పొత్తిళ్లలో ఆ పాపలను చిదిమేసింది ఎవరు?
ఓటర్లు, జానాభాలో మేటిగా ఉన్న మహిళలు. బాలికల సంఖ్య ఎందుకు తగ్గింది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-14 05:59 GMT
పుట్టేది ఆడబిడ్డ అని నిర్ధారణ కావడమే ఆలస్యం. పురుటిలోనే చిదిమేస్తున్నారు. ఈ దురాచారం వల్ల ఆడబిడ్డల జనన నిష్పత్తి పడిపోయిందనే ఆందోళనకర విషయం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతంలో వెలుగు చూసింది. వాస్తవానికి
శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రిలో పురుడు పోసుకుంటున్న బాలికల వృద్ధి రేటు ఆశాజనకంగా ఉంది. దీంతో ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలు, కార్పొరేట్ ఆస్పత్రులపై అనుమానపు చూపులు ప్రసరించాయి. ఇంతజరుగుతున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు స్పందించపోెవడంపై కూడా సందేహాలు నీడలు కమ్ముకున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అసలు విషయం బయటపెట్టారు. సమగ్ర విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇంతకీ విషయం ఏమిటంటే..
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతంలో మూడు నెలల వ్యవధిలోనే ప్రతి 1,000 మంది అబ్బాయిలకు కేవలం 629 మంది ఆడపిల్లలు మాత్రమే జన్మిస్తున్నారనే విషయం బయటపడింది. ఈ ప్రమాద సంకేతాల వెనుక స్కానింగ్ ద్వారా చట్టవిరుద్ధంగా భ్రూణ హత్యలు జరుగుతున్నాయనే చేదు నిజం తెరమీకు వచ్చింది.
శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో బాలికల జననాల రేటు ఏమాత్రం తగ్గలేదనే విషయం ఈ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మణి వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
"మా ఆస్పత్రిలో మాతాశిశు రక్షణ కోసం ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. స్కానింగ్ చేసినా పుట్టబోయేది ఏ బిడ్డ అనేది వెల్లడించరు" అని డాక్టర్ మణి తేల్చి చెప్పారు. ఈ ఏడాది జనవరిలో ఈ ఏరియా ఆస్పత్రిలో గర్భిణులు ప్రసవించారు. వారిలో 40 మందికి బాలురు పుట్టారు. 47 మంది బాలికలు జన్మించారు. ఫిబ్రవరిలో 31 మంది బాలురు, 28 మంది బాలికలు జన్మించారు. మార్చిలో 33 మంది బాలురు, 27 మంది బాలికలు, ఏప్రిల్ లో 34 మంది బాలురు, 32 మంది బాలికలు, మే నెలలో 25 మంది బాలురు, 29 మంది బాలికలు, జూన్ లో 30 మంది బాలురు 26 మంది బాలికలు జన్మించారు. జూలైలో 19 మంది బాలురు జన్మిస్తే 22 మంది బాలికలు పుట్టారు. రికార్డు స్థాయిలో ఆగష్టు నెలలో 39 బాలురు జన్మిస్తే, 41 మంది బాలికలు జన్మించారు" అని డాక్టర్ మణి గణాంకాలు వెల్లడించారు.
బాలికల తగ్గుదల ఎలా గుర్తించారు?
ప్రభుత్వ శాఖల పనితీరును చైర్మన్ హోదాలో కలెక్టర్ సమీక్షించడం సర్వసాధారణం. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ ఇటీవల కొన్ని రోజుల కిందట వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై జిల్లా స్థాయి మల్టీ మెంబర్స్ సలహా మండలి కమిటీలో సమీక్షించారు. బాలురతో పోలిస్తే, బాలికల సంఖ్య గణనీయంగా తగ్గడాన్ని గమనించిన కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. జిల్లాలోని ప్రయివేటు స్కానింగ్ కేంద్రాలు, నర్సింగ్ హోంలపై నిఘా ఉంచాలని ఆయన ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లే తేలితే కఠినంగా శిక్షించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం
"శ్రీకాళహస్తితో పాటు జిల్లాలోని ప్రభుత్వ ప్రయివేటు ఆస్పత్రులలో విచారణకు కమిటీ ఏర్పాటు చేయండి. సమగ్ర నివేదిక ఇవ్వండి" అని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ ను ఆదేశించారు.
శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు అందిస్తున్న సేవలు, జననాలపై ట్రాక్ రికార్డు సక్రమంగానే ఉంది. ఇక చట్టవ్యతిరేక కలాపాలు ఎక్కడ జరిగాయి? ఇలా జరగకుండా చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఏమి చేశారు? అనే ప్రశ్నలు తెరమీదకు వచ్చాయి. స్కానింగ్ సెంటర్లలో ఎన్నిసార్లు తనిఖీ చేశారు. ఆకస్మిక తనిఖీలు చేశారా? లేదా? అనేది కూడా ప్రశ్నార్థకమైంది.
వీరిపాత్ర ఏమిటి?
ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) పరిధిలోని సబ్ సెంటర్లలో ఏఎన్ఎం (Auxiliray Nurse Midwives -ANM's), ఆమె సహాయకారిగా సెకండ్ ఏఎన్ఎం, వారికి తోడు ఆషా వర్కర్లు ప్రజల ఆరోగ్య సేవల కోసం పనిచేస్తుంటారు. ప్రజల ఆరోగ్య సేవల రికార్డులు నమోదు చేయడం తోపాటు గర్భిణులను గుర్తించడం వారికి ఆరోగ్య సూత్రాలు వివరించడం వారి బాధ్యత. అంటే గర్భిణుల సమాచారం వారికి తెలుస్తుంది. ఆ వివరాలు నమోదు చేసుకుంటారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి, రూరల్, వీటికి అంతర్భాగంగా ఉన్న తొట్టంబేడు మండలాల్లో 250 మంది అంగన్ వాడీ వర్కర్లకు కూడా గర్భిణులకు కూడా బాధ్యతలు అప్పగించారు. వారితో పాటు ఏర్పేడు, రేణిగుంట మండలాల్లో 150 అంగన్ వాడీ కేంద్రాల్లో గర్భిణులకు పౌష్టికాహారం కూడా అందిస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే,
శ్రీకాళహస్తి పట్టణంలో మూడు అర్బన్ హెల్త్ సెంటర్లు ( Urban Health Center's UHC), ఓ పిహెచ్సీ ( Primary Health Center PHC) తోపాటు ఏర్పేడులో రెండు, తొట్టంబేడులో రెండు, రేణిగుంటలో రెండు పీహెచ్సీల
పరిధిలో దాదాపు 60 మందికి పైగానే ఏఎన్ఎంలు కూడా ఉన్నారు. వారికి సహాయకారిగా ఆషా వర్కర్ల సంఖ్య కూడా ఏమాత్రం తక్కువ లేదు. వారు గర్భిణులను గుర్తించిన తరువాత ఏ మేరకు పర్యవేక్షించారనేది ప్రశ్నార్థకంగా మారింది?
ఈ విషయంపై వివరణ కోరేందుకు, స్కానింగ్ కేంద్రాల పర్యవేక్షణ వివరాలు తెలుసుకునేందుకు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి. బాలకృష్ణనాయక్ అందుబాటులోకి రాలేదు. రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నా, ఫోన్ రిసీవ్ చేసుకుంటున్న డీఎం అండ్ హోచ్ ఓ సీసీ దినేష్ చెప్పిన మాట ఒకటే
"సార్ మీటింగులో ఉన్నారు. ఫ్రీ అయ్యాక మాట్లాడిస్తా" ఇదే సమాధానం నుంచి ఆయన నుంచి వినిపించింది. శ్రీకాళహస్తి డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ మృథులవాణితో మాట్లాడేందుకు ఆమె ఫోన్ నంబర్ కలవలేదు.
స్కానింగ్ సెంటర్ల కథేమిటి?
శ్రీకాళహస్తిలో ఐదు గుర్తింపు పొందిన స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. మరో ఐదు ప్రయివేటు ప్రధాన ఆస్పత్రులు ఉన్నాయి. ఈ ప్రాంతానికి ఇదే ప్రధాన స్కానింగ్, కార్పొరేటు ఆస్పత్రులు. ఈ కేంద్రాలకు ఈ మూడు నెలల్లో ఎంతమంది గర్భిణులు స్కానింగ్ చేయించుకునేందుకు వచ్చారనేది కీలకంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ స్కానింగ్ చేయించుకున్న వారి వివరాల రికార్డులు అందుబాటులో ఉన్నాయా? లేదా? అనేది కూడా సందేహాస్పదంగా మారింది.
స్కానింగ్ చేయించుకోవడానికి వచ్చే వారి వివరాలు నమోదు జరుగుతుందా? లేదా అని తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నంలో శ్రీకాళహస్తిలోని ఎలైట్ స్కానింగ్ సెంటర్ ను సంప్రదిస్తే అక్కడ స్టాఫ్ గా చెప్పకున్న ఓ మహిళ
"ఎవరికైనా స్కానింగ్ చేయాలా సార్. అయితే సాయంత్రం రండి" అని సూచించారు. ఆ కేంద్రం నిర్వాహకుడి కోసం వాకబు చేస్తే,
"ఆయన పేరు డాక్టర్ ఎంవీఎస్. రాజు అని చెప్పారు. ప్రస్తుతం ఆయన భోజనానికి వెళ్లారు. సాయంత్రం కాల్ చేయండి. డాక్టర్ నంబర్ ఇవ్వడం కుదరదు" అని మొహంమాటం లేకుండా తిరస్కరించారు.
ఆడబిడ్డలను తల్లి గర్భంలో హత్య చేస్తున్న దుర్మార్గులను శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తిలో భ్రూణ హత్యలకు పాల్పడడం దుర్మార్గం అన్నారు.
"ఈ ప్రాంతంలో ఆడపిల్లల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం స్కానింగ్ సెంటర్లే. లింగ నిర్ధారణ బహిర్గతం చేయడం ద్వారా ఘోరానికి పాల్పడుతున్నారు" అని సీపీఎం నేత నాగరాజు ఆరోపించారు. గూడూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి ప్రాంతంలోని ఆసుపత్రుల యజమానులను గుర్తించి, కఠినంగా శిక్షించాలన్నారు.
కారణం ఏమిటి
శ్రీకాళహస్తిలో ఆడపిల్లల సంఖ్య తగ్గడానికి దారితీసిన పరిస్థితులను విశ్లేషిస్తే, అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఓటర్లలో జనాభాలో పురుషులతో పోలిస్తే, మహిళలు సంఖ్య ఎక్కువ. అక్షరాస్యతలో తక్కువగా ఉన్నారనే విషయాలు వెల్లడయ్యాయి. ఎన్నికల కమిషన్ ప్రకటించిన మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 2,37,760 ఓటర్లలో పురుషులు 1,15584 మంది కాగా, మహిళల సంఖ్య 1,22,176 మంది. అంటే 6,592 మంది ఎక్కువగా ఉన్నారు.
సగటులో అధికం..
2011 జనాభా లెక్కల ప్రకారం శ్రీకాళహస్తి ప్రాంతంలో 80,056 మందిలో పురుషులు 38,995 మంది, మహిళలు 41,061 మందిగా రికార్డులు చెబుతున్నాయి. ఈ ప్రకారం పరిశీలిస్తే, ప్రతి వెయ్యి మంది పురుషులకు 1053 మంది మహిళలు ఉన్నట్లు ప్రకటించిన గణాంక శాఖ రాష్ట్ర సగటులో 993 కంటే ఎక్కవ అని నిర్ధారిస్తోంది. కానీ
గత మూడు నెలల్లో జననాల రేటులో తీవ్ర వ్యత్యాసం ఉంది. 1,000 మంది అబ్బాయిలకు కేవలం 629 మంది ఆడపిల్లలు మాత్రమే జన్మిస్తున్నారు.
ఆరేళ్ల లోపు బాలల సంఖ్యను పరిశీలిస్తే, బాలురు 4,227 మంది ఉంటే, బాలికల సంఖ్య 3,997 మంది ఉన్నట్లు గణాంక శాఖ వెల్లడించింది. 2025 సంవత్సరంలో గత మూడేళ్ల వైద్య ఆరోగ్య శాఖ తయారు చేసిన నివేదిలో ఆ సంఖ్య ఇంకా తగ్గినట్లు నిర్ధారణ అయింది.
"గత మూడు నెలల్లో ప్రతి 1,000 మంది అబ్బాయిలకు కేవలం 629 మంది ఆడపిల్లలు మాత్రమే జన్మిస్తున్నారు" అనే విషయం వెలుగు చూసింది. దీనికి కారణం ఏమిటి?
పేదరికం, నిరక్షరాస్యతేనా?
శ్రీకాళహస్తి వ్యవసాయక ప్రాంతం. పరిశ్రమలకు కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతం జనాభాలో బీసీలు వన్నెకుల క్షత్రియ సామాజికవర్గానికి సంఖ్యా పరంగా ఎక్కువ. ఆ తరువాత కాపు, గిరిజనులు ఎక్కువ వారిలో అక్షరాస్యత శాతం కూడా తక్కువగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మొత్తం మీద 78.66 అక్షరాస్యత రేటు ఉంటే, పురుషుల్లో 85.15 శాతం, మహిళల అక్షరాస్యత 72.57 శాతం ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మారుతున్న కాలంలో మగబిడ్డ పుడితే చాలనే అభిప్రాయం బాగా పెరిగింది. దీనికి తోడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాల కొరత, ప్రైవేటులో ఖరీదైన వైద్యం భరించడం కూడా కష్టంగా మారింది. మగపిల్లలంటే బాగా మమకారం పెంచుకున్న దంపతులు స్కానింగ్ ద్వారా లింగ నిర్ధారణ చేయించుకుని, ఆడ బిడ్డ పుట్టబోతున్నట్లు తెలియగానే అబార్షన్లకు సాహసిస్తున్నట్టు తెలిసింది.
శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టు ఏమంటారంటే..
"ప్రభుత్వాస్పత్రిలో గతంలో 120 నుంచి 150 వరకు ప్రసవాలు జరిగేవి. రెఫరల్ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి" అని శ్రీనివాసులు చెప్పారు. పట్టణంలో రెండు ఆస్పత్రుల్లో అబార్షన్లు చేస్తారనే విషయం బహిరంగ రహస్యం" అని వ్యాఖ్యానించారు. దీనిపై సమగ్ర విచారణ జరిగితే మాత్రం నమ్మలేని భయంకర వాస్తవాలు వెలుగు చూస్తాయంటున్నారు. రాజకీయ పట్టు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు, డాక్టర్లపై ఏమేరకు చర్యలు ఉంటాయి? నివేదిక ఎలా ఉండబోతుందనేది వేచిచూడాల్సిందే.