సాయిబాబా విషయంలో న్యాయశాస్త్రం తలకిందులైంది...

న్యాయాన్ని బతికించాల్సిన పని లేదు, శిక్ష అవసరం లేదు, కేసు విచారణను పెండింగ్ లో పడేస్తే చాలు, నిర్దోషైనా హాయిగా చస్తాడనే సరికొత్త ‘న్యాయం అమలులో ఉందనుకోవాలా?.

Update: 2024-10-16 08:18 GMT

న్యాయశాస్త్ర విద్యార్థుల ఏమనుకుంటున్నారంటే ముందు నేరారోపణ చేస్తారు,ఆ పైన చార్జ్ షీట్ ఇవ్వడం, తర్వాత కోర్టులో క్రిమినల్ కేసుపై కొన్నేళ్లు విచారణ అంటే ట్రయల్, ఆ తర్వాత అప్పీళ్లు, కొన్ని సంవత్సరాల తరువాత శిక్ష పడుతుందని.

న్యాయ సిధ్ధాంతాలు, జ్యూరిస్ ప్రుడెన్స్ అనే న్యాయవిజ్ఞాన తత్వం ఆధారంగా శిక్ష పడుతుందని అని భావిస్తారు.

ఈ క్రమంలో నిజమైన హంతకులు తప్పించుకన్నా ఒక్క నిర్దేషినకైనా శిక్ష విధించకూడదనేది జరుగుతుందని అనుకుంటారు. సాయిబాబ గురించి ఏం చెప్పగలం? ఇక్కడంతా తారుమారయింది.

ఆరోపణ కన్నా ముందు, నిరూపణ కన్నా ముందు ప్రాసిక్యూషన్న కన్నా ముందు ‘శిక్ష’ విధించారు. పదేళ్ల భయంకరమైన శిక్ష అనుభవించి, ఒంటరి జైలు జీవనం కూడా సాగిన తరువాత, సాయిబాబ నిర్దోషి అనే తీర్పు ఇచ్చి జైలు నుంచి విడుదల చేయమన్నారు.

ఏ న్యాయ విజ్ఞాన తత్వం (Jurisprudence) గురించి ఆలోచించాలో, ప్రపంచంలో ఎక్కడ ఏపాఠాలు ఇప్పుడు నేర్చుకోవాలో అర్థంకాదు. మధ్యలో నిర్దోషులన్నారు, తరువాత కాదు కాదు దోషులన్నారు. మళ్లీ విచారణలన్నారు. పోనీలే, చివరికి న్యాయం జయిస్తున్నదని అంటూ ఉంటే స్టే లతో ఆపడం. ఈ మధ్యలో ముద్దాయి ‘సజీవంగానే’ ఉంటున్నాడని అనుకుంటున్నారా? సజీవంగా ఉన్నా చావుదారిలో ఉన్నాడా లేదా అని తెలుసుకుంటున్నారు. మరి కొన్ని సంవత్సరాలు ఈ మరణ శిక్ష ను కొనసాగించడానికి స్టే అనే అధికారాన్ని వాడుకోవడం చూస్తే అన్యాయం కూడా ఆశ్చర్యపోతున్నది.

పాపం, నేను ఇంతకాలం బతుకుతానని జైలు అధికారాలు అనుకోలేదని సాయిబాబాకూడా అన్నాడు. న్యాయాన్ని బతికించాల్సిన అవసరం లేదు, శిక్ష అవసరం లేదు, కేసును విచారణను పెండింగ్ లో పడేస్తే చాలు, నిర్దోషైనా సరే హాయిగా చస్తాడు అనే సరికొత్త ‘న్యాయసిద్ధాంతం’ అమలులో ఉందనుకోవాలా?.

సాయిబాబా నిర్దోషి అన్న బాంబే హైకోర్టు తీర్పుకు విలువ ఉండాలి కదా? నిర్దోషి అని తీర్మానించిన తరువాత జైలులోనే ఉంచేందుకు ప్రయత్నించడం అంటే ఈ వ్యక్తిని ‘‘చట్టం ద్వారా ఉరి తీయకుండానే ఉసురు తీసుకోవడం’’ కాదా?

మనకు తెలిసిన న్యాయం పోయింది. న్యాయా శాస్త్రాల పాఠాలు పనికిరాకుండా పోతున్నాయి. రేపు కొత్తగా సంస్కరణ అనబడే కొత్త, సరికొత్త ‘‘క్రిమినల్’’ 2023 చట్టాలను ఏ విధంగా అమలు చేయాలో తెలుసుకునేందుకు ఈ కేసు ఒక ప్రయోగంగా వాడుకుంటున్నారా?

సాయిబాబాగారు ఒక్కరు మాత్రమే కాదు, మొత్తం అయిదు మందీ నిర్దోషులని తీర్పు చెప్పారు. ఇది చాలా ప్రధానమైన అంశం. అంతకుముందు ఆయన్ను ఉద్యోగం తీసేసారు. జీతం లేదు. మరి బతికేందుకు డబ్బు ఎవరిస్తారు? ‘‘అనారోగ్య కారణం మీద బెయిల్ ఇవ్వడం సరికాదు’’ అని న్యాయ కోవిదులు బల్లలు బద్దలుకొట్టేస్తుంటే వాదోపవాదాలు చేస్తూ ఉంటే పాపం కింది జడ్జిలు భయపడకుండా ధైర్యంగా ఉంటారా? పైస్థాయిలో ఉన్న న్యాయమూర్తులు న్యాయం చేసేదాకా అందరం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేసుకోవలసిందే తప్ప ఏంచేయగలరు. దేవుడు రక్షించాల్సిందే, రాజ్యాంగం కాదు, ఆర్టికిల్ 21 కాదన్నమాట!

సుప్రీంకోర్టు అప్పీలు లేకపోతే మన భారత దేశంలో న్యాయమే ఉండదను కోవాలి. సుప్రీంకోర్టు తదితర కోర్టులు నిజంగా న్యాయాన్ని బతికిస్తున్నయడానికి, సాయిబాబా కేసులో ముందూ వెనుకలు, విజయాలు అపజయాలు ఒక ఉదాహరణ.

విధికి విద్యుక్త ధర్మానికి మధ్య

విధికి, విద్యుక్త బాధ్యతలు కలిగిన ప్రభువులకు దయ ఉండదు. నిర్దయగా జైళ్లలో పడేస్తారు.దానికి అండంగా రోగాలు వచ్చి చేరతాయి. ఐదేళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. రెండు కాళ్లూ నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచీ ఆయన వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. విధిని ఏమీ ప్రశ్నించలేం. 2014 నుంచి జైలులోనే ఉన్న సాయిబాబా రకరకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ తదితర సమస్యలు తగిలాయి . మరోవైపు ఆయనకు హృద్రోగ సమస్యలు కూడా ఉన్నాయి. చట్టాలకే కాదు, కరోనాకు కూడా కరుణ లేదున సాయిబాబాను అన్యాయపు శిక్షకు గురి చేసింది. ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు విరసం నేత వరవరరావు విషయం లో ఇదే జరిగింది. ఆరోగ్య విషయంలో వారి బంధువులు, అభిమానులు ఎంత తీవ్ర ఆందోళన చెందారు. జైలులో ఇవ్వాల్సిన వైద్య సదుపాయాలు ఇవ్వట్లేదని, కావాలని సాయం నిరాకరించి ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఎవరికి చెప్పుకోలేకపోయారు.

అండర్ ట్రయిల్ హక్కులు లేవా?

ఆ మధ్య అండర్ ట్రయల్ ఖైదీలను కరోనావైరస్ పేరుతో చంపేయడానికి కుట్ర చేస్తున్నారని అనేక మంది కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధపడుతూ ఉన్నారు. ఈ అనుమానాలకు, ప్రశ్నలకు ఎవరు జవాబు ఇస్తారా? సుప్రీంకోర్టులో , పార్లమెంట్ లో , జాతీయ సదస్సుల్లో పెద్దలు, రాజ్యాంగ అధికారాలు కలిగిన వారు, ఖైదీల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు ఉన్నాయని హామీ ఇస్తూనే ఉంటారు.

కేసుల్లో తీవ్రత దృష్ట్యా పైబడిన వయసు, అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వకూడదని న్యాయస్థానాల్లో ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. రెండు సమస్యలకు తేడా ఉంటుందని న్యాయవాదులు వివరిస్తున్నపుడు, ఆ సలహాలు విన్నపుడు న్యాయం జరుగుతుందని ఆశపుడుతుంది.

పదేళ్ల కింద చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA : Unlawful Activities Prevention Act) కింద 2014లో సాయిబాబాను అరెస్ట్ చేశారు. మావోయిస్టు సంస్థలతో సంబంధాలున్నాయంటూ అనేక అభియోగాలు మోపారు. (సంబంధం ఉందనే అనుమానమే ఆరోపణ, వ్యవస్థకు వ్యతిరేక చర్యలుచేసారనే సాక్ష్యాలు లేనే లేవు.)

దోషి అన్నది కింది కోర్టు తీర్పు

కేసును విచారించిన మహారాష్ట్రలోని గడ్చిరోలి సెషన్స్ కోర్టు యూఏపీఏలోని 13, 18, 20, 39 సెక్షన్ల కింద సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని దోషులుగా తేలుస్తూ 2017లో తీర్పు చెబుతూ జీవిత ఖైదు విధించింది. కనీసం అప్పీలు అవకాశం ఉంది కనుక ఇది అన్యాయమనే అనే చాన్స్ దొరికింది. రాజ్యాంగపు ఆర్టికిల్ 21, 22 ఇచ్చిన భరోసా ఇది.

నిర్దోషి అని తీర్పు

మన అదృష్టం కొద్దీ ఆ ఏడాది 2022 అక్టోబర్ 14న బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ సాయిబాబా పై పెట్టిన కేసును కొట్టివేసింది. నిందితులను విడుదల చేయాలంటూ తీర్పునిచ్చింది. సరైన ఆధారాలూ లేవని చెప్పింది. కమ్యూనిస్టు లేదా నక్సలైట్ సాహిత్యాన్ని ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడం, ఏదైనా భావజాలానికి మద్దతుదారుగా ఉండడం యూఏపీఏ చట్టం కిందకు రాదని పేర్కొంది. ఇంకేంకావాలి. కాని మనకు న్యాయానికి ప్రభుత్వం అడ్డంగా నిలుస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి ‘న్యాయం’ అంటే చాలా ఇష్టం. సాయిబాబా కేసును కొట్టేయడం న్యాయం కాదని భావించింది. ఈ కేసులో న్యాయాన్ని రక్షించాలని సుప్రీంకోర్టును అర్థించింది.

స్టే గండాలు

కేసును విచారించిన సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పును సస్పెండ్ చేసి, నిందితుల విడుదలపై స్టే విధించింది. అప్పుడు దీనిపై మరోసారి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది.

మళ్లీ నిర్దోషి అని సుప్రీంకోర్టు తీర్పు

ఇపుడు హైకోర్టు ధర్మాసనం మరోసారి గడ్చిరోలి సెషన్స్ కోర్టు తీర్పును కొట్టివేసింది. ఈ తీర్పుపై ప్రాసిక్యూషన్ స్టే కోరలేదు. ఇంకా సాయిబాబా నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో లోనే ఉంచారు. ఆయన భార్య వసంత, మిత్రులు సంతోషించారు. అంతకు ముందు 2017లో సాయిబాబాతో పాటు ఇతరులను దోషులుగా నిర్ధారిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులు జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ఎస్ఏ మెంజెస్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో అప్పీల్ చేసుకొనే వరకు రూ. 50,000 పూచీకత్తుతో నిందితులను బెయి‌ల్‌పై విడుదల చేయవచ్చని కూడా మరో ఆనందకరమైన తీర్పు చెప్పింది.

అమాయకుడు, నిర్దోషి కూడా అని 2024 తీర్పు

పదేళ్లపాటు జైలులోనే ఉన్న సాయిబాబా 2024 మార్చిలో నిర్దోషిగా విడుదలయ్యారు. ఆ ఆనందం అందుకునే సమయానికే సాయిబాబాకు అనారోగ్యం ముదిరింది. 2024 మార్చి నెల 28వ తేదీన గాల్‌బ్లాడర్ తొలగించి స్టంట్ వేసిన చోట చీము పట్టింది. తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, హైఫీవర్‌తో బాధపడ్డారు. డాక్టర్లు చీము తొలగించినప్పటికీ ఆయన తీవ్ర నొప్పితో బాధపడుతున్నారని భార్య వసంత చెప్పారు. కుమార్తె మంజీరా ఏం చేయగలదు?

ఈ జైలుజీవనంలో, అధికారులు కార్యక్రమాల వల్ల కోల్పోయిన ‘‘ఆరోగ్యాన్ని’’, తగిలించిన ‘‘రోగాలను’’ సవరిస్తారా; సంస్కరిస్తారా? సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ గారు న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై నిలదీస్తున్నారు. కోల్పోయిన సాయిబాబా ఆరోగ్యాన్ని ఎవరిస్తారని బందువులే కాక, సమాజం కూడా అడగాలి కదా? సమాజానికి వచ్చిన రోగాలను కొట్టివేసి తిరిగి ఆరోగ్యాన్ని ఎప్పుడిస్తారని ఇందిరా ప్రశ్నించారు.

ఆమె నాగ్‌పూర్ బెంచ్ తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. కానీ, ఎంత కాలానికి వచ్చిందీ తీర్పు? ఆనారోగ్య పరమైన నష్టానికి బాధ్యులెవరు? న్యాయస్థానాలా? అందరూ అడగవలసి ప్రశ్న. సిగ్గుపడాల్సిన నిజమైన ‘‘విషం’’. బెయిల్ కోసం ఎందరు ఎన్నాళ్లు ఎదురుచూడాలి? వారి స్వేచ్ఛను హరించడం వల్ల కలిగిన నష్టానికి పరిహారం ఎవరు చెల్లిస్తారు? ఎంత అని లెక్కించగలరా?

తనని అరెస్టు చేయలేదు "కిడ్నాప్" చేశారు, తన నోరూమూయించడానికి కిడ్నాప్ చేశారని ‘మాట్లాడటం’ ఆపకుంటే ఏదో ఒక తప్పుడు కేసులో అరెస్ట్ చేస్తామని అధికారులు ముందే హెచ్చరించారని సాయిబాబా అన్నారు.

అరెస్టు సమయంలో మహారాష్ట్ర పోలీసులు తనను వీల్‌చైర్‌లోంచి బయటకు లాగారని, ఫలితంగా తన చేతికి తీవ్ర గాయం అయ్యిందని, అది అతని నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపిన్నదని కూడా అన్నారని సాయిబాబా, కుటుంబం వివరించింది. ఆయనకు చక్రాల కుర్చీ మీద ఉండకతప్పదు. ''జైల్లో టాయిలెట్‌ వరకూ వీల్‌చైర్‌‌లో వెళ్లలేం. స్నానం చేసే చోటుకి కూడా వెళ్లలేం. నేను నా కాళ్లపై నిలబడలేను. నేను బాత్రూమ్‌కి వెళ్లాలన్నా, స్నానం చేయాలన్నా, పడుకోవాలన్నా, అన్ని పనులకూ ఇద్దరు మనుషులు కావాలి. నేను అటూఇటూ తిరగేకి కూడా జైలు సెల్ ఇరుకు’’ అని చెప్పారు.

పోయిన ఉద్యోగం ఇస్తారా?

జైలుకి పంపిన తరువాత సాయిబాబాను దిల్లీ యూనివర్సిటీ ఉద్యోగం నుంచి తొలగించింది. మళ్లీ ఆ ఉద్యోగం వెంటనే ఇవ్వాలి, ఇన్నేళ్ల జీతాలు భత్యాలు ఇస్తారా, ఇవ్వనిస్తారా? 'నేను టీచర్‌గా జీవించి, టీచర్‌గానే చనిపోవాలనుకుంటున్నా. నా ఉద్యోగం నాతోనే ఉండాలనుకుంటున్నాను’ అని బాధపడ్డారు.

ఆరోగ్య సమస్యలను పట్టించుకోకుండా ఎన్నో చిత్రహింసలకు గురిచేసి, మానసికంగా వేధించారన్నారు. కనీసం తన తల్లి చనిపోతే కడచూపు చూడనివ్వలేదన్నారు. ఈ దేశంలో పీడిత ప్రజల గొంతుకయై మాట్లాడిన మేధావులను చిత్రహింసలకు గురి చేయడం పరిపాటిగా మారిందన్నారు.

ఇదా జైలు బ్రతుకు?

జైల్లో సాయిబాబాను ఉంచిన గది అండా బ్యారక్‌గా పిలిచే ఇరుకు గది. ఆ జైలుగదికి కిటికీలు ఉండవు. ఒకవైపు ఇనుప కడ్డీలతో తలుపు ఉంటుంది. యూఏపీఏ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఇది ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన చట్టం అంతా అంటున్నారు. “ఇంతటి క్రూరమైన చట్టం ప్రపంచంలోని ఏ దేశంలోనూ అమల్లో లేదు. ఇది ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు విరుద్ధం. నేను ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్నా. అదే చట్టం కింద నన్ను జైల్లో పెట్టారు. నా గొంతు నొక్కేశారు,” అని సాయిబాబా అన్నారు. అయినా ఎనిమిదన్నరేళ్లు జైల్లో ఉండాల్సి వచ్చింది. నేను ఇంకా కొంతకాలం బతుకుతానని జైలు అధికారులకు కూడా నమ్మకం లేదు. నేను జైలులోనే చనిపోతానని వారు అనుకున్నారు'' అని సాయిబాబా ఒక మీడియాకు వివరించారు.

ఇదీ (అ)న్యాయపు చరిత్ర:

అరెస్టు: ఇది ముందు 2013లో హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహీలను అరెస్టులతో ప్రారంభించారు. హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహీలు మావోయిస్ట్‌ నేతలతో ప్రశ్నించే అనబడే ఎగ్జామినేషన్, ఇంటరాగేషన్, ఇన్ వెస్టిగేషన్ అనే మాటలతో ప్రశ్నల కార్యక్రమంలో ప్రొఫెసర్ సాయిబాబా ప్రమేయం ఉందని పోలీసులు ‘‘కనిపెట్టారు’’. ఇక దాడులు వస్తాయి. 2013లో గడ్చిరోలీ, దిల్లీ పోలీసు బృందాలు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఇంటిపై దాడులు చేశారు. ఆ దాడులో పోలీసులు తన ల్యాప్‌టాప్, నాలుగు పెన్‌డ్రైవ్‌లు, నాలుగు హార్డ్‌డిస్క్‌లు, కొన్ని పుస్తకాలు తీసుకున్నారని ప్రొఫెసర్ సాయిబాబా తెలిపారు.

సస్సెన్షన్: 2014లో మహారాష్ట్ర పోలీసులు ప్రొఫెసర్ సాయిబాబాను దిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లి, అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు.

దోషి!: మహారాష్ట్రలోని గడ్చిరోలీ న్యాయస్థానం ప్రొఫెసర్ సాయిబాబాను యూఏపీఏలోని 13, 18, 20, 39 సెక్షన్లలో దోషిగా తేల్చింది. సుప్రీం కోర్టు జోక్యంతో 2015 జులైలో ఆరోగ్య సమస్యల దృష్ట్యా బెయిల్ మంజూరు చేసింది.

బెయిల్ రద్దు: హైకోర్టు సాయిబాబాకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేసి, సరెండర్‌ కావాలని సూచించింది. 2017లో దోషిగా అంటూ జీవిత ఖైదు విధించింది.

నిర్దోషి, హైకోర్టు తీర్పు: అయితే 2022 అక్టోబర్ 14న బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఆయనను విడుదల చేసారు.

సుప్రీంకోర్టు నిర్ణయం: ఆ తర్వాత 24 గంటల్లో, అంటే అక్టోబర్ 15న జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్ హైకోర్టు తీర్పును ఒప్పుకోలేదు. సాయిబాబా సహా ఇతర నిందితులు 'దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు విఘాతం కలిగించేలా తీవ్రమైన నేరానికి పాల్పడ్డారు' అని సుప్రీంకోర్టు భావించింది.

మళ్లీ మంచి నిర్దోషి అనే తీర్పు: 2024 మార్చి 5న బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ మరోసారి సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. కమ్యూనిస్టు లేదా నక్సలైట్ సాహిత్యాన్ని ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడం, ఏదైనా భావజాలానికి మద్దతుదారుగా ఉండడం యూఏపీఏ చట్టం కిందకు రాదని పేర్కొంది. ఇది దేశం మొత్తం మీద ఉన్న తప్పుడు కేసులన్నింటికి జవాబు ఇచ్చే తీర్పు.

మళ్లీ సుప్రీంకోర్టుకు అప్పీలు: కాని సాయిబాబాను విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ సుప్రీం కోర్టును అప్పీలు చేసుకున్నది.

నిర్దోషి అని సుప్రీంకోర్టు ఆదేశం: ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారి బెంచి ముందుకి ప్రభుత్వం తీసుకువచ్చింది. ఎమర్జెన్సీ అని న్యాయవాదులు వాదించారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు.

స్టే గండం గడిచింది: మళ్లీ సుప్రీంకోర్టు లో తొందరగా పరిశీలించాలని నిర్దోషి తీర్పుపై స్టే ఇవ్వబోమన్నారు. అక్విటల్ మీద స్టే అడుగుతారా ఎవరైనా అన్నారు. అప్పడికీ వాదనలను శనివారం నాడు తీసుకుంటామని అంగీకరించాల్సి వచ్చింది. 90 శాతం లేని దివ్యాంగులైన సాయిబాబాగారు ఈ రెండురోజ్లో పారిపోతారా అని న్యాయమూర్తులు అడిగారు.

అప్పుడుగాని 11 మార్చ్ 2024న సుప్రీంకోర్టు రాజ్యాంగం అప్పీలు, పిటిషన్, స్టే, స్టే తొలగింపు వంటి రకరకాల కష్టాల తరువాత సాయిబాబ విడుదల సాధ్యమైంది.

హమ్మయ్య, సాయిబాబా నిర్దోషి:

నిర్దోషిగా విడుదలైన ఏడు నెలల తర్వాత శనివారం శస్త్రచికిత్స అనంతర సమస్యల కారణంగా జీఎన్. సాయిబాబా శనివారం (అక్టోబర్ 12) రాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో మరణించారు. ఇదీ దుర్గతి. న్యాయవ్యవస్థలోని అధికారులు ఎన్నో ఇబ్బందు సృష్టించారు. ‘‘సహజమైన’’ కాలధర్మం కాకుండా, 12 అక్టోబర్ 2024న ఒక మనిషి రాజ్యాంగ వ్యతిరేకంగా మరణింపచేలా చేశారు. (ఈ పదప్రయోగం తప్పయితే క్షమించండి). ఆయన్ను చంపేసినారా లేక చావనిచ్చినారా అనే వాదనలు జరుగుతూ ఉంటాయి. ఉండాలి కూడా.పోనీలేండి, ఈ రోగాలనుంచి, ఈ సమాజం నుంచి, ఈ చికిత్సల నుంచి, ఈ జైలునుంచి, ఈ ప్రభువుల నుంచి వారి అధికారాలనుంచి సాయిబాబ విముక్తుడైనారు. జోహార్లు. నివాళులు.

Tags:    

Similar News