ఈడీ ముందుకు అజారుద్దీన్‌..ఆరోపణలపై మాజీ కెప్టెన్ ఏమన్నారు?

‘‘నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. నా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రత్యర్థులు పన్నిన కుట్ర’’ - అజారుద్దీన్

Update: 2024-10-08 11:00 GMT

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు హాజరయ్యారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఎ)లో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఈడీ ఆయనను ప్రశ్నించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియానికి సంబంధించి జనరేటర్లు, అగ్నిమాపక వాహనాలు, ఇతర సామగ్రి కొనుగోళ్లకు సంబంధించి రూ.20 కోట్ల మేర అవకతవకలు జరిగాయని అజారుద్దీన్‌పై కేసు నమోదైంది. హెచ్‌సీఏలో అక్రమాలకు సంబంధించి గత నవంబర్‌లో మాజీ ఉపాధ్యక్షుడు శివలాల్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు గడ్డం వినోద్, హెచ్‌సీఏ మాజీ సెక్రటరీ అర్షద్ అయూబ్‌ సహా హెచ్‌సీఏ మాజీ ఆఫీస్ బేరర్ల ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. డిజిటల్ పరికరాలు, కొన్ని పత్రాలు, లెక్క చూపని రూ.10.39 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

కాగా గత ఏడాది తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత అజారుద్దీన్ తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, తన ప్రతిష్టను భంగం కల్గించేందుకు ప్రత్యర్థులు చేసిన కుట్రగా అభివర్ణించారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన అజారుద్దీన్ 2009లో కాంగ్రెస్ టిక్కెట్‌పై ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 61 ఏళ్ల అజారుద్దీన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు.

Tags:    

Similar News