స్వర్ణం సాధించాలని.. నీళ్లు కూడా తాగని రెజ్లర్ వినేష్ ఫోగట్

కేవలం వంద అంటే 100 గ్రాముల బరువు ఆమెను పోటీకి దూరం చేసింది. సెమీఫైనల్స్ నెగ్గిన రెజ్లర్ వినేష్ ఫోగట్ అధిక బరువు కారణంగా ఫైనల్స్ కు దూరమయ్యారు.

Update: 2024-08-07 12:29 GMT

కేవలం వంద అంటే 100 గ్రాముల బరువు ఆమెను పోటీకి దూరం చేసింది. సెమీఫైనల్స్ నెగ్గిన రెజ్లర్ వినేష్ ఫోగట్ అధిక బరువు కారణంగా ఫైనల్స్ కు దూరమయ్యారు. ఫైనల్స్‌కు ముందు రోజు బరువు తగ్గడానికి చాలా శ్రమించారు. కాని ఫలితం లేకుండా పోయింది.

లక్ష్యాన్ని దూరం చేసిన బరువు..

ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలన్న రెజ్లర్ వినేష్ ఫోగట్ కల నెరవేరలేదు. మంగళవారం రాత్రి జరిగిన సెమీఫైనల్స్‌లో ఆమె విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఫైనల్స్‌లో పాల్గొనాల్సి ఉంది. USA కు చెందిన సారా ఆన్ హిల్డెబ్రాండ్‌తో తలపడాల్సి ఉంది. అయితే ఆమె ఉండాల్సిన బరువుకంటే 100 గ్రాములు ఎక్కువుగా ఉన్నట్లు తేలింది. రాత్రి అంతా బరువు తగ్గేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉదయం బరువు పరీక్షించే సమయానికి ఆమె 50 కేజీలకు మించి బరువు ఉండటంతో అనర్హత వేటు పడింది. ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్‌కు స్వర్ణం ఖాయమని భారతీయులంతా ఆకాంక్షించారు. కానీ అధిక బరువు ఆమె లక్ష్యాన్ని దూరంచేసింది.

రాత్రంతా పరిగెడుతూ..

ఫైనల్స్‌లో పాల్గొనడానికి ముందు రోజు రాత్రి తన బరువును తగ్గించుకోవడానికి వినేష్ చాలా కష్టపడ్డారు. ఆమెతో ఉన్న ఒక టీం సభ్యుడు ఇలా చెప్పారు.. “నిన్న రాత్రి సెమీఫైనల్స్ తర్వాత ఆమె బరువు 52.7 కిలోలు. ఆమె ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు. ఒక్క గుటక నీళ్లు కూడా తాగలేదు. ఆహారం అసలు తీసుకోలేదు. రాత్రంతా పరిగెట్టింది. ఆవిరి స్నానం కూడా చేసింది. ఫలితంగా ఆమె బరువు 50.1 కిలోలకు చేరుకుంది. కానీ చివరి 100 గ్రాములు తగ్గించడానికి సమయం సరిపోలేదు”అని పేర్కొన్నాడు.

బరువు తగ్గేందుకు వినేష్ తన జుట్టును కూడా కత్తిరించుకుందని హిందూ పత్రికలో ఒక కథనం ప్రచురితమైంది. భారత రెజ్లర్ రవి దహియా మాట్లాడుతూ.. సాధారణంగా అథ్లెట్లు తమ బరువును తగ్గించుకోడానికి నిర్ణీత సమయం ఇస్తారని చెప్పారు.

ఉదాహరణకు.. ఒక ఆటగాడు రాత్రి 8:05 గంటలకు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉంటే.. బరువు తగ్గించుకోడానికి అరగంట సమయం ఇస్తారు. ఆ తర్వాత కూడా బరువు అలాగే ఉంటే పోటీకి అనర్హులుగా ప్రకటిస్తారు.

Tags:    

Similar News