గోదావరి పుష్కరాల సబ్ కమిటీలో 12 మంది మంత్రులు
మహా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.;
By : The Federal
Update: 2025-06-25 08:56 GMT
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు గోదావరి పుష్కరాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా 2027లో జరిగే గోదవరి పుష్కరాలపై మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. 12 మంది మంత్రులతో కూడిన కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ మంత్రితో పాటు హోం మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రిని కూడా దీనిలో సభ్యులుగా చేర్చారు.
మంత్రులు ఎవరంటే..
మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, మంత్రి పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, మంత్రి వాసంశెట్టి సుభాష్, రాంప్రసాద్‌రెడ్డి, సత్యకుమార్ యాదవ్, బీసీ జనార్థన్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్‌లు ఈ సబ్‌కమిటీలో ఉన్నారు. 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలను విజయవంతం చేసేందుకు అవసరమైన, తీసుకోవలసిన చర్యల మీద ఈ మంత్రి వర్గ ఉప సంఘం ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించనుంది. ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాలను విజయవంతం చేసేందుకు ఆయా శాఖల అధికారులు ఈ మంత్రి వర్గ ఉప సంఘానికి సహకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నారు. ఇటీవల ఉత్తర భారత దేశం ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన మహా కుంభమేళా తరహాలో ఈసారి గోదావరి పుష్కరాలను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో అక్కడి ఏర్పాట్లను కూడా మంత్రి నారాయణ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రత్యేక బృందం అక్కడకు వెళ్లి పరిశీలించింది.