వైజాగ్ లో ఆరెంజ్ ఆర్మీ టాప్ ఆర్డర్ వర్సెస్ ఢిల్లీ లోయర్ ఆర్డరేనా?

ఐపీఎల్ లో రేపు సన్ రైజర్స్ తో తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్.. అందరి దృష్టి ఆ నలుగురి హిట్టింగ్ పైనే;

Update: 2025-03-29 12:53 GMT
వైజాగ్ ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం

ఐపీఎల్ లో రేపు సూపర్ సండే అవుతుందా? అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లుగా 300 పరుగుల మార్క్ ను ఏదైన జట్టు అందుకుంటుందా? ఎందుకంటే రేపు వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతోంది.

ఇరు జట్లలో హార్డ్ హిట్టర్లకు కొదవలేకపోవడంతో కచ్చితంగా పరుగుల వరద పారుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో బౌండరీ లైన్ దగ్గర ఉంటుంది. దీనితో ఇక్కడ బ్యాట్స్ మెన్ పండగ చేసుకుంటారు. లక్నో- డీసీ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇది మరోసారి నిరూపితమైంది.

బలంగా ఢిల్లీ..
లక్నో తో జరిగిన మ్యాచ్ లో ఓటమి కోరల్లో చిక్కుకున్నఢిల్లీ, అనూహ్యంగా గెలిచి టోర్నీ ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో హార్డ్ హిట్టర్ అశుతోష్ శర్మ, ఆల్ రౌండర్ విప్రజ్ నిగమ్, ట్రిస్టన్ స్టబ్స్ ఆకాశమే హద్దుగా చేలరేగారు.
65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఆశలు వదులుకున్న తరుణంలో ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన స్టబ్స్ మొదట బాదడం మొదలు పెట్టగా, అతని తరువాత వచ్చిన విప్రజ్ నిగమ్ కూడా 250 స్ట్రైక్ రేట్ తో 39 పరుగులు సాధించాడు.
పెద్దగా ఊరు పేరు లేని విప్రజ్ ఎదురుదాడికి దిగడంతో లక్నో బౌలర్లకు ఎలా కట్టడి చేయాలో అర్థంకాలేదు. తన ఫియర్ లెస్ బ్యాటింగ్ బౌలర్లకు చుక్కులు చూపించాడు.
మరో ఎండ్ లో ఉన్న అశుతోష్ శర్మ క్రీజులో కాస్త కుదురుకున్న తరువాత చివరి రెండు ఓవర్లలో ఈ విధ్వంసాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాడు. కేవలం 31 బంతుల్లో 66 పరుగులు సాధించి మ్యాచ్ కు మంచి ముగింపు ఇచ్చాడు. ఇప్పుడు ఢిల్లీ జట్టుకు మరో భారత సీనియర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ జత కలిశాడు.
టాప్ ఆర్డర్ కు స్థిరత్వం..
మొదటి మ్యాచ్ లో వ్యక్తిగత కారణాల వల్ల ఆటకు దూరమైన వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ రేపు హైదరాబాద్ తో వైజాగ్ తో జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉంటున్నాడు.
ఈ విషయాన్ని టీమ్ మేనేజ్ మెంట్ ధృవీకరించింది. దీనితో డీసీ మిడిల్ ఆర్డర్ బలంగా మారుతుందనడంలో సందేహం లేదు. రాహుల్ ను డీసీ మెగా వేలంలో రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ మధ్య జరిగిన ఛాంపియన్ ట్రోఫిలో రాహుల్ కీపింగ్, బ్యాటింగ్ రాణించి టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఫినిషర్ గా తన పాత్రకు న్యాయం చేశాడు.
గత సీజన్ లో ఎల్ఎస్జీ కెప్టెన్ గా వ్యవహరించిన రాహుల్, జట్టును సరిగా నడిపించడంలో విఫలమయ్యాడు. దీనికి తోడు జట్టు యజమాని సంజీవ్ గోయెంకా మైదానంలో రాహుల్ ను అవమానించినట్లు సంజ్ఞలు చేయడంతో అభిమానులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తరువాత రాహుల్ ను వదులుకున్న ఎల్ఎస్జీ పంత్ ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసిన జట్టు పగ్గాలు అప్పగించింది.
లక్నోతో జరిగిన మ్యాచ్ లో డీసీ టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న మెక్ ఫ్రేజర్, డుప్లెస్సిస్ అంచనాలు అందుకోలేకపో యారు. కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నంత సేపు బాగానే ఆడి మంచి ప్రారంభం దక్కించుకున్నా, ఎక్కువ సేపు మైదానలో గడపలేకపోయాడు.
గత సీజన్ లో బాగా రాణించిన యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ అభిషేక్ పొరెల్ ఈ సీజన్ తొలి మ్యాచ్ లో విఫలం అయ్యాడు. అయితే కేఎల్ రాహుల్ రాకతో ప్రస్తుతం జట్టుకు సమతూకం లభించే అవకాశం ఉంది.
ఈ కర్ణాటక బ్యాట్స్ మెన్ కొంత కాలంగా టీ20లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఫార్మాట్ తగ్గట్లుగా తన ఆట తీరు మార్చుకునే సత్తా తనకుందని ఇంతకుముందు నిరూపించుకున్నాడు. ప్రస్తుతం డీసీ కోచ్ అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నాడు.
బలంగా ఉన్న బౌలింగ్
ఢిల్లీ బౌలింగ్ కు స్టార్క్ నాయకత్వం వహిస్తున్నాడు. స్టార్క్ కు తోడుగా సీనియర్ బౌలర్లు మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్ ఉన్నారు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ గత మ్యాచ్ లో ఎల్ ఎస్జీ బ్యాట్స్ మెన్ దూకుడుకు కళ్లెం వేశారు. ఢిల్లీ వరుసగా రెండో మ్యాచ్ కూడా వైజాగ్ లో ఆడటం దానికి కలిసివచ్చే అంశం.
మంచి అనుభవంలో కూడిన బౌలింగ్ లైనప్ డీసీ సొంతం. మొదటి మ్యాచ్ లో లక్నో 260 పరుగులు సాధించేలా కనిపించినప్పటికీ చివర్లో డీసీ బౌలర్లు తమ అనుభవం అంతా ఉపయోగించి బంతులు సంధించడంతో కేవలం ఎల్ ఎస్జీ కేవలం 209 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది.
సన్ రైజర్స్..
రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో విధ్వంసం సృష్టించిన హైదరాబాద్ బ్యాట్స్ మెన్లు, లక్నో తో జరిగిన మ్యాచ్ లో తేలిపోయారు. హర్డ్ హిట్టర్లుగా ముద్రపడ్డ అభిషేక్, ఇషాన్ కిషన్, నితీష్, క్లాసెన్, అనికేత్ వర్మ దూకుడుకు కళ్లెం ఎలా వేయాలో లక్నో బౌలర్లు దాని సొంత గడ్డపైనే చూపించారు.
అలాగే ఈ మ్యాచ్ లో ‘స్టార్క్ వర్సెస్ హెడ్’ పోరాటం మంచి మజా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఇద్దరు ఆస్ట్రేలియన్ లలో ఎవరిది పైచేయి అవుతుందో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
గత సీజన్ లో కూడా దూకుడు మీదున్న ట్రావిస్ ను, కేకేఆర్ తరఫున దిగిన స్టార్క్ మొదటి ఓవర్ లోనే పెవిలియన్ పంపాడు. ఈసారి అదే దూకుడును ఈ లెప్ట్ హ్యాండర్ చూపిస్తాడా.. లేదా హెడ్ మాస్టర్ చెలరేగిపోతాడా అనేది రేపు సాయంత్రం తేలిపోతుంది.
ఒత్తిడిలో ఆరేంజ్ ఆర్మీ
లక్నో తో జరిగిన మ్యాచ్ లో అనూహ్య ఓటమి ఎదుర్కొన్న ఎస్ఆర్ హెచ్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఒపెనర్ ట్రావిస్ హెడ్ మాత్రమే దూకుడుగా ఆడుతున్నాడు. తొలి మ్యాచ్ లో ఇషాన్ కిషన్ సెంచరీ సాధించగా, రెండో మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. క్లాసెన్ మంచి టచ్ లో ఉన్నట్లు కనిపించినా ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. అభిషేక్ శర్మ ఎప్పటిలాగే దూకుడు మంత్రం జపిస్తున్నాడు. దేశవాళీ టోర్నీలో రాణించిన అభినవ్ మనోహార్ తన బ్యాట్ కు పని చెప్పాల్సి ఉంది.
లోకల్ బాయ్ నితీష్ కుమార్..
ఈ మ్యాచ్ లో అందరి దృష్టి ఎస్ఆర్హెచ్ ఆటగాడు నితీష్ పైనే ఉంటుందనడంల సందేహం లేదు. నితీష్ కు వైజాగ్ నేటీవ్ ప్లేస్. ఇక్కడ ఏసీఏ స్టేడియంలోనే తన ప్రస్థానం మొదలైంది. సొంత మైదానంలో కుటుంబ సభ్యులు, ప్రేక్షకుల మధ్య క్రికెట్ ఆడటం ఓ మధురానుభూతి.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫిలో అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన తరువాత నితీష్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిన సంగతి తెలిసిందే. అయితే స్వదేశంలో బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా గాయపడిన ఎన్కేఆర్.. తిరిగి ఐపీఎల్ లోనే మైదానంలో అడుగుపెట్టాడు.
అయితే రెండు మ్యాచ్ ల్లో తనదైన ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు. ముఖ్యంగా లక్నో తో జరిగిన మ్యాచ్ లో పెద్ద షాట్లు ఆడటానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. బంతిని సరిగా మిడిల్ చేయడంలో ఇబ్బంది పడ్డాడు. డీసీతో వైజాగ్ లో జరిగే మ్యాచ్ లో కచ్చితంగా తన బ్యాట్ ఝలిపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
బౌలింగ్ ఎలా ఉంటుందంటే...
ఢిల్లీ జట్టు బౌలింగ్ తో పోలిస్తే ఎస్ఆర్ హెచ్ బౌలింగ్ కాస్త బలహీనంగా ఉందనే చెప్పుకోవాలి. గాయం తరువాత వచ్చిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మహ్మద్ షమీ ఇంకా లయ అందుకున్నట్లు కనిపించడంలేదు. లక్నో తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు.
మరో పేసర్ సిమర్జిత్ సింగ్, స్పిన్నర్లు ఆడమ్ జంపా, అభిషేక్ శర్మ కూడా లక్నో దూకుడును అడ్డుకోలేకపోయారు. ఈ మ్యాచ్ లో తిరిగి ఎస్ఆర్ హెచ్ గాడిన పడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఎలాంటి మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. డీసీ మాత్రం రాహుల్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దించే అవకాశం కనిపిస్తోంది.
ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది.
Tags:    

Similar News