విశాఖలో హెరెత్తుతున్న కోహ్లీ 'ఫీవర్'!

రేపు విశాఖ స్టేడియంలో Team India, South Africa చివరి వన్డే మ్యాచ్‌

Update: 2025-12-05 05:58 GMT
విశాఖ స్టేడియంలో టీమ్ ఇండియా సందడి
విశాఖపట్నం వేదికగా శనివారం (డిసెంబర్ 6) జరిగే మ్యాచ్ కి స్టేడియం ముస్తాబైంది. ఈ నెల 6న వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో సిరీస్‌లోని నిర్ణయాత్మకమైన చివరి వన్డే మ్యాచ్‌ జరగనుంది. శుక్రవారం ఇరుజట్లు స్టేడియంలో ప్రాక్టీస్‌తో పాటు మ్యాచ్‌ విజయానికి ప్రణాళికలు రచిస్తున్నాయి.

టీమ్‌ఇండియా (Team Inida), దక్షిణాఫ్రికాల మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరుగుతోంది. ఇందులోభాగంగా రాంచీ, రాయ్‌పుర్‌లలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగిశాయి. మూడో మ్యాచ్‌ విశాఖపట్నం వేదికగా శనివారం జరగనుంది.
డిసెంబర్‌ 6న జరగనున్న మ్యాచ్‌కు సంబంధించి, మొదట నవంబర్‌ 28న టికెట్ల విక్రయానికి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. తర్వాత ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయాల కోసం కౌంటర్లు ఏర్పాటు చేశారు. కానీ పెద్దగా స్పందన రాలేదు. ఎప్పుడైతే విరాట్‌ కోహ్లీ రాంచీ వేదికగా జరిగిన మొదటి వన్డేలో సూపర్‌ సెంచరీ (135) సాధించాడో.. అప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. టికెట్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ‘టికెట్ల విక్రయం నవంబర్‌ 28న ప్రారంభమైంది. మొదట్లో అభిమానుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. కానీ కోహ్లీ రాంచీలో సెంచరీ చేసిన తర్వాత నిమిషాల్లో టికెట్లన్నీ అమ్ముడుపోయాయి’ అని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ మీడియా అండ్‌ ఆపరేషన్స్‌ టీమ్‌ తెలిపింది. ఎప్పుడైతే విరాట్‌ కోహ్లీ (Virat Kohli) రాంచీ, రాయ్‌పుర్‌లలో వరుస సెంచరీలతో కదం తొక్కాడో.. ఆ తర్వాత ఒక్కసారిగా టికెట్ల విక్రయాలు ఊపందుకున్నాయని అధికారులు చెబుతున్నారు.
విరాట్‌ కోహ్లీ ఇప్పటికే టీ -20, టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం అతడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2027లో భాగం కావాలనే ఆశయంతో ముందుకుసాగుతున్నాడు. విశాఖలో ఇప్పటివరకు కోహ్లీ ఏడు మ్యాచ్‌లు ఆడి, 97.83 యావరేజ్‌తో 587 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.
విశాఖలోనూ శతకం బాదాలని..
ప్రస్తుత వన్డే సిరీస్‌లో ఇప్పటికే వరుసగా రెండు సెంచరీలు చేసిన విరాట్‌.. విశాఖ వన్డేలోనూ శతకం బాదాలని అభిమానులు కోరుకుంటున్నారు. కోహ్లీ వరుసగా మూడు సెంచరీలు చేసిన ఘనతను 2018లోనే వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచుల్లో సొంతం చేసుకున్నాడు. దీంతో వన్డే ఫార్మాట్‌లో వరుసగా మూడు, అంతకంటే ఎక్కువ మ్యాచుల్లో వరుస సెంచరీలు చేసిన 12వ బ్యాటర్‌గా నిలిచాడు.
దక్షిణాఫ్రికాపై రెండు వన్డేలలో వరుసగా రెండు సెంచరీలు బాదిన విరాట్‌ కోహ్లీ మళ్లీ తన పూర్వపు రోజుల్ని గుర్తు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో విశాఖలోనూ విరాట్‌ కోహ్లీ ‘సెంచరీ’ చేస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

వన్డే వరల్డ్‌ కప్‌ 2027 అక్టోబరు-నవంబరులో దక్షిణాఫ్రికాలో జరగనుంది. ఇదే ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ, క్రమం తప్పకుండా జట్టుకు ఎంపికైతే కనుక మెగా టోర్నీకి ముందు కోహ్లీకి మరో 25 వన్డేలు ఆడే అవకాశం లభిస్తుంది. ఇటీవలి కాలంలో పెద్దగా ఫామ్‌లో లేని విరాట్‌కు..సఫారీలపై చేసిన రెండు సెంచరీలు అతడిలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేశాయి. వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత కోహ్లీ రిటైరవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
Tags:    

Similar News