బాబు సింగపూర్ టూరు సాధించిందేమిటీ?
ఈ పర్యటన మరొక దావోస్ టూరు లాంటిదే. ఆహ్వానం రాయించుకుని సొంత ఖర్చుతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నదే...;
By : Amaraiah Akula
Update: 2025-08-03 08:31 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) బృందం జూలై 26 నుంచి చేసిన 6 రోజుల సింగపూర్ పర్యటనపై వివాదం ముసురుకుంది. ఈ పర్యటన ఏమి సాధించింది అనే దానిపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఈ పర్యటన సూపర్ సక్సెస్ అని తెలుగుదేశం (టీడీపీ) వర్గాలు చెబుతుంటే సూపర్ ప్లాప్ అంటూ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీ సహా ఇతర విపక్షాలు విమర్శలకు దిగాయి.
సింగపూర్ లో చంద్రబాబుకు స్వాగతం పలికిన తెలుగు సంఘాల కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు
సింగపూర్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా - సామాజిక మాధ్యమం ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఒక ట్వీట్ చేస్తూ... "సింగపూర్ పర్యటన విజయవంతం అయింది. ఈ పర్యటనలో.. ప్రభుత్వ నాయకులు, పరిశ్రమల నాయకులు, భారత ప్రవాసులతో ప్రయోజనకరమైన (ప్రాడక్టివ్) సమావేశాలు సహా 27కి పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నాను... భారతదేశం-సింగపూర్ సంబంధాలను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాను" అని పేర్కొన్నారే తప్ప ఎటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. తన పర్యటన సక్సెస్ వివరాలు చెప్పలేదు. ఇది చంద్రబాబు ధోరణికి పూర్తిగా భిన్నమైంది. పైగా ఈ పర్యటనపై మంత్రులెవరూ ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని కూడా మౌఖిక ఆదేశాలు ఇచ్చారు.
చంద్రబాబు చేసిన ట్వీట్
సరిగ్గా ఈ పాయింటే విపక్షాలకు అస్త్రమైంది. సింగపూర్ ప్రభుత్వం నుంచి చంద్రబాబుకు అధికారిక ఆహ్వానం రాకపోయినా, రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అధికారిక జీఓ (Rt No.120) ద్వారా దీనికి అధికారిక ముద్ర వేసింది. మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పరిచింది. జూలై 26 నుంచి 6 రోజుల పాటు పర్యటనకు షెడ్యూల్ ఇచ్చింది. ఇలా ‘ప్రైవేట్ టూర్’ను ‘ఎక్స్‌పోజర్ అండ్ నెట్‌వర్కింగ్ విజిట్’గా అధికారికంగా ప్రకటించడంతో రాజకీయ, దౌత్యపరమైన చర్చలకు ఇది దారితీసింది. ఓ విధంగా చెప్పాలంటే ఈ పర్యటన- మరో దావోస్ పర్యటన వంటిది. సొంత ఖర్చుతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది.
కాకపోతే, సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ తాన్ సీ లెంగ్ (Tan See Leng)తో జరిగిన సమావేశంలో కొంత ఊరట లభించింది. ముఖ్యమంత్రి నాయుడితో సమావేశం మీద లెంగ్ పేస్ బుక్ లో ఒక చిన్న పోస్టు పెట్టారు. సాధారణంగా దేశాల మధ్య అలాంటి పాజిటివ్ ప్రకటనలు సహజం. ‘లేదు , పో’ అని ఏదేశమూ అతిధితో అనదు. అందుకే లెంగ్ కూడా ముఖ్యమంత్రితో తన సమావేశం చక్కగా జరిగిందని, ఆంధ్రప్రదేశ్ గొప్ప రాష్ట్రమని, మంచి ఆర్థిక వ్యవస్థ అని పొగిడారు. ఈ రాష్ట్రంతో సహకరించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తామని అన్నారు. దీన్ని రకరకాలుగా వివరించుకోవచ్చు. అయితే, అమరావతికి ఏలాంటి స్పష్టమయిన హామీ ఇవ్వలేదు. అంతే కాదు,గతంలో సింగపూర్ స్టార్ట్ అప్ క్యాపిటల్ నిర్మాణానికి ఏర్పాటు చేసిన కన్సార్షియం ను పునరుద్ధరించబోమని కూడా స్పష్టంగా చెప్పారు. కాకపోతే, అర్బన్ డెవెలప్ మెంట్ కింద టెక్నికల్ సాయం చేసేందుకు మార్గాలను అన్వేషిస్తామని అన్నారు. ఇది గౌరవప్రదమయిన ప్రకటన.
‘"Today, Chief Minister and I agreed to explore anew, partnerships with the state. Although the Singapore consortium will not be reconstituted, Singapore will continue to support the development of AP and Amaravati through technical cooperation in urban development and working together with partners like World Bank."
అధికారికంగా ఏ సింగపూర్ ప్రభుత్వ అధికారీ వీరిని కలుసుకునే ప్రణాళిక లేదు. సింగపూర్‌లో నివసిస్తున్న ఎన్ఆర్ఐ తెలుగువారు, అక్కడి తెలుగు కంపెనీలు, తెలుగుదేశం సింగపూర్ విభాగం, చంద్రబాబు అభిమానుల ఆహ్వానం పేరిట ఈ పర్యటన సాగింది.
చంద్రబాబు బృందం సింగపూర్ లో అడుగుపెట్టినప్పటి నుంచి పర్యటన ముగిసే వరకూ సింగపూర్, మలేషియా, దక్షిణాసియా ప్రాంతాల తెలుగు డయాస్పోరాయా హడావిడి చేసింది. వాళ్లే చంద్రబాబుతో మమేకం అయ్యారు. వాళ్లందర్నీ (తెలుగు వారిని) రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా మార్చే ‘పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్ పార్ట్‌నర్‌షిప్ (P4)’ మోడల్ లో భాగస్వాములు కావాలని చంద్రబాబు కోరారు.
సింగపూర్ లో అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇస్తున్న చంద్రబాబు
ఒకట్రెండు గ్లోబల్ కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు జరిపారు. ఏపీకి పెట్టుబడులతో తరలిరావాలని కోరారు. ప్రధానంగా, డేటా సెంటర్లు, కృత్రిమ మేధస్సు (AI), ఫిన్‌టెక్, పోర్ట్ బేస్డ్ ప్రాజెక్టులు వంటి రంగాలలో పెట్టుబడులకు అవకాశాలు చూపుతామన్నారు.
నవంబర్ 14, 15 తేదీలలో జరగబోయే విశాఖపట్నం ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ కోసం విదేశీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడమూ ఈ పర్యటనలో భాగంగా ఉంది.
సింగపూర్ పర్యటన చంద్రబాబుకు కొత్తేమీ కాకపోయినా ఆ దేశంలో అభివృద్ధి చేసిన పార్కులు, భవన సముదాయాలు, ఆర్కిటెక్చర్ డిజైన్లు, టూరిస్ట్ స్పాట్లను పరిశీలించారు.
గతంలో ఏమి జరిగిందంటే..
రాజధాని అమరావతిని సింగపూర్ తరహాలో నిర్మించాలన్న కలతో 2014-2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం- సింగపూర్ ప్రభుత్వంతో రెండు కీలక ఒప్పందాలు చేసుకుంది. ఆ ఒప్పందాల ప్రకారం, సింగపూర్ సంస్థల కన్సార్షియం, సీసీడీఎంసీ (కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ)తో కలిసి ఏర్పాటు చేసే ఏడీపీ (అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్)కి ప్రభుత్వం 1,691 ఎకరాలను అప్పగించింది.
సింగపూర్‌కు చెందిన సుర్బానా జురాంగ్ సంస్థతో కలిసి 6.84 చ.కి.మీ. ప్రాంతాన్ని అభివృద్ధి చేసే స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) ఏర్పాటైంది. ఎకరం రూ.4 కోట్లు (కనీస ధర)గా నిర్ణయించింది. మొత్తం విలువ రూ.6,764 కోట్లు. వీటిలో 371 ఎకరాలను మౌలిక సదుపాయాలకు కేటాయించాలి. తొలి విడతగా 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాలను సింగపూర్ సంస్థలకు ఉచితంగా అప్పగిస్తుంది. మిగతా 1,070 ఎకరాలను ప్లాట్లుగా వేసి విక్రయిస్తారు. అభివృద్ధి చేస్తే ఎకరా రూ.50 కోట్లకు పైగా ధర పలుకుతుందని ఆనాటి అంచనా.
వైసీపీ గెలుపుతో తారుమారు...
కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక, ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తూ అప్పటి సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయం సింగపూర్ దేశాన్ని తీవ్రంగా నిరాశపరిచింది. ప్రభుత్వాలు మారినా గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు సజీవంగా ఉంటాయని భావించిన సింగపూర్ కంపెనీలకు వైసీపీ నేతల రాజధాని వ్యతిరేక ప్రకటనలు భయబ్రాంతులకు గురిచేసినట్టు ఆ దేశ పత్రికలు రాసిన కథనాలను బట్టి తెలుస్తోంది. కొన్ని కంపెనీల ప్రతినిధులు చెప్పకుండానే దేశం వదిలిపెట్టి పోయారు. ఫలితంగా, సింగపూర్ ప్రభుత్వం తమ వాటాను బుక్ విలువకే విక్రయించాల్సి వచ్చింది.
అమరావతి నిర్మాణంలో సింగపూర్ ఉన్నట్లా లేనట్లా?
అమరావతి నగర ప్రాజెక్టును మొదట్లో చంద్రబాబు ఎంతో ఆకర్షణీయంగా ప్రచారం చేశారు. కృష్ణా నదీతీరంలో నిర్మించబోయే ‘సింగపూర్ 2.0’ అని ఆయన ప్రకటించారు. కానీ రాజకీయ అస్థిరత, నిధుల కొరత, పాలన మార్పుల కారణంగా ప్రాజెక్టు నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చాక, అమరావతిని మళ్లీ ప్రారంభించాలని చంద్రబాబు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా, తిరిగి సింగపూర్ ప్రభుత్వ విశ్వాసాన్ని గెలుచుకోవడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా ఉంది.
గతంలో సింగపూర్ అమరావతి నిర్మాణంలో భాగస్వామి. ఇపుడు కూడా భాగస్వామిని చేద్దామని సింగపూర్ ని ఒప్పించేందుకు ముఖ్యమంత్రి వెళ్తున్నారని మీడియాలో ప్రచారం సాగింది. అయితే, అమరావతి గురించి ప్రత్యేకంగా ఎక్కడా చర్చ జరిగినట్లు లేదు. సింగపూర్ ప్రభుత్వం ప్రభుత్వ ప్రతినిధులు వచ్చి కొందరు కలిసినా ఆ ప్రస్తావన వచ్చిన సమాచారం లేదు. ఎక్స్ పోస్టులు లేవు. ఫేస్ బుక్ సమాచారం లేదు. సింగపూర్ పర్యటన గురించి సర్వం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఎక్కడా ఈ అంశం గురించి ప్రస్తావించలేదు. పోస్టులు పెట్టలేదు. ఎక్కడా అమరావతి ప్రస్తావన లేదు. అందువల్ల అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామి అయ్యే అవకాశాలు లేనట్లు భావించాలి.
సింగపూర్ ప్రభుత్వం ఎందుకు సుముఖత చూపలేదు.. టాన్ సీ లెంగ్ సోషల్ మీడియా లో చెప్పిందేమిటి? ప్రపంచ బ్యాంకు వంటి భాగస్వాములతో కలిసి పనిచేయడం ద్వారా పట్టణ అభివృద్ధిలో సాంకేతిక సహకారం ద్వారా ఆంధ్రప్రదేశ్, అమరావతి అభివృద్ధికి తమ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని చెప్పారే తప్ప తాము భాగస్వాములమవుతామని ఎక్కడా చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను "రాజకీయంగా అస్థిరమైన రాష్ట్రంగా" (Politically Volatile) భావిస్తోంది. దీంతో మున్ముందు పెట్టుబడులకు ఆసక్తి చూపడం లేదు.
విపక్షాల విమర్శలు ఏమిటంటే...
దీనిపై వైసీపీ నాయకుడు, ఏపీ సమాచార శాఖ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ఏమన్నారంటే.. "అవినీతి ఆరోపణలపై జైలు పాలైన మంత్రివర్గ సభ్యుడు ఈశ్వరన్ పేరు ఈ అమరావతి ప్రాజెక్టులో ప్రముఖంగా వినిపించడం, ఆయన చంద్రబాబుకు సన్నిహితుడు కావడం కూడా ప్రస్తుత సింగపూర్ ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడానికి మరో కారణంగా ఉంది. చంద్రబాబు ప్రస్తుత సింగపూర్ పర్యటన కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. తాను ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక పెట్టుబడులను ఆకర్షించే పేరిట ఈ పర్యటనకు దిగారు. ఇది కేవలం ప్లాప్ షో"
ప్రభుత్వ వాదన ఇదీ..
అయితే చంద్రబాబు దృక్పథం భిన్నంగా ఉంది. "తమ ప్రభుత్వ శైలిని, పారదర్శకతను, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సింగపూర్‌లో ప్రదర్శించేందుకు ఇది గొప్ప అవకాశం" అని చంద్రబాబు చెబుతున్నారు. "బ్రాండ్ ఏపీ'ని వైఎస్ జగన్ సర్వనాశనం చేశారు. గ్లోబల్ ఇన్వెష్టర్లు పారిపోయేలా చేశాడు. ఆ విశ్వాసాన్ని పునరుద్ధరించడం కోసమే సింగపూర్ పర్యటన. దీని కోసమే మా నాయకుడు చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారు" అని ముఖ్యమంత్రి కుమారుడు, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలో మంత్రి అయిన నారా లోకేశ్ చెప్పారు.
ఎవరు పిలిచారని వెళ్లారో మరి...
కానీ ఈ వ్యాఖ్యలను సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు విమర్శించాయి. "ఇది చంద్రబాబు సొంత ప్రతిభా నైపుణ్యాల ప్రదర్శన వేదికగా రూపొందించారు. ఆహ్వానం లేకుండా వెళ్లడం, అధికార భేటీలకు అవకాశం లేకపోవడం, గత అనుభవాల వల్ల ఏర్పడిన విశ్వాస లోపాన్ని సరిదిద్దేందుకు ఆయన (చంద్రబాబు) ఏమి చేశారు? అసలు ఈ పర్యటన ద్వారా ఏమి సాధించారో, రాష్ట్రానికి ఏమి తెచ్చారో చెప్పాలి"అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు THE FEDERAL ప్రతినిధితో మాట్లాడుతూ డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కూడా అసలీ పర్యటన ఎందుకు చేశారో ప్రజలకు వివరించాలి కదా అని ప్రశ్నించారు. రామకృష్ణ THE FEDERAL ప్రతినిధితో మాట్లాడుతూ "ఈ పర్యటనతో చంద్రబాబు ఏ మేరకు పెట్టుబడుల్ని ఆకర్షించారు? సింగపూర్ ప్రభుత్వ విశ్వాసాన్ని తిరిగి పొందారో లేదో చెప్పకుండా కేవలం ఓ ట్వీట్ చేస్తే సరిపోతుందా? అసెంబ్లీ ఏర్పాటు చేసి అన్ని విషయాలు చెప్పాలి" అన్నారు. "గత అనుభవాలపై పూర్తి స్వీయపరిశీలన లేకుండా చేపట్టిన ఈ ప్రయత్నం మరోసారి రాజకీయ హేతుబద్ధతల పట్ల అసమర్థతగా మారకూడదు. వైఎస్ జగన్ ను విమర్శించేందుకు ఓ అస్త్రం కాకూడదు" అని ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు చెప్పారు. ఈ పర్యటన పూర్తిగా విఫలమైందని, కేవలం ప్లాప్ షో అని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ఎవర్ని కలిశారంటే..
చంద్రబాబు నాన్ స్టాప్ పర్యటనలో సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధాని లీ సైన్ లూంగ్, వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి టాన్ సీ లెంగ్, హోం శాఖ మంత్రి షణ్ముగం లాంటి కీలక నేతలతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రఖ్యాత సుర్బానా జురాంగ్, కేపెల్, కాపిటాల్యాండ్, సెంబ్ కార్ప్, TVS మోటార్స్, అదానీ పోర్ట్స్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు సీఎం బృందాన్ని కలిశాయి. ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు, స్పష్టమైన విజన్, వృద్ధి అవకాశాలు వంటివాటిపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ పట్ల సానుకూల స్పందన కనిపించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు."వైఎస్ జగన్ హయాంలో సింగపూర్ సంస్థలతో దెబ్బతిన్న సంబంధాల పునరుద్ధరణకు పెద్ద ముందడుగు పడిందని" భరత్ చెప్పారు.
దీన్ని కూడా ప్రతిపక్షమైన వైసీపీ తిప్పికొట్టింది. "వైఎస్ జగన్ వల్లే సంబంధాలు దెబ్బతిన్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో సింగపూర్‌కి మైత్రి ఎక్కడ దెబ్బతింది? ఏపీ పౌరులు సింగపూర్ వెళ్లడం లేదా? సింగపూర్ నుంచి ఏపీకి రాకపోకలు జరగడం లేదా? మైత్రిని పునరుద్ధరించడానికి చంద్రబాబు ఎవరు? అసలు సంబంధాలు దెబ్బతినడానికి జగన్‌కి ఏంటి సంబంధం? ఆ దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించడానికి చంద్రబాబు ఎవరు? ఆయనేమన్నా దేశానికి ప్రధానమంత్రా, దేశ విదేశాంగమంత్రా? భారత దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకి విదేశాంగ వ్యవహారాలతో ఏం పని?" వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి THE FEDERAL ప్రతినిధితో వ్యాఖ్యానించారు.
పుత్తా శివశంకర్ రెడ్డి (వైసీపీ)
ఈ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ నికరంగా చెప్పుకోదగిన తక్షణ ప్రయోజనాలు ఏమీ కనిపించలేదు. సత్వర ఫలితాలు ఇచ్చే ప్రయోగం కాదు అయితే ఈ టూరు ఓ మేటి టూర్‌గా నిలిచిపోతుంది. ఒకప్పుడు కలల రాజధానిగా ప్రారంభమైన అమరావతిని మరోసారి అద్భుతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చంద్రబాబు చేస్తున్న ఈ చొరవ, ఏపీ భవిష్యత్‌పై భారీ ఆశలను కలిగిస్తోంది. ఈ ఆశలకు సింగపూర్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందన్నదే? అసలు ప్రశ్న. అభివృద్ధిని మాటల్లో కాకుండా ఆచనరణలో చూపించగలిగినపుడు మాత్రమే అమరావతి 2.0కు మళ్లీ ఊపిర్లు ఊదినట్టవుతుంది.