ఏకంగా 5 కోట్లు లంచం డిమాండ్ ...ఏసీబీ వలలో అవినీతి తిమింగలం
ఏసీబీ చరిత్ర లోనే అతి పెద్ద మొత్తంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారి;
By : V V S Krishna Kumar
Update: 2025-08-08 09:33 GMT
ఏసీబీ చరిత్ర లోనే అతి పెద్ద మొత్తంతో రెడ్ హ్యాండెడ్ గా ఓ అవినీతి తిమింగలం పట్టుపడ్డాడు.ఏకంగా 5 కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేసి , పెద్ద మొత్తంలో అడ్వాన్స్ తీసుకుంటూ అతడు ఏసీబీకి చిక్కడం సంచలనంగా మారింది.ఈ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయనున్న ఈ ఉన్నతాధికారి ఈలోపే చక్కబెట్టుకోవాలని భావించాడో ఏమోగానీ ,ఓ కాంట్రాక్టర్ కు రావాల్సిన బిల్లుల మంజూరు కోసం 25 లక్షల రూపాయలు తనకార్యాలయంలోనే దర్జాగా తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు.
విజయవాడ కేంద్రంగా గిరిజన సంక్షేమశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ)గా పనిచేస్తున్న సబ్బవరపు శ్రీనివాస్ ,విశాఖకు చెందిన సత్యసాయి కన్‌స్ట్రక్షన్స్ నిర్వాహకుడు చెరుకూరి కృష్ణంరాజు అనే కాంట్రాక్టర్ వద్ద నుంచి లంచం డిమాండ్ చేశాడు.సదరు కాంట్రాక్టర్ ఏడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం, ఇతరత్రా పనులు చేశారు. వాటికి గాను గిరిజన సంక్షే శాఖ నుంచి రూ.35.5 కోట్ల వరకు బిల్లులు రావలసి ఉంది. దాని కోసం ఈఎన్‌సీ శ్రీనివాస్‌ను సంప్రదించగా తనకు రూ.5 కోట్లు ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తానన్నారు.దీంతో కంగుతిన్న కాంట్రాక్టర్ పనులు చేయడానికి బ్యాంకుల్లో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నానంటూ ఏసీబీని ఆశ్రయించాడు.
దీంతో రంగంలో దిగిన విజయవాడ, శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీలు సుబ్బారావు, రమణమూర్తిల నేతృత్వంలో ఈఎన్ సీ శ్రీనవాస్ పై నిఘా పెట్టారు. రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన దాంట్లో అడ్వాన్స్‌గా రూ.25 లక్షలు తీసుకుంటుండగా అతడి కార్యాలయం లోనే వల పన్ని శ్రీనివాస్ ను పట్టుకున్నారు. శుక్రవారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
గతంలోనూ రెండు కేసులు
విజయనగరం జిల్లాకు చెందిన శ్రీనివాస్ మూడేళ్లుగా గిరిజన సంక్షేమశాఖ ఈఎన్‌సీగా ఉన్నారు. ఆయన గతంలో విశాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నప్పుడు కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2021లో ఆదాయానికి మించి ఆస్తులు వున్నయన్న కేసు నమోదు కాగా , శాఖాపరంగా చర్యలు చేపట్టారు.అంతకు ముందు 2014 లోనూ శ్రీకాకుళం జిల్లా సీతంపేట లో ఏఈగా వున్న సమయంలోనూ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. తాజాగా భారీ మొత్తంలో డబ్బు లంచంగా తీసుకుంటూ మళ్లీ ఏసీబీకి దొరికిపోయాడు.ఇప్పటికే రెండు కేసులు నడుస్తుండగా శ్రీనివాస్ తన వైఖరి మార్చుకోకుండా రిటైర్మెంట్ సమయంలోనూ లంచానికి కక్కూర్తి పడటం ఆ శాఖాపరంగా చర్చకు దారితీసింది.