గుజరాత్ గేమింగ్ జోన్ లో మాడి మసైన 26 మంది

సెలవుల వేళ సరదాగా పిల్లలతో గడుపుదామని వెళ్లిన సాదాసీదా జనం మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేశారు.

By :  Admin
Update: 2024-05-25 17:53 GMT

సెలవుల వేళ సరదాగా పిల్లలతో గడుపుదామని వెళ్లిన సాదాసీదా జనం మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేశారు. చుట్టుముట్టిన మంటల నుంచి బయటపడేందుకు ఎవరి ప్రయత్నం వారిది. పిల్లల ప్రాణాలు దక్కించుకునే యత్నంలో కాలి బూడిదైన వారు కొందరు, ఆటపాటల మధ్య మంటల్లోనే మాడి మసైపోయిన పిల్లలు మరికొందరు. ఎవరైతే సుమారు 24 మంది సజీవదహనమైన ఘోర సంఘటన గుజరాత్ రాజ్ కోటలోని టీఆర్పీ గేమింగ్ జోన్లో జరిగింది. అనుమతులు లేని గేమింగ్ జోన్లు.. ప్రజల ప్రాణాల మీదకు తీసుకువచ్చాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ ఘోరం జరిగింది. టీఆర్‌పీ గేమ్ జోన్‌లో (మే 25) శనివారం సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 24 మంది సజీవ దహనం అయ్యారు. వీరిలో సగం మంది చిన్నారులు. ఈ ఘటనపై విచారణకు సిట్ ను ఏర్పాటు చేసినట్టు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ చెప్పారు.


యువరాజ్ సింగ్ సోలంకి అనే వ్యక్తికి చెందిన గేమింగ్ జోన్ లో ఈ దుర్ఘటన జరిగినట్టు రాజ్‌కోట్ పోలీస్ కమిషనర్ రాజు భార్గవ తెలిపారు. గేమింగ్ జోన్ యజమానిని, మేనేజర్ ను మరో ఇద్దర్నీ విచారిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 20 మృతదేహాలను వెలికితీశారు. మరికొన్ని మృతదేహాలు ఇంకా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. “టిఆర్‌పి గేమింగ్ జోన్‌లో మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. అగ్నిమాపక యంత్రాలు మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. మంటలు అదుపులోకి వచ్చాయి. మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నాం" అని పోలీసు కమిషనర్ భార్గవ తెలిపారు. “నిర్లక్ష్యం, ఆకస్మిక మరణాలకు సంబంధించిన సెక్షన్ల కింద నేరాన్ని నమోదు చేశాం. రెస్క్యూ ఆపరేషన్‌లు పూర్తి చేసిన తర్వాత తదుపరి విచారణ జరుగుతుంది.” అన్నారు భార్గవ.

ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే..
అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతమంతా హృదయ విదారకంగా ఉంది. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి. మంటలు ఎగిసిపడుతున్నాయి. కనిపించని తమ పిల్లల కోసం తల్లిదండ్రులు వెతుక్కుంటున్నారు. ఆ ప్రాంతమంతా కాలిన చమురు వాసన వస్తోంది. అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్ లతో ఆ ప్రాంతమంతా నిండి ఉంది.
వెల్లువెత్తుతున్న సంతాపాలు...
రాజ్‌కోట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తీవ్ర మనోవేదనకు గురయ్యామన్నారు. చనిపోయిన వారి కుటుంబాల బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా మనసంతా వాళ్లవైపే ఉంది. గాయపడిన వారి కోసం ప్రార్థిస్తున్నాను. బాధితులకు అన్ని విధాలా సహాయాన్ని అందించేందుకు స్థానిక యంత్రాంగం కృషి చేస్తోందని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
“రాజ్‌కోట్‌లో జరిగిన అగ్ని ప్రమాదం హృదయాన్ని కలచివేస్తోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని సీఎం భూపేంద్ర పటేల్ అన్నారు.
మృతులకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియో...
చనిపోయిన వారికి నాలుగు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి ₹ 50 వేలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు అయింది. “ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా చూడడం చాలా ముఖ్యం. ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవన్నారు. 


Tags:    

Similar News