రయత్నించినా వారి ఆచూకీ లభించలేదు. అయితే ఆ ఇద్దరితోపాటు ఉన్న మరో స్నేహితుడు కూడా ఘటనా సమయంలో అక్కడే ఉన్నాడు. కానీ తన కళ్ళముందే తన స్నేహితులు ప్రాణాలు కోల్పోవడంతో అతను షాక్ లోకి వెళ్లాడని ఇన్‌స్పెక్టర్ జాసన్ తెలిపారు. కాగా, పోలీసులు మూడవ స్నేహితుడి వివరాలు వెల్లడించలేదు.
చైతన్య, సూర్యతేజ మరణంతో ఇండియాలోని వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉన్నత చదువులకోసం విదేశాలకి పంపితే.. తమ బిడ్డల మరణవార్త వినాల్సివస్తుందని అనుకోలేదని కన్నీరుమున్నీరవుతున్నారు. అటు ఇద్దరు విద్యార్థుల స్నేహితులు కూడా వారి మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చైతన్య, సూర్యతేజ ల స్నేహితుడు సూర్య మంగపతి మాట్లాడుతూ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. తమ స్నేహితులిద్దరూ చాలా మంచివారని, ఎంతో ఫ్రెండ్లీగా మెలిగేవారని చెప్పాడు. ఇద్దరినీ ఒకేసారి కోల్పోవడం చాలా బాధగా ఉందన్నాడు సూర్య.