ఐదు రోజుల నుంచి 5 గంటల వరకు...క్రికెట్ జర్నీ

భారతదేశంలో క్రికెట్ ఒక ఆట మాత్రమే కాదు, అత్యంత లాభదాయకమైన వ్యాపారం కూడా;

Update: 2025-01-23 10:23 GMT

క్రికెట్... ఈ ఆట గురించి తెలియని మనిషి ఉండడు. ఎక్కడో ఇంగ్లాండ్ దేశంలో సరదాగా ఆడుకున్న ఆట.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, సీరియస్ ఆటగా.. ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. లక్షల కోట్ల రూపాయల స్థాయికి చేరిన వ్యాపారం ఇది. ఒకప్పుడు ఐదారు దేశాల కు మాత్రమే పరిమితమైన ఈ ఆట ఇప్పుడు అమెరికా, గల్ఫ్ దేశాలతో సహా దాదాపు ప్రపంచంలో అన్ని దేశాలకు పాకింది. రేడియోలో కామెంట్రీ వినడంతో మొదలైన ఈ ఆట ఇప్పుడు అరచేతిలో సెల్ ఫోన్లో ఎక్కడైనా చూసుకోగలిగే స్థాయికి ఎదిగింది. ఒకప్పుడు సినిమా థియేటర్లలో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఓ మూడు నిమిషాలు ట్రైలర్ గా చూపిస్తున్నారని తెలిసి, ఆ సినిమా బాగా లేకపోయినా కేవలం మూడు నిమిషాల కోసం సినిమా చూసేవాళ్ళు. ఇప్పుడు టీవీల్లో రకరకాల యాంగిల్స్ లో క్రికెట్ ను చూడగలుగుతున్నారు. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ క్రికెట్, ఐదు గంటల టి20 మ్యాచ్ గా మారిపోయిన ప్రస్థానం ఆశ్చర్యకరంగా ఉంటుంది. పొడవైన ఈ ఆట, పొట్టిగా మారడానికి అంకురార్పణ జరిగింది 1971 ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సిరీస్ లో. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ మొదటి మూడు రోజులు వర్షం వల్ల జరగలేదు. దాంతో అధికారులు 40 ఓవర్ల వన్డే మ్యాచ్ ప్రేక్షకుల కోసం ఆడించారు. ఆ మ్యాచ్ ను ఆస్ట్రేలియా జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది! దాని తర్వాత మొదటి ప్రపంచ వన్డే కప్ 1975లో ఇంగ్లాండ్లో జరిగింది. వెస్టిండీస్ ఆ కప్పును గెలుచుకుంది. 1983లో కపిల్ సాధ్యంలోని భారత జట్టు ఆ కప్పును గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఆ చారిత్రాత్మక విజయం భారతదేశంలో క్రికెట్ పిచ్చిని పెంచేసింది.

1975లో మొదటి వన్డే ప్రపంచ కప్ తర్వాత 50 ఏళ్లుగా క్రికెట్ ఆటలో ఎన్నో మార్పులు జరిగి.. ఐదు రోజుల టెస్ట్ క్రికెట్ ఐదు గంటల t20 గా రూపాంతరం చెందింది.

ఒకప్పుడు క్రికెట్ ఇష్టం ఉన్నవాళ్లు, టాలెంట్ ఉన్నవాళ్లు మాత్రమే దానిలోకి వచ్చేవారు. ఇప్పుడు క్రికెట్ అన్ని వృత్తుల లాగే ఒక లాభదాయకమైన వృత్తిగా మారిపోయింది. క్రికెటర్ కావాలనుకునే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. భారతదేశంలో క్రికెట్ ఒక వృత్తి మాత్రమే కాదు, అత్యంత లాభదాయకమైన వ్యాపారం కూడా. ఇప్పుడు క్రికెట్ ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల వ్యాపారం. భారతదేశంలో ఒక నానుడి ఉంది " క్రికెట్ మా మతం అయితే.. సచిన్ మా దేవుడు" (If cricket is our religions.. sachin is our god") అన్నది. దీన్నిబట్టి క్రికెట్ భారత్ దేశంలో ఎంత గా ఇంకిపోయిందో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో క్రికెట్ కోసం ఒక BCCI(Board of Control for cricket in India) సంస్థ ఏర్పడింది. గత సంవత్సరం (2023-2024) బీసీసీఐ ఆదాయం 18,700 కోట్ల రూపాయలు అంటే ఈ దేశంలో క్రికెట్ ఎంత పెద్ద వ్యాపారమో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆట భారతదేశంలో యువతపై, వ్యాపార వర్గాలపై, మొత్తం ప్రజలపై ఎంత ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

క్రికెట్లో ఇప్పుడు ఎన్నో రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రసారాలు, ప్రకటనలు, ఆట ఆడడానికి అవసరమైన బ్యాట్లు, బంతులు, ఇతర ఉపకరణాలు, ఇప్పుడు కాసులు కురిపించే వ్యాపారాలు. ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకు పరిమితమై, సరదాగా మొదలైన ఆట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లాభదాయకమైన ఆటగా మారిపోయింది.

" 11 మంది మూర్ఖులు ఆడితే, 11 మిలియన్ల మూర్ఖులు చూసే ఆట క్రికెట్( cricket is a game played by 11 fools and watched by 11 million fools" అని ప్రముఖ రచయిత బెర్నార్డ్ షా ప్రవచించిన క్రికెట్ ఆట ఇప్పుడు కొంతమంది యువతకు ఒక వృత్తి, చాలామందికి వ్యాపార మార్గం, లక్షల మందికి బతుకు తెరువు, కోట్ల మందికి కాలక్షేపం.

.

కొన్ని దేశాల్లో మాత్రమే ఆడే క్రికెట్ ప్రాచుర్యం పొందడానికి కారణం. అది ఇంగ్లాండ్ లో పుట్టి పెరగడం. బ్రిటిష్ ఆధిపత్యం ఉన్న దేశాల్లో, ఒక విధంగా దాన్ని బ్రిటిష్ పాలకులు వ్యాప్తి చేయడానికి కృషి చేయడమే మొదటి కారణం. దాని తర్వాత చాలా దేశాల్లో అది పాతుకుపోయినప్పటికీ భారతదేశంలో ఇంతకు ముందు చెప్పినట్లు ఒక మతంగా మారిపోయింది. ఇప్పుడు భారతదేశంలో యువతలో అధిక ప్రధానమైన ఆటగా, టైం పాస్ గా మారింది. భారతదేశంతోపాటు ఏ దేశంలో అయినా సరే క్రికెట్ అంటే ఏమిటి అని అడిగేవాడు ఈ భూగోళానికి సంబంధించిన వాడు కాదని సరదాగా అంటుంటారు.

మనదేశంలో కబడ్డీ వంటి ఆట ఒకప్పుడు పల్లెల్లో, పట్టణాల్లో కూడా ప్రాచుర్యంలో ఉండేది. మన దేశంలో హాకీ కూడా ఒకప్పుడు వెలుగు వెలిగింది. ఒలింపిక్స్ లో హాకీలో భారతదేశం తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు ఈ రెండు ఆటలను (దాంతోపాటు బిల్లంగూడు, చిల్లికట్ట, సబ్జా, కుంట్యాట అలాంటి వాటిని కూడా) క్రికెట్ మింగేసింది. ఒకప్పుడు గల్లీలో కనబడిన ఆటలు మాయమై, గల్లీ క్రికెట్ ప్రధానమైన ఆట అయింది.

టెస్ట్ క్రికెట్ నుంచి టి 20 వరకు రావడానికి కారణం, కాలానుగుణంగా మారుతున్న తరాలు. క్రికెట్ ఆట నిజానికి ఫుట్ బాల్,హాకీ, కబడ్డీ లాగా బలమైన ఆట కాదు. అది కొంత నైపుణ్యానికి సంబంధించిన ఆట. దాన్ని పత్రికారంగం, టీవీలు పాపులర్ చేశాయి. దాంతో అందరూ దాని పట్ల ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా టీవీ, రేడియో లాంటి ప్రసార రంగాలు, న్యూస్ పేపర్లు దాన్ని ప్రజల్లోకి చొచ్చుకుపోయేలాయి చేశాయి.

యువత కు ఇప్పుడు ఐదు రోజుల ఆట అన్నది ఇష్టం ఉండదు. అంత టైము ఒకదానిమీద కేటాయించలేని తరం, త్వరగా అయిపోవాలని కోరుకునే యువత పొడవైన టెస్ట్ క్రికెట్ ని, పొట్టిదైనా టి20 లాగా మార్చేసింది. ఏదైనా సరే వేగంగా ఉండాలి. ఎక్కువసేపు దేన్నీ చూసే, చేసే ఆసక్తి ఇప్పుడు యువతకు లేదు. ప్రపంచం పరుగులు పెడుతుంది, ముఖ్యంగా యువత. కులాసాగా చాలా తీరికగా చేసేవి ఏవి యువతకు నచ్చవు.

ఇక రెండో అంశం వ్యాపారానికి సంబంధించింది. ఐదు రోజుల ఆట అంత లాభదాయకమైన ఆట కాదు వ్యాపారస్తులకి. ప్రతి సంవత్సరానికి రెండు మూడు సార్లు మాత్రమే ఉండే టెస్ట్ సిరీస్ లు అంతా ఎక్కువ లాభాన్ని ఇచ్చేవి కావు. అందుకే సంవత్సరం పొడుగుతా భారత దేశ ప్రజలకు మతం తర్వాత అంత పిచ్చి ఉండే క్రికెట్ ను ఎక్కువగా ఆడిస్తే లాభ సాటిగా ఉంటుంది. అందుకే మన దేశంలో ఐపీఎల్ మొదలైంది. వేల కోట్లు కురిపిస్తోంది. 365 రోజులు టీవీలో ఏదో ఒక క్రికెట్ టోర్నమెంట్ లేని రోజు లేదు. అయితే ఐదు రోజులపాటు ఒకటే నడిస్తే మైదానంలో ప్రేక్షకులు ఉండరు, టీవీలో కూడా చూడరు. అదే టి20 అయితే నాలుగైదు గంటల్లో అయిపోతుంది. అనధికారంగా జరిగిన, జరుగుతున్న బెట్టింగు, గతంలో క్రీడా రంగాన్ని ఊపేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా కూడా కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి.

ఇక ఐపీఎల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి ఒకసారి వేలంపాటలో భారతీయ, ఇతర దేశాల క్రికెట్ ఆటగాళ్లను వ్యాపార సంస్థలు కోట్ల రూపాయలకు పెట్టి వేలంలో కొనుక్కొని నడిపించే ఈ టోర్నమెంటు, బీసీసీఐ తో పాటు అయా వ్యాపార సంస్థలకు, ఇతరులకు కూడా కనక వర్షం కురిపించే కల్పతరువు. ప్రతి ఏడాది ఓ నెలపాటు జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల కు కూడా లాభదాయకమే. ఇతర దేశాల ఆటగాళ్లు వారి దేశాల్లో జరిగే దేశవాళీ టోర్నమెంట్ లతోపాటు, టెస్ట్ మ్యాచులు వన్డే మ్యాచ్లు కూడా ఆడకుండా ఐపీఎల్లో ఆడడం మనం చూస్తున్నాం.

50 ఏళ్ల క్రితం రేడియోలో వింటూ ఆనందించిన క్రికెట్ అనే ఆట ఇప్పుడు వివిధ రూపాలను సంతరించుకొని కొన్ని వర్గాలను అలరించడం మనం చూస్తున్నాం.

ఐదు రోజుల క్రికెట్ ఐదు గంటలకి టి20 రూపంలో కుదించబడిన తర్వాత, ఇప్పుడు క్రికెట్ వ్యాపారస్తుల(కొంతవరకు ప్రజలు కూడా) చేతిలో పడి భవిష్యత్తులో టి10 టోర్నమెంట్లు, టి5 ఓవర్ల టోర్నమెంట్లు... చివరికి ఒక ఓవర్ టోర్నమెంట్ లు గా రూపాంతరం చెందటం ఎంతో దూరం లేదేమో అనిపిస్తుంది.! మనదేశం తో పాటు ఇతర దేశాల్లో కూడా అలా జరగడం మొదలైతే ఆశ్చర్యం లేదు.

Tags:    

Similar News