ఐదు ఓవర్లు, ముగ్గురు బౌలర్లు, ఓ అద్భుత క్యాచ్.. మ్యాచ్ గెలుపు
ఓడిపోతాం అనే దశకు వచ్చేసింది. మహ అయితే మరో 20 నిమిషాలు, ఓ పది బంతులు చాలు క్లాసెన్ కు, మ్యాచ్ ను ముగించడానికి కానీ భారత్ బౌలర్లు, ఫీల్డర్లు మాత్రం ..
By : Praveen Chepyala
Update: 2024-06-30 07:28 GMT
ఓవర్లు గడిచే కొద్ది, లక్ష్యం కరిగిపోతూ వస్తోంది. మ్యాచ్ చేజారి పోతోంది. ‘ఇంకా అంతా అయిపోయింది’ అనడమే మిగిలి ఉంది. అరచేతుల్లో చెమటలు పడుతున్నాయి. నీరసం, నిస్సత్తువ అవహించింది. మరో ఫైనల్ ఓటమి ఖాయమని అంతా అభిప్రాయంలోకి వచ్చేశారు. కానీ మైదానంలో ఉన్న భారత పులులు మాత్రం ఈ ఆలోచన చేయడానికి కూడా సిద్ధంగా లేరు. చివరి ఓవర్ వరకూ పోరాటం చేయడానికి వారంతా నిశ్చయించుకున్నారు. కానీ మ్యాచ్ విషయాలను ఓసారి తలచుకుంటే..
ప్రపంచకప్ లో మొదటి సారిగా ఫైనల్ చేరుకుంది దక్షిణాఫ్రికా, ఎలాగైన కప్ ను గెలుచుకోవాలనే లక్ష్యంతో ఆడారు. మరో ఐదు ఓవర్లు, ముప్పై పరుగులు గట్టిగా ఆడితే ఐదు భారీ షాట్లు అంతే.. మ్యాచ్ ఫినిష్ అవుతుంది. కప్ చేజిక్కుతుంది. పైగా ఇక్కడ ఉన్నది ప్రపంచంలోని పేరు మోసిన హిట్టర్లు క్లాసెన్, డేవిడ్ మిల్లర్. ఈ పొట్టి కప్ లోనే మన జట్టుకు అండగా నిలిచిన స్పిన్నర్లనే లక్ష్యంగా చేసుకున్నారు. వచ్చిన బంతులను వచ్చినట్లు బౌండరీ దాటిస్తున్నారూ ఈ ఇద్దరు మేటీ బ్యాట్స్ మెన్. ముఖ్యంగా అక్షర్, కుల్దీప్ లో బంతులను మంచినీళ్లు తాగినంత తేలికగా స్టాండ్స్ కు పంపిస్తున్నారు. కానీ చివరి ఐదు ఓవర్లలో అద్భుతమే జరిగింది.
క్లిఫ్-హ్యాంగర్
ఐదు ఓవర్లు ముగిసే సమయానికి, భారతదేశం ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయడం సానుకూలంగా కనిపించింది. ఆరంభంలో రెండు వికెట్లు పడ్డా, సౌత్ ఆఫ్రికా మాత్రం బలంగా రేసులోకి వచ్చింది. 15 ఓవర్లు పూర్తి అయ్యే సరికి మ్యాచ్ మొత్తం ప్రత్యర్థి చేతిలోకి వచ్చింది. 30 బంతుల్లోనే 30 పరుగులు చేస్తే కప్ ప్రోటీస్ జట్టుకు వెళ్లేది. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ చాలా కూల్ గా తన పని తాను చేసుకుపోయాడు. వర్షం పడాలనో... సూర్యరశ్మి తగ్గాలి అనో, గాలి బాగా వీయలనో అని కోరుకోలేదు.
నో ఫస్ బుమ్రా
శనివారం మధ్యాహ్నం బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో, దక్షిణాఫ్రికా 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో రోహిత్ బంతిని జస్ప్రీత్ బూమ్రాకు ఇచ్చాడు. భారత్ కు ఇప్పుడు పరుగుల నియంత్రణ, వికెట్లు కూడా అవసరం. అంతకుముందు ఓవర్ లో అక్షర్ పటేల్ బౌలింగ్ లో క్లాసెన్ ఆకాశమే హద్దుగా రెండు ఫోర్లు, రెండు సిక్స్ లతో 25 పరుగులు పిండుకున్నారు.
ఆశలన్నీ బూమ్రాపైనే. మెల్లిగా, చిన్న రన్ అప్ తో తన శక్తి కొలది బౌలింగ్ చేస్తున్నాడు. ఆరు బంతులను ఆరు విధాలుగా సంధించాడు. బూమ్రా బౌలింగ్ లో పరుగుల సంగతి తరువాత ఇద్దరు క్రీజులో నిలదొక్కకోవడానికి ఇబ్బంది పడ్డారు. కేవలం నాలుగు పరుగులే ఇచ్చారు. ఇప్పుడు గెలుపుకోసం 26 పరుగులు కావాలి. అది కూడా 24 బంతుల్లో..
క్రంచ్ సమయం
రోహిత్ మదిలో మరో ప్రశ్న మెదులుతోంది. 17 ఓవర్ ఎవరి చేత వేయించాలి. ఐదో బౌలర్ గా జడేజా, హార్ధిక్ పాండ్యా ఉన్నారు. కానీ క్రీజులో క్లాసెన్ ఉన్నాడు. కాబట్టి పాండ్యా చేతికి బాల్ ఇచ్చాడు. బంతిపై పాండ్యాకు సరిగా నియంత్రణ ఉందా? లేదా అని ఆలోచించలేదు. కానీ మంచి వైవిధ్యంతో బౌలింగ్ చేయగలడు. కెప్టెన్ అంచనాలకు అనుగుణంగా.. అనూహ్యంగా ఆఫ్ స్టంప్ ఆవలగా స్లో డెలీవరీ సంధించాడు పాండ్యా. అది క్లాసెన్ బ్యాట్ ను తాకుతూ పంత్ చేతుల్లో పడింది. అంతే భారత్ గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఇక్కడ కేవలం నాలుగు పరుగులే వచ్చాయి. ఫలితం 18 బంతుల్లో 22 పరుగులు కావాలి.
బుమ్రా చివరి ఓవర్..
హర్ధిక్ బౌలింగ్ లో ప్రమాదకర క్లాసెన్ వెనక్కి వెళ్లాక మ్యాచ్ ఫిఫ్టి ఫిఫ్టి గా మారింది. కానీ 18 ఓవర్ ఎవరికివ్వాలి. బూమ్రాను దించాలా.. లేక అర్షదీప్ సింగ్ ను తీసుకురావాలని అని కాస్త ఆలోచించి ఉంటాడు. కొత్తగా వచ్చిన బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి ఉండాలనే లక్ష్యంతో మరోసారి బూమ్రానే రంగంలోకి దించాడు కెప్టెన్.
అనుకున్నట్లుగానే ఈ ఓవర్ లో బూమ్రా రివర్స్ స్వింగ్ తో చుక్కలు చూయించాడు. ఆల్ రౌండర్ మార్కో యన్సన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే అప్పుడు ఉన్న ఒత్తిడి మాములుది కాదు. ఎంత గొప్ప బౌలర్ అయినా నియంత్రణతో కూడిన బౌలింగ్ వేయకపోతే మ్యాచ్ కాదు కప్పు కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. ఒక వేళ బూమ్రా 18 ఓవర్ లో తీసుకురావడం సరియైన నిర్ణయం కాకపోతే కెప్టెన్ పై నిందలు వేసేందుకు విమర్శకులు ఎప్పుడు సిద్ధంగా ఉండేవారు.
మైండ్ గేమ్స్
ఆరు మ్యాజికల్ డెలివరీలు, రెండు పరుగులు, రివర్స్-స్వింగ్ తో మార్కో యన్సెన్ వికెట్ పడింది. భారత్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ ఓవర్లో బూమ్రా విజృంభణ తరువాత 20 పరుగులు 12 బంతుల్లో సాధించాలి. ఇదేం అసాధ్యం కాదు. కొంచెం ఏదో మూల ఆందోళన. మిల్లర్ ఏం చేస్తాడో ఏమో అని బెరుకు.
16 పరుగుల బహుమతి..
19 ఓవర్ లో మరో హీరో రంగ ప్రవేశం చేశాడు. అప్పటి దాకా మూడు ఓవర్లు బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీశాడు. కానీ ఇప్పుడు వేయబోయేది ప్రపంచంలోని అత్యుత్తమ ఆరుబంతులు అయి ఉండాలి. బంతి ఏ మాత్రం గతి తప్పిన బౌండరీ దాటించడానికి మిల్లర్ ఓ వైపు కాచుకుని ఉన్నాడు. కానీ ఏ బంతికా బంతి వైవిధ్యం అన్నట్లు సంధించిన ఈ యువ పేసర్.. కేవలం 4 పరుగులే ఇచ్చి 19 ఓవర్ ముగించాడు. ఇక చివరి ఓవర్.. ఆరు బంతులు.. 16 పరుగులు. కానీ పాండ్యా దీన్ని ఢిపెండ్ చేస్తాడా?
పాండ్యా ఈ జట్టుకు వైస్ కెప్టెన్, ఇప్పుడు T20Iల నుంచి రోహిత్ రిటైర్మెంట్ తర్వాత కచ్చితంగా కెప్టెన్. అతను ఓ బ్యాలెన్సర్, బ్యాట్‌తో డిస్ట్రాయర్. బంతిని సమర్ధవంతంగా నియంత్రణ చేయగలడా? కప్పును గెలిపిస్తాడా? ఓ సందేహం. ఆ అనుమానం నిజమై, ఆఫ్ స్టంప్ పక్కగా టాస్ బాల్ వేశాడు. క్రీజు లో ఉన్న మిల్లర్ దాన్ని మిడ్ ఆన్ లో గాల్లోకి లేపాడు.
బంతి బౌండరీ దాటినట్లు కామెంట్రీ వినిపిస్తోంది. కానీ అనూహ్యం... అద్భుతం.. స్కై సూర్య అదరగొట్టె విన్యాసంతో బంతిని పట్టుకుని నియంత్రణ కాలేక బౌండరీ లైన్ దాటేశాడు.. అంతకుముందే బంతిని గాల్లోకి విసిరాడు. తిరిగి మైదానంలోకి వచ్చి బంతిని పట్టుకున్నాడు. డేంజరస్ మిల్లర్ పెవిలియన్ చేరాడు.
సూర్య వల్ల ఆరు పరుగులు సేఫ్ అయ్యాయి. ఇంకా విజయం చేకూరలేదు. ఐదు బంతుల్లో 16 పరుగులకు విజయ సమీకరణం మారింది. రబడ క్రీజులోకి వచ్చాడు. వచ్చిరాగనే ఒక థిక్ ఎడ్జ్ తో బంతి బౌండరీకి దూసుకెళ్లింది. నాలుగు బంతుల్లో 12 పరుగులు చేయాలి. కానీ మిగిలిన బంతుల్లో కేవలం మరో నాలుగు పరుగులు ఇచ్చిన పాండ్యా రబడను వెనక్కి పంపి, కప్ ను ఇండియా తెచ్చాడు. వాట్ ఏ అమేజింగ్ మ్యాచ్..