భారత్ వెర్సస్ బంగ్లా చాంపియన్స్ ట్రోపీ 2025 హైలైట్స్

హృదయాలను గెలిచిన హ్రిదోయ్.. మెరిపించిన మహమ్మద్ షమీ;

Update: 2025-02-20 20:38 GMT

నిన్న(20.2.25) దుబాయ్ లో బాంగ్లాదేశ్ తో జరిగిన ఐసిసి ఛాంపియన్ ట్రోఫీ మొదటి మ్యాచ్ లో భారత జట్టు బంగ్లాదేశ్ ను అలవోకగా ఓడించింది. తన రెండో మ్యాచ్ ఈ ఆదివారం(23.2.25) భారత జట్టు పాకిస్తాన్ తో ఆడబోతోంది.

హృదయాలను గెలిచిన-హ్రిదోయ్.. మెరిసిన మహమ్మద్ షమీ

ప్రేక్షకులకు పెద్దగా థ్రిల్లింగా అనిపించని ఈ మ్యాచ్ మొదటి భాగం ఇద్దరు ఆటగాళ్లకు చెందుతుంది. బ్యాటింగ్ తో హ్రిదోయ్, బౌలింగ్ తో మహమ్మద్ షమీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బలమైన జట్టుగా బరిలోకి దిగిన భారత్ బంగ్లాదేశ్ ను మొదటినుంచి కట్టడి చేయ కలిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎన్నుకున్న బాంగ్లాదేశ్ జట్టు ఐదు వికెట్లు త్వరగానే కోల్పోయింది. చాలా రోజుల తర్వాత ఒక ఐసీసీ టోర్నమెంట్ ఆడుతున్న మహమ్మద్ షమీ, బాంగ్లాదేశ్ తక్కువ స్కోరు చేయడానికి ప్రధాన కారకుడు అయ్యాడు. మొత్తం ఐదు వికెట్లు సాధించి, ఐసీసీ స్థాయి టోర్నమెంట్లలో 200 వికెట్లు సాధించాడు. వన్డేలలో, తక్కువ బంతుల్లో(5126) 200 వికెట్లు సాధించి రికార్డు కూడా సృష్టించాడు. తన పునరాగమనాన్ని విజయవంతంగా ప్రారంభించాడు. భారత పేస్ వెన్నెముక బుమ్రా గాయపడంతో కొంత బలహీనమైన భారత పేస్ బౌలింగ్ ను షమీ సమర్థవంతంగా నడిపించగలిగాడు. షమీ తో కలిసి యువ పేస్ బౌలర్ హర్షిత్ రానా కూడా మూడు వికెట్లు సాధించి బాంగ్లాదేశ్ తక్కువ స్కోరు సాధించడానికి సహాయపడ్డాడు. మిగతా రెండు వికెట్లు అక్షర పటేల్ సాధించాడు. స్లిప్ లో రోహిత్ శర్మ క్యాచ్ వదిలేయకపోతే అక్షర పటేల్ హ్యాట్రిక్ సాధించగలిగి ఉండేవాడు,. మొత్తం మీద మొదట తొందరగానే వికెట్లు కోల్పోయినప్పటికీ, బంగ్లాదేశ్ ను కొంతవరకు ఆదుకున్నాడు బ్యాట్స్మెన్ హ్రిదోయ్. చాలా జాగ్రత్తగా ఆడి సెంచరీ చేసి, బాంగ్లాదేశ్ కు ఒక మర్యాదపూర్వకమైన స్కోర్ అందించాడు. 39 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయినప్పటికీ బంగ్లాదేశ్ 228 పరుగులు చేయడానికి కారణం, ఈ ఆటగాడే. చక్కటి ఇన్నింగ్స్ తో బాంగ్లాదేశ్ ప్రేక్షకులతో పాటు, ఇతర ప్రేక్షకుల హృదయాలను కూడా కొంతవరకు గెలుచుకోగలిగాడు.

వర్షం వల్ల బౌలర్లకు లాభించింది

గత రెండు మూడు రోజులుగా వర్షం కురుస్తున్నందున, పిచ్ కొంత బౌలర్లకు సహాయం చేసే అవకాశం ఉందని అనుకున్న విషయం కొంతవరకు నిజమేనని తెలిసిపోయింది. అయితే టాస్ గెలిచి బంగ్లాదేశ్ కెప్టెన్ హుస్సేన్ పంటో బ్యాటింగ్ ఎన్నుకోవడం కొంత ఆశ్చర్యకరమే. ఇది కొంతవరకు అనుభవరాహిత్యమే. బంగ్లాదేశ్ మొదట్లో తడబడి తర్వాత కొంచెం నిలదొక్కుకొని, మంచి స్కోర్ సాగే సమయంలో, మళ్లీ త్వరగా వికెట్ కోల్పోయి చివరకు 229 పరుగుల లక్ష్యాన్ని, బలమైన భారత్ బ్యాటింగ్ ముందు ఉంచింది.

భారత విజయానికి పునాది వేసిన రోహిత్- గిల్

భారత జట్టు ఓపెనింగ్ జంట కెప్టెన్ రోహిత్, ఐసిసి ర్యాంకుల్లో అగ్రస్థానం సాధించిన శుభమన్ గిల్ కలిసి ధాటిగా ఆడుతూ మొదటి పవర్ ప్లే 10 ఓవర్లు ముగిసే సమయానికి 69 పరుగులు సాధించింది. బంగ్లా ఓపెనింగ్ బౌలర్లు ముస్తఫిజూర్, తంజీం పెద్దగా ప్రభావం చూపలేదు. రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ 36 బంతుల్లో 41 పరుగులు సాధించి అదే దూకుడును ప్రదర్శించబోయి అవుట్ అయ్యాడు.

పసలేని బంగ్లాదేశ్ బౌలింగ్

బంగ్లాదేశ్ బౌలింగ్ అంతగా ప్రభావం చూపించలేదు. బౌలర్లకు కూడా ఫలితం ముందే తెలిసిపోయినట్టుంది. భారత బ్యాటింగ్ కూడా నిదానంగా ఆచితూచి ముందు కదిలింది. 20 ఓవర్లలో 5 రన్ రేట్ తో నూరు పరుగులు సాధించడం ఈ విషయాన్ని తెలియపరుస్తుంది. ఎలాగూ గెలుస్తామన్న నమ్మకంతో నడిచిన బ్యాటింగ్, ప్రేక్షకులకు అంతగా ఆసక్తి కలిగించకుండా సాగింది. భారత జట్టు బలమైనది అయినప్పటికీ, బంగ్లా బౌలర్లు ముందే డీలా పడిపోయారు. గట్టి ప్రయత్నం చేసినట్టు అనిపించలేదు. మ్యాచ్ ఎన్ని ఓవర్లలో ముగుస్తుంది, అన్న విషయం మీదనే అందరికీ ఆసక్తి ఉంది తప్ప. మ్యాచ్ ఎవరు గెలుస్తారు అన్న దానిమీద ఎవరికి అప నమ్మకం లేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ మ్యాచ్ ఓడిపోవడం సాధ్యం కాదని ఆటగాళ్లతో సహా అందరికీ తెలిసిపోయింది

చేజారిన అవకాశం

తస్కిన్ బౌలింగ్ లో రాహుల్ ఇచ్చిన క్యాచ్ ను నహిద్ వదిలేయడంతో మ్యాచ్ పై కొంత పట్టు బిగించే అవకాశాన్ని బంగ్లాదేశ్ కోల్పోయింది. తర్వాత అంత మొక్కుబడిగా నడిచింది. మ్యాచ్ భారత్ గెలిచినట్లే. ప్రేక్షకుల ఆసక్తి అంతా గిల్ సెంచరీ చేస్తాడా లేదా అన్న దానిమీద ఉండింది. ఎట్టకేలకు గిల్ సెంచరీ సాధించాడు. 47 ఓవర్లో రాహుల్ కొట్టిన సిక్సర్ తో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో బాంగ్లాదేశ్ పై గెలిచింది

బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్మల్ అనుభవరాహిత్యం

టాస్ గెలిచిన బాంగ్లాదేశ్ కెప్టెన్ నజ్మల్ ఫీల్డింగ్ తీసుకుని ఉంటే మ్యాచ్ లో కొంత థ్రిల్ ఉండేదేమో! మ్యాచ్ గెలిచే అవకాశాలు భారత్ కే ఎక్కువ ఉన్నప్పటికీ, బాంగ్లాదేశ్ 228 పరుగులు చేసినప్పుడే, మ్యాచ్ పోయిందని ఫిక్సయినట్లు బౌలింగ్ చేశారు బౌలర్లు. దాంతో పెద్దగా ఉత్కంఠ ప్రేక్షకులకు కలగలేదు. చప్పగా సాగిన ఈ మ్యాచ్ గిల్ చేసిన సెంచరీ ఒక్కటే ప్రేక్షకులను రంజింపజేసిన విషయం. ఇంతవరకు భారత్ బంగ్లాదేశ్ మధ్య 41 వన్డే మ్యాచ్లు జరగగా, భారత్ 32, బాంగ్లాదేశ్ 8 మ్యాచ్ లు గెలిచాయి. ఒకదానిలో ఫలితం తేలలేదు. ఇప్పుడు ప్రేక్షకుల చూపంతా ఈ ఆదివారం(23.2.25) న జరిగే మ్యాచ్ మీదే ఉంటుంది. ఎందుకంటే భారత్ ఆ మ్యాచ్ ను పాకిస్తాన్ తో ఆడుతుంది. ఇప్పటికే న్యూజిలాండ్ తో ఒక మ్యాచ్ ఓడిపోయిన పాకిస్తాన్, ఈ మ్యాచ్ ను గెలవడానికి విశ్వప్రయత్నం చేస్తుంది.

కొసమెరుపు: భారత దేశ జెండాను కరాచీలో ఎగురవేయకుండా, ఏదో సాకు చెప్పిన పిసిబి, ఆ పొరపాటును చివరకు సరిదిద్దుకోవడం విశేషం. మళ్లీ కరాచీలో భారత జెండా రెపరెపలాడింది..

బంగ్లాదేశ్ బ్యాటింగ్:

228 పరుగులు/10 వికెట్లు (49.4 ఓవర్లు)

హ్రిదోయ్ 100 పరుగులు (118 బంతులు)

జాకీర్ అలీ 68 పరుగులు (114 బంతులు)

భారత్ బౌలింగ్:

షమి 5 వికెట్లు (10 ఓవర్లు)

హర్షిత్ రానా 3 వికెట్లు (7.4 ఓవర్లు)

అక్షర్ పటేల్ 2 వికెట్లు (9 ఓవర్లు)

భారత్ బ్యాటింగ్:

231 పరుగులు/ 4 వికెట్లు (46.3 ఓవర్లు)

గిల్ 101 పరుగులు (129 బంతులు)

రోహిత్ శర్మ 41 పరుగులు (36 బంతులు)

బంగ్లాదేశ్ బౌలింగ్:

తస్కిన్ 1 వికెట్ (9 ఓవర్లు)

ముస్తఫిజూర్ 1 వికెట్ (9 ఓవర్లు)

హుస్సేన్ 2 వికెట్లు (10 ఓవర్లు)

Tags:    

Similar News