‘‘రోహిత్ శర్మ క్రీడాకారుడేనా, అలా ఉన్నాడేంటీ?’’
బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకురాలు, ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ, తొంభై ఎన్నికల్లో ఓడిపోయిన నాయకుడే వాళ్లకి కావాలంటూ సెటైర్లు;
By : Praveen Chepyala
Update: 2025-03-03 11:47 GMT
కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకురాలు భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ పై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడంపై దేశంలో వివాదం రాజుకుంది. దుబాయ్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫి మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే రోహిత్ శర్మ నిన్న న్యూజిలాండ్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ఓ షాట్ సరిగా ఆడలేక పెవిలియన్ చేరాడు. దీనిపై కాంగ్రెస్ నాయకురాలు, ఆ పార్టీ జాతీయ ప్రతినిధి షామా మొహ్మద్ ఎక్స్ లో వివాదాస్పద పోస్ట్ చేశాడు.
‘‘రోహిత్ కెప్టెన్ గా ఆకట్టుకోలేక పోయాడు. ఒక క్రీడాకారుడు లావుగా ఉన్నాడు’’ అని తన పోస్ట్ లో రాసుకొచ్చారు. దీనిపై వివాదం రాజుకోవడంతో తరువాత పోస్టును తొలగించారు.
షామా ఏం చెప్పారంటే..
‘‘రోహిత్ శర్మ లావుగా ఉన్నాడు. బరువు తగ్గాలి. పొట్ట తగ్గించుకోవాలి. దేశం ఇప్పటి వరకు చూడని ఆకట్టులేని కెప్టెన్’’ అని ఆమె రాసింది. మరొక పోస్టులో రోహిత్ ను బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, 1983 ప్రపంచకప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ వంటి వారితో పోల్చి తన వ్యాఖ్యలను సమర్థించుకునే వ్యాఖ్యలు చేశారు. ఇది ఇవన్నీ బాడీ షేమింగ్ అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తరువాత తన పోస్టును తొలగించారు.
‘‘గంగూలీ, టెండూల్కర్, ద్రవిడ్, ధోని, కోహ్లి, కపిల్, శాస్త్రి వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో పోలిస్తే తన ఆటతీరు ఏంటీ? ఒక సాధారణ కెప్టెన్, దేశానికి కెప్టెన్ అయ్యే అదృష్టం పొందిన ఒక సాధారణ ఆటగాడు’’ అని పోస్టులో రాసుకొచ్చారు.
తన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం కావడంతో మరోసారి ఎటువంటి కారణం లేకుండా తనపై దాడి జరిగిందని, ప్రజాస్వామ్యంలో ఎవరినైనా విమర్శించే హక్కు ఉందని చెప్పారు.
‘‘ఒక క్రీడాకారులు ఫిట్ గా ఉండాలని నేను కోరుకుంటాను. అలాగే నమ్ముతాను. కాబట్టి రోహిత్ బరువుగా ఉన్నాడని భావించి దానిపై నేను ట్వీట్ చేశాను. కానీ ఎటువంటి కారణం లేకుండా నాపై ట్రోలింగ్ కు దిగారు. నాకు హక్కులు ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యం. ఇలా చెప్పడంలో తప్పేముంది’’ అని జాతీయ మీడియాతో మాట్లాడుతూ షామా అన్నారు.
కాంగ్రెస్ స్పందన
షామా పోస్ట్ పై జాతీయ స్థాయిలో వివాదం చెలరేగడంతో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇది పార్టీ వైఖరిని ప్రతిబింబించడం లేదని ప్రకటించింది. ఆ పోస్టులు తొలగించమని ఆదేశించింది.
‘‘భారతీయ జాతీయ కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి డాక్టర్ షామా మొమ్మద్ పార్టీ వైఖరిని ప్రతిబింబించని, క్రికెట్ లెజెండ్ గురించి కొన్ని అవనసవర వ్యాఖ్యలు చేశారు’’ అని కాంగ్రెస్ మీడియా ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా అన్నారు.
సంబంధిత పోస్టులను తొలగించమని కోరినట్లు, భవిష్యత్ మరింత జాగ్రత్తగా ఉండాలని ఆమెకు సూచించినట్లు తెలిపారు. ‘‘భారత జాతీయ కాంగ్రెస్ క్రీడా దిగ్గజాల సేవలను అత్యున్నతంగా గౌరవిస్తుంది. వారి వారసత్వాన్ని దెబ్బతీసే ప్రకటనలను ఆమోదించదు’’ అని ఖేరా అన్నారు.
విమర్శలు గుప్పించిన బీజేపీ..
షామా మహ్మద్ వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఆ పార్టీ జాతీయ నాయకుడు షెహజాద్ పూనావాలా స్పందించారు. ‘‘రాహుల్ గాంధీ నాయకత్వంలో 90 ఎన్నికల్లో ఓడిపోయిన వారు రోహిత్ శర్మ కెప్టెన్సీ ఆకట్టుకోలేదని అంటున్నారు. ఆయన నాయకత్వంలో ఢిల్లీలో ఆరుసార్లు డకౌట్ అయ్యారు. కానీ రోహిత్ కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్ గెలిచారు. ఇది అద్బుతం, అతని ట్రాక్ రికార్డు అతని గురించి తెలుపుతున్నాయి.’’ అని ఎక్స్ ఖాతాలో పేర్కొన్నాడు.
‘‘కాంగ్రెస్ ప్రతినిధి అధికార ప్రతినిధి ఇలాంటి ప్రకటన చేయడం చాలా సిగ్గుచేటు. ఇది కాంగ్రెస్ ప్రకటన. ప్రతిదానికి ఒకే వ్యక్తి సరిపోతారని వారు భావిస్తున్నారు. ఆ వ్యక్తే రాహుల్ గాంధీ’’ అని బీజేపీ నాయకుడు ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా అన్నారు.
‘‘వారు దేశాన్ని ఎంతగా వ్యతిరేకిస్తున్నారంటే నేడు మన దేశ క్రికెట్ కెప్టెన్ పై దుర్భాషలాడుతున్నారు. దీని అర్థం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇది నిజంగా సిగ్గుచేటు, నేను దీనిని ఖండిస్తున్నాను. కాంగ్రెస్ మనస్తత్వాన్ని మొత్తం దేశం చూస్తోంది’’ అని ఆయన అన్నారు.
రోహిత్ కు శివసేన(యూబీటీ) మద్దతు..
దీనిపై శివసేన(యుబీటీ) వర్గం ప్రతిస్పందించింది. ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక చతుర్వేదీ రోహిత్ కు మద్దతుగా నిలిచారు. ‘‘నేను క్రికెట్ అభిమానిని కాదు, కానీ ఆటపై నాకు పరిమిత ఆసక్తి ఉన్నప్పటికీ రోహిత్ శర్మ అదనపు పౌండ్ల బరువుతో లేదా లేకుండా భారత జట్టును గొప్ప ఎత్తులకు నడిపించాడని నేను చెప్పగలను.
అతని నిబద్దత ముఖ్యం. ట్రోఫిని గెలవండి ఛాంపియన్ ’’ అని ట్వీట్ చేశారు. షామా వ్యాఖ్యలను తాను, పార్టీ ఆమోదించడం లేదని కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్ అన్నారు. ‘‘నేను వ్యక్తిగతంగా, పార్టీ కూడా ఎవరినీ బాడీ షేమింగ్ చేయడాన్ని ఆమోదించను. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారుడి గురించి మాట్లాడటం సరికాదు. దీనిపై పార్టీ ఆమె నుంచి స్పందన కోరుతోంది’’ అని ఏఎన్ఐకి చెప్పారు.