భారత బౌలర్ల దాటికి దక్షిణాఫ్రికా విలవిల, 270/10
డికాక్ సెంచరీ, కుల్‌దీప్, ప్రసిద్ధ్ దాటికి 270కి కుప్పకూలిన దక్షిణాఫ్రికా
By : The Federal
Update: 2025-12-06 11:51 GMT
విశాఖపట్నం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 3వ వన్డేలో సఫారీ జట్టు బ్యాటింగ్ కుప్పకూలింది. 270 పరుగులకు ఆల్ ఔట్ అయింది. ఒక దశలో బలమైన స్థితిలో ఉన్నప్పటికీ, మధ్యలో వికెట్లు వరుసగా కోల్పోయి కుప్పకూలే పరిస్థితికి చేరింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ శతకంతో భారత బౌలర్లను ఇబ్బంది పెట్టిన సౌతాఫ్రికా, అతను ఔట్ అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ఆరంభంలో బావుమా–డికాక్ జోడీ భారత పేసర్లను ధైర్యంగా ఎదుర్కొంది. 19 ఓవర్లకే జట్టు స్కోరు 100 పరుగులు దాటగా, 42 బంతుల్లో డికాక్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 113 పరుగుల భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న బావుమా (48) జడేజా బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే డికాక్ మాత్రం తన అగ్రెసివ్ స్టైల్‌ను కొనసాగించి, 80 బంతుల్లో శతకం పూర్తి చేశాడు.
కానీ అతని సెంచరీ ఎక్కువసేపు నిలువలేదు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 32.5 ఓవర్‌కు డికాక్ (106) క్లీన్‌బౌల్డ్ అవ్వడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ మలుపుతిరిగింది. ఆ తర్వాత ప్రసిద్ధ్ అదే ఓవర్లో మరో వికెట్ తీసి దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టాడు.
ఇక కుల్‌దీప్ యాదవ్ తన స్పిన్ తో మాయాజాలం చేశారు. 38వ ఓవర్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (29) రోహిత్‌కు క్యాచ్ ఇవ్వగా, మూడు బంతుల వ్యవధిలో మరోసారి చక్కని వికెట్ తీసి మార్కో యాన్సెన్‌ను (17) పెవిలియన్‌కి పంపించాడు. ఈ రెండు వికెట్లతో సఫారీ ఇన్నింగ్స్ పూర్తిగా కుంగిపోయింది. 42వ ఓవర్‌లో కుల్‌దీప్ తన మూడో వికెట్‌గా కోర్బిన్ బాష్ (9)ను ఔట్ చేసి సౌతాఫ్రికాను మరింతగా కుంగదీశారు.
చివరి దశలో లుంగి ఎంగిడి, కేశవ్ మహరాజ్‌లు క్రీజులో ఉన్నా, పరుగులు జోడించే పరిస్థితి కనిపించలేదు. 43 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 252/8గా ఉంది. ఒక దశలో 200/4 వద్ద బాగా కనిపించిన జట్టు, దాదాపు 50 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి కుప్పకూలింది.
డికాక్ సెంచరీతో మొదలైన సఫారీ ఇన్నింగ్స్‌ను భారత బౌలర్లు మధ్య ఓవర్లలో అద్భుతంగా తిరగరాశారు. ముఖ్యంగా కుల్‌దీప్, ప్రసిద్ధ్ కీలక సమయంలో వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా పరుగుల ప్రవాహాన్ని ఆపేశారు.