నలుగురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతున్నారా?
పరిస్థితులను బట్టే తుది జట్టు ఎంపిక ఉంటుందన్న కెప్టెన్ రోహిత్ శర్మ;
By : Praveen Chepyala
Update: 2025-03-03 14:06 GMT
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫి -2025 లో భాగంగా రేపు జరిగే తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడబోతోంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ నలుగురు స్పిన్నర్లతో ఆడబోతున్నాడా లేదా ఇంతకుముందులా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో వెళ్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నిన్న జరిగిన మ్యాచులో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్ గెలిపించిన సంగతి తెలిసిందే. భారత్, న్యూజిలాండ్ ను 44 పరుగుల తేడాతో ఓడించి గ్రూప్ ఏ లో అగ్రస్థానంలో నిలిచింది. ఎనిమిది జట్లు పాల్గొన్న అన్ని జట్లలో అజేయంగా నిలిచింది.
రోహిత్ అభిప్రాయం ఏంటీ?
సెమీస్ లో కచ్చితంగా నలుగురు స్పిన్నర్లతో ఆడించాలనే సూత్రం ఏమిలేకపోయినప్పటికీ నిన్నటి జరిగిన మ్యాచ్ లో వరుణ్ ప్రదర్శన కెప్టెన్ మదిలో సందిగ్థతను కలిగించే అవకాశం ఉంది. కివీస్ తో జరిగిన మ్యాచులో నలుగురు స్పిన్నర్లే తొమ్మిది వికెట్లు పడగొట్టి గెలుపుసాధించి పెట్టారు.
‘‘మనం నలుగురు స్పిన్నర్లను ఆడించాలనుకున్నా.. నలుగురు స్పిన్నర్లను ఎలా ఎంపిక చేసుకుంటాం. అక్కడి పరిస్థితుల గురించి మాకు తెలుసు, మ్యాచ్ గెలవడానికి ఏం చేయాలో అదే చేస్తాం’’ అని రోహిత్ తన మ్యాచ్ కాన్పరెన్స్ లో చెప్పారు.
వరుణ్ పై ప్రశంసలు
హర్షిత్ రాణా స్థానంలో జట్టులోకి వచ్చిన వరుణ్ 5/42 తో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశారు. కాబట్టి రేపటి సెమీస్ మ్యాచ్ కోసం రోహిత్ ప్రణాళికల్లో కచ్చితంగా వరుణ్ ఉన్నాడని చెప్పవచ్చు. ఆస్ట్రేలియన్ బౌలింగ్ లైనప్ ను అంచనా వేశాకనే తాము ఓ తుది నిర్ణయానికి వస్తామని కూడా రోహిత్ వివరించాడు. కాబట్టి జట్టు ఎంపిక ఎలా ఉంటుందో చెప్పడం కష్టంగా ఉంది.
ఇంతకుముందు ఇదే దుబాయ్ వేదిక మీద 2021 టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో వరుణ్ కూడా ఉన్నాడు. కానీ అప్పుడూ అతను సాధారణ ప్రదర్శన చేశాడు. అయితే నిన్న జరిగిన మ్యాచును గెలిపించడం ద్వారా వరుణ్ తన పాత చేదు గుర్తులను తొలగించుకున్నాడు.
మిస్టరీ స్పిన్నర్ ప్రదర్శనపై రోహిత్ కూడా ప్రశంసలు కురిపించాడు. 2021 వరల్డ్ కప్ ఆడేనాటికి వరుణ్ ఎక్కువ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదని, కానీ ఇప్పుడు పరిస్థితి వేరని, కొన్ని మ్యాచులు ఆడటం ద్వారా తన సత్తాను నిరూపించుకున్నాడని అన్నారు.
ఇంతకుముందు ఐపీఎల్, భారత్ తరఫున టీ20 క్రికెట్, తాజాగా వన్డే క్రికెట్ లోని గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడని అన్నారు. తన నైపుణ్యాన్ని బాగా మెరుగుపరుచుకున్నాడని, కొత్త అస్త్రాలను సిద్దం చేసుకున్నాడని కెప్టెన్ ప్రశంసలతో ముంచెత్తారు.
‘‘మీకు తెలుసా.. మా బ్యాట్స్ మెన్లలో కొంతమంది వరుణ్ వైవిధ్యాన్ని గుర్తించలేకపోయారు.అది బాగుంది’’ అని రోహిత్ అన్నారు. వరుణ్ బౌలింగ్ లో వైవిధ్యం తో పాటు కచ్చితత్వం కూడా ఉందని అన్నారు.
ఎందుకు తీసుకొచ్చామంటే..
యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్ల కంటే ముందుగా వరుణ్ ను ఎందుకు ఛాంపియన్ ట్రోఫి తీసుకున్నారనే విషయాన్ని రోహిత్ వివరించాడు. ‘‘ కేవలం ప్రతిభ ఆధారంగానే ఎంపిక జరుగుతుంది.
ఓ ప్రత్యేక ఆటగాడు, మంచి ప్రతిభతో రాణిస్తుంటే వారిని ట్రాక్ చేసి జట్టులోకి తీసుకొస్తాం. కొన్ని ఫార్మాట్లకు నిర్ధిష్ట నైపుణ్యం అవసరం. అటువంటి ఆటగాళ్లను చూసినప్పుడూ తిరిగి జట్టులోకి వస్తారు.’’ అన్నారు. నలుగురు స్పిన్నర్లపై వచ్చిన విమర్శలను రోహిత్ పెద్దగా పట్టించుకోలేదు.
వరుణ్ విషయంలో తాము ఓ బ్యాట్స్ మెన్ కు త్యాగం చేశామని చెప్పారు. గాయం లేకుండా ఓ బ్యాట్స్ మెన్ టోర్నీలో ఇప్పటి దాక ఆడటం చాలా అరుదని కూడా రోహిత్ అన్నారు.