చాంపియన్స్ ట్రోఫీ హైలైట్స్... సెంచరీ తో కదం తొక్కిన కోహ్లీ
సునాయాస విజయంతో పాకిస్తాన్ కథ కంచి కి పంపిన భారత్...;
నిన్న(23.2.25) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు పాకిస్తాన్ ను
సునాయాసంగా ఓడించి సెమీఫైనల్ కి వెళ్ళింది, పాకిస్తాన్ ను ఇంటికి పంపింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్ అలవోకగా నెగ్గి పాకిస్తాన్ ను ఇంటికి పంపించింది. 2017 లో 180 పరుగుల తేడాతో పాకిస్తాన్ తో ఓడిపోయిన భారత జట్టు 2025 ఛాంపియన్ ట్రోఫీ లో ఆరు వికెట్ల తేడాతో నెగ్గి బదులు తీర్చుకుంది.
పాకిస్తాన్ పై భారత్ అధిపత్యం
ఇంతవరకు పాకిస్తాన్ తో 135 వన్డేలు ఆడిన ఇండియా 57 వన్డేల్లో గెలిచింది. పాకిస్తాన్ 73 వన్డేల్లో గెలిచింది. ఐదు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. గత 14 సంవత్సరాల కాలంలో వన్డేలు, t20 లు కలిపి భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన 13 మ్యాచ్ లలో, భారత్ తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది 11 వన్డేల్లో భారత్ 9 గెలిచి రెండు మాత్రమే ఓడింది. రెండు టీ20 లు జరిగితే అందులో భారతే గెలిచింది. ఈ ఆధిపత్యంతోపాటు, ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్, ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో దిగింది. అది పాకిస్తాన్ పై కొంత ఒత్తిడి చూపించే అవకాశం లేకపోలేదు.
అయితే అంతర్జాతీయ స్థాయిలో ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ మెరుగైన రికార్డ్ తో ఉంది. అన్ని టోర్నమెంట్లు కలిపి 21 మ్యాచ్ లు ఆడగా భారత జట్టు 16 మ్యాచ్ లో గెలిచింది పాకిస్తాన్ నాలుగు మ్యాచ్లో గెలవగా ఒకదాంట్లో ఫలితం తేలలేదు. ఇందులో ఐసీసీ అతిపెద్ద టోర్నమెంట్ అయిన ప్రపంచ కప్ లో రెండు జట్లు 8 సార్లు తలపడగా, 8 సార్లు భారతే గెలిచింది. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ టోర్నమెంట్ లో మాత్రం భారత్ రెండు సార్లు గెలిచి, పాకిస్తాన్ మూడుసార్లు గెలిచింది. ఆసియా కప్ టోర్నమెంట్లలో అన్ని ఫార్మేట్ లలో కలిపి ఇద్దరి మధ్య 19 మ్యాచ్లు జరగగా భారత్ పది గెలిస్తే పాకిస్తాన్ ఏడు గెలిచింది, రెండిట్లో ఫలితం తేలలేదు. ఓవరాల్ గా చూస్తే భారత్ దే పై చేయిగా కనిపిస్తుంది.
రాణించని పాక్ బ్యాటింగ్
ఈ 2025 మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎన్నుకుంది. ఎందుకంటే దుబాయ్ లోని అంతర్జాతీయ స్టేడియంలోని పిచ్ కొంతమంది మందకొడిగా ఉన్నట్లుగా, భారత్ బంగ్లా మ్యాచ్ ద్వారా తెలిసింది. బౌలింగ్ కు అనువుగా ఉన్న పిచ్ పైన స్పిన్నర్ ల ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ పాకిస్తాన్ అనుకున్నట్లు ఒక మంచి స్కోరు భారత్ ముందు ఉంచలేకపోయింది
మొదట్లో బాగా ఆడి, మధ్యలో కొన్ని వికెట్లు పోగొట్టుకొని, కొంత బాగా ఆడి, చివర్లో మళ్ళీ వరుస వికెట్ల నష్టంతో మొత్తం మీద 49.4 ఓవర్లలో 241 పరుగుల పోరాడ దగ్గ స్కోర్ సాధించింది పాకిస్తాన్. బలమైన భారత బ్యాటింగ్ ముందు ఈ స్కోరు పెద్ద స్కోరేం కాదు. సాద్ షకీల్ 62 పరుగులు (76 బంతులు) తో పాకిస్తాన్ కొంచెం మర్యాదపూర్వకమైన స్కోర్ చేయడానికి ప్రయత్నం చేశాడు, అతనికి పాకిస్తాన్ కెప్టెన్ రిజ్వాన్ 46 (77 బంతులు) పరుగుల తో స్కోరును ముందుకు సాగించాడు కానీ ఒక బాధ్యత రహితమైన షాట్ తో రిజ్వాన్ అవుట్ కావడం పాకిస్తాన్ కు కొంత ఇబ్బంది కలిగింది. బాగా ఆడుతున్న సమయంలో అక్షర పటేల్ బౌలింగ్లో ముందుకు వచ్చి దూకుడుగా ఆడపోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు రిజ్వాన్. దాంతో పాకిస్తాన్ బ్యాటింగ్ మరింత ఇబ్బందిలో పడింది. తర్వాత షకీల్ కూడా 62 పరుగులు చేసి పెవిలియన్ చేరడం పాకిస్తాన్ కు మరింత ఇబ్బంది కలిగింది. స్కోరు 200 కూడా దాటే పరిస్థితి కనపడలేదు. అయితే ఖుష్ దిల్ 38 పరుగులు (39 బంతులు) చేసి పాకిస్తాన్ ఆమాత్రం అయినా(241) పరుగులు భారత బ్యాట్స్మెన్ ల ముందు ఉంచాడు.
భారత్ బౌలర్లలో మహమ్మద్ షమీ కొంచెం నిరాశపరిచాడు 8 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా సాధించలేకపోయాడు అదే హార్దిక్ పాండ్యా 8 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి2 వికెట్లు తీసుకున్నాడు అది కీలకమైన సమయంలో. ఆశ్చర్యకరంగా కుల్దీప్ యాదవ్ 9 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు అయినప్పటికీ. ఈ మ్యాచ్ లో జడేజా 7.4 ఓవర్లలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇవ్వడమే కాకుండా కీలకమైన తాహిర్ వికెట్ కూడా సాధించాడు. భారత బౌలర్లు కొంతవరకు బౌలింగ్ బాగానే చేసినట్లు లెక్క. మధ్యలో కొంత పట్టును సడలించారని అనిపిస్తుంది. ఇంకా పకడ్బందీగా బౌలింగ్ చేసి ఉంటే పాకిస్తాన్ స్కోరు 200 దాటేది కాదు.
నిలకడ లేని పాకిస్తాన్ బ్యాటింగ్
భారత్ 50 ఓవర్లలో 240 పరుగులు చేస్తే, మ్యాచ్ గెలవడమే కాకుండా, పాకిస్తాన్ టోర్నమెంట్ నుంచి వైదొలిగే అవకాశాలు ఉన్నాయి. నిజానికి భారత్ బౌలర్లు అంత పకడ్బందీగా బౌలింగ్ చేయనప్పటికీ, పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ల నిలకడ లేని, సరైన ప్రణాళిక లేని అస్తవ్యస్తమైన బ్యాటింగ్ పాకిస్తాన్ తక్కువ స్కోర్ చేయడానికి కారకమైంది. రెండో ఇన్నింగ్స్ లో పిచ్ కొంత స్లోగా మారి, బ్యాటింగ్ కు అనువుగా ఉండకపోయే అవకాశాలు కొంతమేరకు ఉన్నాయి గనుక, పాకిస్తాన్ ఒకరకంగా గెలవదగ్గ స్కోరే చేసింది అనుకోవచ్చు.కానీ మంచి బౌలింగ్ తోపాటు, వికెట్ తో కొంత సహాయం లభిస్తే, పాకిస్తాన్ గెలిచే అవకాశాలు కొంతైనా ఉన్నాయి.
రాణించిన శుభమన్ గిల్- శ్రేయాస్ అయ్యర్
భారత్ కూడా తన బ్యాటింగ్ ను దాటిగానే సాగించింది. మొదటి మూడు ఓవర్లలో ఓపెనర్లు రోహిత్ శర్మ శుభ మన్ లు చెరి రెండు బౌండరీలతో 20 పరుగులు చేశారు. షహీన్ ఆఫ్రిది తన మూడవ ఓవర్ లో ఒక చక్కటి యార్కర్ తో రోహిత్ శర్మ ను అవుట్ చేశాడు . జట్టులో ఉత్సాహాన్ని నింపాడు. పాకిస్తాన్ ఆశలను సజీవంగా ఉంచాడు. అయితే వరుసగా కొట్టిన బౌండరీలతో గిల్ తన అభిమతాన్ని పాకిస్తాన్ బౌలర్లకు స్పష్టం చేశాడు. 8 ఓవర్లో నే భారత జట్టు స్కోరు 50 పరుగులు దాటింది . గిల్ తన బ్యాటింగ్ ధాటిని అలాగే కొనసాగించాడు.
జట్టు స్కోరు 10 ఓవర్లలో 64 పరుగులు అయ్యింది. ఈ లెక్కన చూస్తే మ్యాచ్ 40 ఓవర్లలోనే అయిపోతుంది ఏమో అనిపించింది.. ఇంతలో మిడ్ వికెట్ లో పాకిస్తాన్ ఫీల్డర్ సాద్ ఒక క్యాచ్ వదిలేయడంతో పాక్ నిరాశ పడింది. మంచి అవకాశం పాక్ జార విడుచుకుంది. ఇక పాకిస్తాన్ బౌలింగ్ లో ఆ పదును కనపడలేదు. పిచ్ పాక్ బౌలర్లకు సహకరిస్తున్నట్లు అనిపించలేదు.
భారత బ్యాట్స్మెన్లు కోహ్లీ ,గిల్ ఒక్కొక్క పరుగు చేసుకుంటూ పోయారు. బౌలర్లు కూడా కాస్త డీలా పడిపోయారు. పాకిస్తాన్ బౌలర్లు వికెట్లు తీయడం కోసం కాకుండా, పరుగులు చేయకుండా ఆపడానికి బౌలింగ్ చేశారు అనిపించింది . 17 ఓవర్ లోనే భారత జట్టు శతకాన్ని సాధించింది. భారత బ్యాటింగ్ ఇలాగే కొనసాగితే, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ గెలిచే అవకాశం లేకుండా పోయింది. ఇక మ్యాచ్ ను ఎన్ని ఓవర్లలో ముగిస్తారు భారత బ్యాట్స్మెన్లు అన్నది మాత్రమే ఆసక్తికరంగా మారింది. ఇది ఇలా ఉండగానే అబ్రార్ ఒక అద్భుతమైన క్యారం బంతితో గిల్ ను అవుట్ చేశాడు. ఎంత గొప్ప బ్యాట్స్మెన్ అయినా సరే ఆడటానికి ఇబ్బంది పడే బంతి అది. ఆ విధంగా అబ్రార్ మరోసారి పాకిస్తాన్ జట్టులో కొంత ఉత్సాహాన్ని నింపాడు.
పసలేని పాకిస్తాన్ బౌలింగ్
ఇల్లు అలకగానే పండగ కాదన్నట్టు, భారత జట్టులో లో బ్యాట్స్మెన్ లకి కొదవలేదు అన్న సంగతి కూడా పాక్ బౌలర్లకు తెలుసు అయినా వారు కొంత ఉత్సాహంతో బౌలింగ్ చేశారు.స్పిన్నర్ అబ్రార్ చక్కటి బౌలింగ్ తో పాకిస్తాన్ ఆశలను సజీవంగా ఉంచాడు. ఈ దశలో భారత బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఆడుతూ వచ్చారు. ఈ దశలో ఓవర్ కి నాలుగు పరుగులు వచ్చిన భారత జట్టు గెలుస్తుంది . ఆ సంగతి రెండు జట్లకి తెలుసు. ఈ దశలో పాకిస్తాన్ జట్టు బౌలర్లు వికెట్ కోసం శతవిధాల ప్రయత్నం చేశారు.
చిన్నచిన్నగా ఒక్కో అడుగు వేస్తూ భారత జట్టు విజయం వైపుకు వెళుతుండగా, పాకిస్తాన్ బౌలర్లు మాత్రం ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. పాకిస్తాన్ ప్రేక్షకులు వికెట్ కోసం ఎదురు చూశారు. వికెట్ అయితే పడలేదు గాని, విరాట్ కోహ్లీ మాత్రం తన అర్థ శతకాన్ని 62 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. పాక్ బౌలర్లలో ఆశలు సన్నగిల్లాయి. ఒక్క వికెట్ కోసం చకోర పక్షుల లాగా అందరూ ఎదురు చూశారు. మ్యాచ్ క్రమంగా తమ చేతిలోంచి జారిపోతుందని వాళ్లందరికీ అర్థం అయిపోయింది. బౌలింగ్ లో వాడి తగ్గిపోయింది.
సెంచరీ తో కదం తొక్కిన కోహ్లీ-
ఈ దశలో మిడ్ వికెట్ లో సాద్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్ ను వదిలేయడంతో పాక్ మ్యాచ్ ను వదిలేసినట్టు అనిపించింది. ఇక మ్యాచ్లో కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా అన్న ఆసక్తి మాత్రం మిగిలిపోయింది. దాంతోపాటు అయ్యర్ 50 పరుగుల కూడా కోసం ప్రేక్షకులు ఎదురు చూశారు. పాకిస్తానీ ఆటగాళ్ల శరీర భాష ఈ విషయాలను చెప్పకనే చెప్పింది ఏదైనా మహా అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ మ్యాచ్ గెలవడం అసాధ్యమని తేలిపోయింది.
కోహ్లీ క్రమంగా శతకం వైపు వెళ్లిపోయాడు. మ్యాచ్ ఫలితం ఎలాగూ తెలిసిపోయింది కాబట్టి అందరూ కోహ్లీ శతకం కోసం ఎదురుచూశారు. ఈలోపు భారత జట్టు 200 పరుగులు పూర్తిచేసుకుంది, 36 ఓవర్లలో. శ్రేయాస్ అయ్యర్ కూడా తన అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు,
సెమీఫైనల్ చేరిన భారత్
ఇక మ్యాచ్ ఎన్ని ఓవర్లలో పూర్తి చేస్తారు అన్న ఆసక్తి మిగిలిపోయింది. శ్రేయాస్ అయ్యర్ ఒక అద్భుతమైన క్యాచ్ కు అవుట్ అయినప్పటికీ , పాకిస్తాన్ ప్లేయర్లు సంబరాలు చేసుకోలేదు. అంటే అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ కథ కంచికి చేరిందని. తర్వాత హార్దిక్ పాండ్యా అవుట్ అయినప్పటికీ కూడా పాకిస్తాన్ జట్టు లో సెలబ్రేషన్స్ లేవు. భారత జట్టు ఆడుతూ పాడుతూ, 242 పరుగుల వైపు నడుచుకుంటూ వెళ్ళింది. చివర్లో కోహ్లీ సెంచురీ ప్రమాదంలో పడింది. కొంత డ్రామా నడిచింది. చివరి బంతికి కోహ్లీ నాలుగు పరుగులు చేస్తే సరిపోతుంది. ప్రేక్షకులను అలరిస్తూ కోహ్లీ బౌండరీ సాధించి, సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
న్యూజిలాండ్ తో ఒక మ్యాచ్ ఇంకా మిగిలి ఉన్నప్పటికీ, భారత్ సెమి ఫైనల్ చేరినట్లే. ఆతిథ్య దేశమైన పాకిస్తాన్ నిరాశతో వెనుతిరిగింది.