'వెంకటేశా.. నీకు చెవిరెడ్డి ఎవుడో తెల్దా'
ఏమి నాటకాల్రా మీవి అంటున్న టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి. మరోపక్క విజయసాయిరెడ్డిని సిట్ విచారిస్తోంది.;
By : The Federal
Update: 2025-08-06 15:10 GMT
'నటించబాకు వెంకటేశా.. నీ నాటకాలు చూడల్లేదనుకుంటివా.. అబ్బో ఏమి దర్జారా మీది.. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఎవరో తెల్దా' అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి విరుచుకుపడ్డారు. ఏపీ మద్యం కుంభకోణంలో రూ.వేల కోట్లు దోచేసి అసలు తమకేం సంబంధం లేదన్నట్లు వైసీపీ నేతలు నటిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కేసులో నిందితునిగా ఉన్న వెంకటేశ్ నాయుడు ఎవరో తెలియకపోతే ఒంగోలులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి తరఫున డమ్మీ నామినేషన్ ఎందుకు వేయించారని ప్రశ్నించారు. ప్రజల నుంచి దోచేసిన సొమ్ముతో రాజభోగాలు అనుభవించారన్నారు. విమానంలో హీరోయిన్ పక్కన కూర్చొని వెళ్లే స్థోమత రావాలంటే ఎంతో డబ్బు ఉండాలని వ్యాఖ్యానించారు. విమానంలో వెంకటేశ్ నాయుడుతోపాటు ఎవరెవరు ఉన్నారనే వివరాలను సిట్ బయటకు తీయాలని కోరారు.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాన పాత్రధారి, సూత్రధారి అని, ఆయన్ను సిట్ విచారణ పిలిపించాలని కోరారు.
ఇదిలా ఉండగా, ఈ కుంభకోణానికి సంబంధించి సాక్షిగా హాజరుకావాలని విజయసాయిరెడ్డి గతంలో అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆయన ఇవాళ (ఆగస్టు 6)న విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చారు. విచారణ కొనసాగుతోంది.
కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డే (రాజ్ కసిరెడ్డి) ఈ కుంభకోణంలో కీలక సూత్రధారి అని విజయసాయిరెడ్డి సిట్ బృందానికి తెలిపారు. మొత్తం ఆరుగురు సభ్యుల బృందం విజయసాయిరెడ్డిని విచారిస్తోంది. మరోవైపు రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్‌రెడ్డి కూడా ఇవాళ ఉదయం మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఇద్దరినీ వేర్వేరుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరు చెప్పిన సమాధానాలకు అనుగుణంగా వేరొకరిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
మద్యం కుంభకోణం కేసులో విజయసాయిరెడ్డి పాత్రపై ఇంకా స్పష్టత లేదు.
అయితే, ఈ కేసులో ఆయన్ను ఇంకా నిందితునిగా చేర్చలేదు. పేరు ప్రస్తావనకు రావడంతో విచారిస్తున్నారు. ఈ కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ అరెస్టు చేసింది. వీరిద్దరూ గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయలో పనిచేశారు. విజయసాయిరెడ్డి ఈ కేసులో నిందితుడా, కాదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
,